ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల పార్ట్‌టైమ్‌ లెక్చరర్లకు వైయ‌స్ జగన్ భరోసా

న్యాయం జరిగే వరకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుంది

  వారి న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం

  తాడేపల్లి: రాష్ట్రంలోని ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న పార్ట్‌టైమ్‌, అన్‌ఎయిడెడ్‌ లెక్చరర్లు, బోధనేతర సిబ్బందికి న్యాయం జరిగే వరకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్ జగన్ భరోసా ఇచ్చారు. వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వంపై అన్ని స్థాయిల్లో ఒత్తిడి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో ఏపీ ఎయిడెడ్‌ జూనియర్‌ కాలేజెస్‌/పార్ట్‌టైమ్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు వైయ‌స్ జగన్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. అసోసియేషన్‌ అధ్యక్షుడు అరిగ జోషిరావు వినతిపత్రం అందజేసి, ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేలా సహకరించాలని కోరారు.

రాష్ట్రంలోని ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల్లో 15 నుంచి 25 సంవత్సరాలుగా అన్‌ఎయిడెడ్‌ పోస్టుల్లో పనిచేస్తున్న పార్ట్‌టైమ్‌ లెక్చరర్లు, బోధనేతర సిబ్బందికి ఇప్పటికీ ఉద్యోగ భద్రత, సరైన వేతనాలు, సంక్షేమ ప్రయోజనాలు లభించడం లేదని ప్రతినిధులు వివరించారు. ప్రభుత్వం చేపట్టనున్న 10+2 విధానంలో కాంట్రాక్ట్‌ పోస్టుల భర్తీలో ఇప్పటికే అనుభవం ఉన్న పార్ట్‌టైమ్‌, అన్‌ఎయిడెడ్‌ లెక్చరర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని, వారి సేవా కాలం, విద్యార్హతలు, అనుభవానికి తగిన వెయిటేజీ కల్పించాలని కోరారు. అలాగే సమాన పనికి సమాన వేతనం అమలు చేయడంతో పాటు మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌ వర్తింపజేయాలని, దీర్ఘకాలంగా పనిచేస్తున్న వారిని ప్రత్యేక విధానం ద్వారా రెగ్యులరైజ్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు.

అసోసియేషన్‌ ప్రతినిధుల సమస్యలను సావధానంగా విన్న వైయ‌స్ జగన్, ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తున్న ఉద్యోగులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం వైయ‌స్ఆర్‌సీపీ పూర్తిస్థాయిలో అండగా నిలుస్తుందని, అవసరమైతే అన్ని ప్రజాస్వామ్య వేదికలపై ఈ అంశాన్ని లేవనెత్తి ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు.
 

Back to Top