ఆ రోజు మార్చురీ వ‌ద్ద ఏం మాట్లాడానో..ఇప్పుడు అదే చెబుతున్నా

సీబీఐ విచార‌ణ అనంత‌రం మీడియాతో ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి

నాకు తెలిసిన వాస్తవాలను సీబీఐకి చెప్పాను

విచారణ జరుగుతుండగానే మీడియానే ట్రయల్ చేసి దోషులెవరో తేల్చేస్తున్నారు

వాస్తవాలను టార్గెట్ చేయకుండా వ్యక్తులను టార్గెట్ చేసి విచారణ జరుగుతుంది

వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి

హైదరాబాద్‌:  మాజీ మంత్రి వైయ‌స్ వివేకానంద‌రెడ్డి చనిపోయిన రోజున మార్చురీ దగ్గర  ఏం మాట్లాడానో ఇప్పుడు కూడా అదే చెబుతున్నా..అదే వాస్తవమ‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. విచారణ జరుగుతుండగానే మీడియానే ట్రయల్‌ చేసి దోషులు ఎవరో తేల్చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. తప్పుడు వార్తలు వేయకుండా నిజాలను నిజాలుగా వేయండి. మీడియా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంద‌ని సూచించారు. కడప ఎంపీ వైయ‌స్‌ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. సీబీఐ విచారణలో భాగంగా శుక్రవారం  హైదరాబాద్‌కు వచ్చిన అవినాష్‌రెడ్డి.. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. తనకు తెలిసిన వాస్తవాలే సీబీఐకి చెప్పానని పేర్కొన్నారు. సరైన దిశలో విచారణ జరగాలనే తాను చెబుతున్నానని, వాస్తవాన్ని టార్గెట్‌ చేయకుండా వ్యక్తిని టార్గెట్‌ చేసి విచారణ జరుగుతోందని వైయ‌స్ అవినాష్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

‘సీబీఐ ప్రశ్నలకు నాకు తెలిసిన సమాధానాలు చెప్పా. విచారణపై ఎవరికైనా సందేహాలు వస్తాయి. వివేకా చనిపోయిన రోజున మార్చురీ దగ్గర  ఏం మాట్లాడానో ఇప్పుడు కూడా అదే చెబుతున్నా. అదే వాస్తవం. విచారణ జరుగుతుండగానే మీడియానే ట్రయల్‌ చేసి దోషులు ఎవరో తేల్చేస్తున్నారు. తప్పుడు వార్తలు వేయకుండా నిజాలను నిజాలుగా వేయండి. మీడియా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంద‌న్నారు. ఒక నిజాన్ని వంద నుంచి సున్నాకు తగ్గిస్తూ , ఒక అసత్యాన్ని సున్నా నుంచి వందకు పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయ‌ని అన్నారు. తప్పుడు వార్తలు వేయకుండా నిజాలను ప్రచారం చేయాల‌ని మీడియాకు సూచించారు. 
నేను విజయమ్మ వద్దకు వెళ్ళినప్పుడు బెదిరించి వచ్చానని ప్రచారం చేశారు. నేను దుబాయ్ కి వెళ్ళినట్టు తప్పుడు సమాచారం చేశారు. దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సబబు అని ప్ర‌శ్నించారు. మీడియా ప్రచారం వల్ల దర్యాప్తుపై ప్రభావం పడుతుంద‌న్నారు. 

టీడీపీ చేసిన ఆరోపణలే సీబీఐ కౌంటర్ లో వస్తున్నాయంటే...విచారణపై ఎవరికైనా అనుమానాలు కలుగుతాయ‌న్నారు. విచారణ సమయం లో ఆడియో  వీడియో రికార్డ్ చేయాలని కోరామ‌న్నారు.  కానీ ఎక్కడా రికార్డ్ చేసినట్టు కనబడలేద‌న్నారు. అది గూగుల్ టేకౌటా లేక టీడీపీ టేకౌటా అనేది భ‌విష్యత్తులో తేలుతుంద‌న్నారు.  మళ్లీ విచారణకు రావాలని సిబిఐ వారు నాకు చెప్పలేదన్నారు. నాకు తెలిసిన నిజాలతో కూడిన విజ్ఞాపన పత్రం ఇచ్చాన‌ని తెలిపారు. నా విజ్ఞాపన పత్రంపై కూలంకుశంగా  విచారణ చేయాలని కోరిన‌ట్లు చెప్పారు. 

Back to Top