తాడేపల్లి: కష్టకాలంలో ఉన్న రైతులకు అండగా నిలవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ముఖ్య నాయకులను ఆదేశించారు. అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించి ధైర్యం చెప్పాలని, రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. అందుబాటులో ఉన్న రీజినల్ కో-ఆర్డినేటర్లు, పార్టీ ముఖ్యనాయకులతో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. కష్టకాలంలో ఉన్న రైతులకు అండగా నిలవాలని కోరారు. అధికార యంత్రాంగం మొత్తం నిస్తేజంలో ఉంది.. అకాల వర్షాలు, ఈదురు గాలుల కారణంగా రాష్ట్రంలో పలుచోట్ల ధాన్యం తడిసిపోవడంతో పాటు అనేక ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వైయస్ జగన్ అన్నారు. వర్షాలు కురుస్తాయన్న సమాచారం ముందస్తుగానే ఉన్నప్పటికీ కళ్లాల్లో, పొలాల్లో రైతుల వద్దనున్న ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో తీవ్ర నిర్లక్ష్యం చూపారని, యంత్రాంగం మొత్తం నిస్తేజంలో ఉందని తీవ్రంగా మండిపడ్డారు. ఖరీఫ్‌లో ప్రతికూల వాతావరణం, కనీస మద్దతు ధరలు లభించక తీవ్ర ఇబ్బందులు పడ్డ వరి రైతులు.. ఈ రబీ సీజన్‌లో కూడా కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు సహా పలు చోట్ల ప్రభుత్వం ధాన్యాన్ని సరిగ్గా సేకరించడం లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పుడు అకాల వర్షాలవల్ల మరింతగా నష్టపోతున్నారంటూ తన దృష్టికి వచ్చిన అంశాలను వైయస్ జగన్ పార్టీ నాయకులతో చర్చించారు. దీంతోపాటు పలు ఉద్యానవన పంటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆయన అన్నారు. పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి రైతులకు బాసటగా నిలవాలని, వారిని ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలని వైయస్ జగన్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు.