పూడి శ్రీహరి అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తున్నాం

రాష్ట్రంలో దారుణంగా పౌర హక్కులు కాజేస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం

తక్షణమే శ్రీహరిని విడిచిపెట్టాలి

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి 

తాడేపల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (పొలిటికల్‌), మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీపీఆర్‌ఓ పూడి శ్రీహరి అక్ర‌మ అరెస్టును వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌య ఇన్‌చార్జ్‌, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఖండించారు. ఈ ఉదయం మఫ్టీలో వచ్చిన పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారు. వారు ఏ స్టేషన్‌కు చెందిన వారు, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏ కేసులో అదుపులోకి తీసుకుంటున్నారు.. అనే ఏ విషయం చెప్పకుండా.. ఉదయం జగన్‌గారిని కలిసి, తిరిగి ఇంటికి వెళ్తున్న శ్రీహరిని మార్గమధ్యలో అడ్డగించి, బలవంతంగా ఎత్తుకెళ్లారు. శ్రీహరి ఫోన్‌ను, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. కనీసం ఇంటికి వెళ్లి రావడానికి కూడా అవకాశం ఇవ్వకుండా దౌర్జన్యంగా తీసుకెళ్లారు.
    ఇప్పటి వరకు శ్రీహరిని ఎక్కడికి తీసుకెళ్తున్నది చెప్పలేదు. ఆ తర్వాత కాసేపటికి మరి కొంత మంది పోలీసులు శ్రీహరి ఇంటిపై దాడి చేశారు. బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు దౌర్జన్యం చేశారు. ఇంట్లో ఉన్న శ్రీహరి సహాయకుణ్ని బెదిరించి, బయటకు పంపారు. ఆ తర్వాత ఇల్లంతా సోదా చేశారు. అంతసేపూ ఇంట్లోకి ఎవ్వరినీ రానీయలేదు. చివరకు మా పార్టీ ప్రజాప్రతినిధులు వెళ్లినా పోలీసులు వారిని లోనికి రానీయకుండా అడ్డుకున్నారు.
    రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు టార్గెట్‌గా దారుణంగా కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. అక్రమ కేసులు, అరెస్టులు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఏకంగా సీనియర్‌ జర్నలిస్టు అయిన శ్రీహరిని అరెస్టు చేయడం అత్యంత హేయం. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. కూటమి ప్రభుత్వంలో పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించి వ్యవహరిస్తున్నారు. పోలీసుల తీరును ఖండిస్తున్నాం. వెంటనే పూడి శ్రీహరిని బేషరతుగా విడిచిపెట్టాలని లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు.
 

Back to Top