ఈవీఎంలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలి

సీఈసీకి విజయసాయిరెడ్డి లేఖ

న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను(ఈవీఎం) భద్రపరిచిన సెంటర్ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైయస్‌ఆర్ సీపీ  జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కోరారు. ఈమేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ ఆరోరాకు శనివారం ఆయన లేఖ రాశారు. ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించే పరిస్థితులు లేనందున ఈవీఎంలు భద్రపరిచిన కేంద్రాల వద్ద సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌ వంటి కేంద్ర బలగాలను మొహరించాలని విజ్ఞప్తి చేశారు. 24 గంటలు పనిచేసేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఓట్లు లెక్కించడానికి చాలా సమయం ఉన్నందున స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద గట్టి నిఘా పెట్టాలని కోరారు.

ఎన్నిల సంఘంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడమే కాకుండా, ధర్నాలు కూడా చేసిన నేపథ్యంలో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించినందుకు వైయస్‌ఆర్ సీపీ  తరపున ఎన్నికల సంఘానికి విజయసాయిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ఏప్రిల్‌ 11న ముగిసిన సంగతి తెలిసిందే. మే 23న ఓట్లను లెక్కించనున్నారు

 

Back to Top