విశాఖ: రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన బంధువులు, బినామీలకు ప్రభుత్వ భూములను పప్పు బెల్లాలకు కట్టబెడుతున్నారని వైయస్ఆర్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మండిపడ్డారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు, విశాఖ ఎంపీ భరత్ ల్యాండ్ గ్రాబింగ్ ఏవిధంగా చేస్తున్నారనే దానికి నిదర్శనమే గీతం యూనివర్సిటీలో జరుగుతున్న భూ దురాక్రమణ అన్నారు. ఇవి ప్రభుత్వ భూములు, ఆక్రమణదారులు శిక్షార్హులు అని ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించి గీతం యూనివర్సిటీ యాజమాన్యం చదును చేసే కార్యక్రమాలు వారి బరితెగింపునకు పరాకాష్ట అన్నారు. విశాఖలో ప్రభుత్వ భూములను ఆక్రమించిన గీతం యూనివర్సిటీ యాజమాన్యం వాటిని క్రమబద్ధీకరించుకునేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని వైయస్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కేకే రాజు ధ్వజమెత్తారు. ప్రెస్‌మీట్‌లో కేకే రాజు ఇంకా ఏమన్నారంటే..: అధికారికంగా జీవో జారీ చేయకముందే.. గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్‌లో ఎలాంటి చర్చ లేకుండానే రూ.5 వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం యూనివర్సిటీకి క్రమబద్ధీకరించేలా తీర్మానం ఆమోదించారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అండతో జీవీఎంసీలో దౌర్జన్యం జరిగింది, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ తీర్మానాన్ని ఆమోదించారు. ఇంకా ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేయకముందే గీతం యాజమాన్యం భూమిని తమ ఆధీనంలోకి తీసుకుని చదును చేసే పనులు ప్రారంభించింది. గతంలో ప్రభుత్వం పెట్టిన ‘ఇది ప్రభుత్వ భూమి..ఆక్రమణదారులు శిక్షార్హులు’ అనే బోర్డులను కూడా తొలగించి లెవలింగ్ పనులు చేస్తున్నారు. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా పనులు జరుగుతున్నా రెవెన్యూ అధికారులు కనీసం స్పందించడం లేదు. బోర్డులను పీకేసి మరి.. గతంలో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం విశాఖ జిల్లాలో జరిగిన భూ ఆక్రమణలపై చర్యలు తీసుకుని సుమారు 2 వేల ఎకరాల భూమిని సంరక్షించింది. ఇందులో భాగంగా గీతం ఆక్రమించిన 40 ఎకరాలకు పైగా భూమిని అప్పట్లో స్వాధీనం చేసుకున్నారు. ఆ భూమిలో నిర్మాణాలను కూడా తొలగించి ప్రభుత్వ భూమిగా బోర్డులు ఏర్పాటు చేశారు. ఇంకా 14 ఎకరాలకు పైగా భూమిపై కోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది, తుది తీర్పు వచ్చే వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని కోర్టు స్టేటస్ కో ఇచ్చింది. అయినప్పటికీ అధికారుల అండతో గీతం యాజమాన్యం మళ్లీ పనులు ప్రారంభించింది. బోర్డులు పీకేసి భూమి చదును చేసే పనులు చేపడుతున్నారు. కార్పొరేట్ సంస్థలకు పప్పు బెల్లాలకు భూములు విశాఖ అభివృద్ధి పేరుతో కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వ భూములను చౌకగా కట్టబెడుతోంది. రెండు మూడు నెలల క్రితం ఏర్పాటైన కంపెనీలకే కోట్ల విలువైన భూములను కేటాయిస్తున్నారు. చిన్నచిన్న వ్యాపారులు చేసుకునే బడ్డీ కొట్లను మాత్రం బుల్డోజర్లతో కూలదోసి వారి పొట్టగొడుతున్నారు. జీవీఎంసీ కమిషనర్ టీడీపీ నాయకులకు తొత్తుగా వ్యవహరిస్తున్నారు. ఊరుపేరు లేని కంపెనీలకు వేలాది రూపాయల విలువ చేసే భూములను చౌకగా కట్టబెడుతున్నారు. విశాఖ నడిబొడ్డున రైల్వే స్టేషన్ వద్ద ఉన్న బస్టాఫ్‌లో సగ భాగాన్ని నెలకు రూ.10 వేల చొప్పున అధికార పార్టీ నాయకుడికి కేటాయించారు. జీవీఎంసీ కమిషనర్, జిల్లా కలెక్టర్, ఆర్డీవోలు చంద్రబాబు చెప్పుచేతుల్లో ఇష్టారాజ్యాంగా భూములు కట్టబెడుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడితే, చట్టానికి విరుద్ధంగా చేసిన భూ కేటాయింపులపై న్యాయపరంగా శిక్ష పడుతుంది. బోర్డులు తొలగించిన గీతం యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. గీతం భూముల వ్యవహారం పూర్తిగా చట్ట విరుద్ధం, ఈ అంశంపై న్యాయపరంగా కూడా పోరాటం చేస్తాం. వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజా పోరాటానికి సిద్ధమవుతున్నామని కేకే రాజు స్పష్టం చేశారు.