భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్టుగా విద్యుత్‌ రంగం బలోపేతం 

అధికారులతో సమీక్షలో మంత్రి పెద్దిరెడ్డి 

విజ‌య‌వాడ‌: రాష్ట్రంలో డిమాండ్‌ తగ్గట్టుగా ప్రభుత్వం, విద్యుత్‌ సంస్థలు ప్రజలకు కరెంటు అందిస్తున్నాయని, ఇకమీదట కూడా ఎంత అవసరమైనా విద్యుత్‌ను సరఫరా చేస్తామని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.

రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరా పరిస్థితిపై అధికారులతో శుక్రవారం ఆయన వర్చువల్‌గా సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా, రికార్డు స్థాయిలో 12,653 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌తో 251 మిలియన్‌ యూనిట్ల మేర విద్యుత్‌ వినియోగం జరుగుతున్నా.. విద్యుత్‌ కోతలు విధించడం లేదని  తెలిపారు. భవిష్యత్తులో పెరగనున్న విద్యుత్‌ డిమాండ్‌ను తీర్చడం కోసం విద్యుత్‌ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు.  

భారీగా పెరుగుతున్న డిమాండ్‌  
ఇంధన డిమాండ్‌ ఏటా పెరుగుతూ వస్తున్నదని, గతేడాది గరిష్ట డిమాండ్‌తో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 27.51 శాతం పెరిగిందని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు. ఉదాహరణకు, 2020 మార్చి నెలలో ఇంధన డిమాండ్‌ 5,853.39 మిలియన్‌ యూనిట్లు కాగా,  ఈ ఏడాది మార్చిలో నెలవారీ ఇంధన డిమాండ్‌ దాదాపు 16 శాతం పెరుగుదలతో 6,781.54 మిలియన్‌ యూనిట్లకు  చేరుకుందని చెప్పారు.

అదేవిధంగా, 2020 మే నెలలో సగటు రోజు డిమాండ్‌ 180.69 మిలియన్‌ యూనిట్లుకాగా, ఈ ఏడాది మే 17 వరకు సగటు రోజు డిమాండ్‌ 16.33 శాతం పెరుగుదలతో 210.20 మిలియన్‌ యూనిట్లు ఉందని ఆయన వివరించారు. ఒక్క వైజాగ్‌ నగరంలోనే 2018–19లో 6,696 మిలియన్‌ యూనిట్లు ఉన్న విద్యుత్‌ డిమాండ్‌ 2021–22లో 8,164 మిలియన్‌ యూనిట్లకు, అంటే 22 శాతం పెరిగిందన్నారు.

ఈ విధంగా ఇంధన వినియోగం పెరగడం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి సంకేతమని మంత్రి అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగానికి 9 గంటలు పగటిపూట విద్యుత్‌ సరఫరా ఉచిత విద్యుత్‌ పథకాన్ని బలోపేతం చేయడంలో భాగంగా, ఈ ఏడాది మార్చి నాటికి రాష్ట్రంలో దాదాపు 1.20 లక్షల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు.  

విద్యుత్‌ శాఖ ఎల్లప్పుడూ సన్నద్ధం  
పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని విద్యుత్‌ ఉత్పత్తి కోసం థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లకు బొగ్గు సరఫరాను మెరుగుపరచడానికి ప్రయతి్నస్తున్నామని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ తెలిపారు. ఈ మేరకు కేంద్ర బొగ్గు, రైల్వే మంత్రిత్వ శాఖలతో రాష్ట్ర విద్యుత్‌ శాఖ అధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని వివరించారు.

విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా డిస్కంలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయని, సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉన్నాయని ఆయన వివరించారు. థర్మల్‌ పవర్‌ ప్రొడక్షన్‌ ప్రాజెక్టులు, గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్ట్‌లు, పవర్‌ నెట్‌వర్క్‌ మొదలైన వాటి నుంచి విద్యుత్‌ ఉత్పత్తిని మరింత పెంచేందుకు ఏపీ విద్యుత్తు సంస్థలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు.

మే 18న నమోదైన 251మిలియన్‌ యూనిట్ల డిమాండ్‌లో దాదాపు 103.294 మిలియన్‌ యూనిట్ల డిమాండ్‌ను ఏపీజెన్‌కో ప్లాంట్లు తీర్చాయని సంస్థ ఎండీ కేవీఎన్‌ చక్రధర్‌ బాబు తెలిపారు.  ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీ ఐ.పృథీ్వతేజ్, ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ జె.పద్మజనార్దనరెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ కె.సంతోషరావు తదితరులు పాల్గొన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top