కొత్త మెడికల్‌ కాలేజీలపై ప్రభుత్వం కుట్ర

ప్రైవేటీకరణ కోసమే అడ్మిషన్లు వద్దన్నారు

మాజీ మంత్రి విడదల రజని ఫైర్‌

కొత్త మెడికల్‌ కాలేజీల భూములపై కన్నేశారు

కాసుల కక్కుర్తితో పిల్లల భవిష్యత్తు ఫణంగా పెడుతున్నారు

కష్టపడి సాధించిన అనుమతులు రద్దు చేసుకున్నారు

ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వం దేశంలో ఎక్కడా ఉండదు

5 నెలల్లోనే వైద్య ఆరోగ్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు

మాజీ మంత్రి విడదల రజని స్పష్టీకరణ

మెడికల్‌ కాలేజీల నిర్మాణాలపై సభలో మంత్రి అసత్యాలు

కాలేజీలు, హాస్టళ్ల నిర్మాణాలు మంత్రికి కనిపించడం లేదా?

ఫోటోలతో సహా ఆధారాలు చూపిన మాజీ మంత్రి రజని

అయినా హాస్టల్స్‌ లేవంటూ మంత్రి దురుద్దేశ విమర్శలు

ప్రెస్‌మీట్‌లో మంత్రి సత్యకుమార్‌ తీరును ఎండగట్టిన రజని

గుంటూరు: కొత్త మెడికల్‌ కాలేజీలపై కూట‌మి ప్రభుత్వం కుట్ర చేస్తుంద‌ని, ప్రైవేటీకరణ కోసమే అడ్మిషన్లు వద్దన్నార‌ని మాజీ మంత్రి విడదల రజని మండిప‌డ్డారు.ప్రైవేటీకరణ అనేది కూటమి సర్కార్‌ ఫిలాసఫీ అని, అందుకే రాష్ట్రంలో  మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌ వ్యక్తులకు ధారాదత్తం చేయాలని ప్రయత్నిస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు.  ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ గొప్ప ఆలోచన. గ్రామాల్లోకి సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను పంపి పేదలకు వైద్యం అందించాం.  మా హయాంలో ఎలాంటి సౌకర్యాలు అందించామో ప్రజలకు తెలుసు. ఏపీని మెడికల్‌ హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో వైయ‌స్‌ జగన్‌ పని చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంపై బురద జల్లాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంద‌ని ఆమె త‌ప్పుప‌ట్టారు.  రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కొత్త మెడికల్‌ కాలేజీల విషయంలో వ్యవహరిస్తున్న తీరు, నిర్మాణంలో ఉన్న మెడికల్‌ కాలేజీలపై కౌన్సిల్‌లో మంత్రి సత్యకుమార్‌ చేసిన ఆరోపణలు, విమర్శలపై ఆ శాఖ మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నాయ‌కురాలు  విడదల రజని మంగళవారం గుంటూరులోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. మంత్రి ఆరోపణలు, విమర్శలకు ఆమె థీటుగా బదులిచ్చారు.

 మాజీ మంత్రి విడదల రజని ఏమన్నారంటే..:

మూడు విడతల్లో 17 మెడికల్‌ కాలేజీలు:
– రూ.8,500 కోట్ల వ్యయంతో ఒకేసారి 17 కొత్త గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీల ఏర్పాటు ప్రక్రియను తీసుకొచ్చిన ఘనత జగన్‌గారిది. ఒక్కో కాలేజీకి రూ.500 కోట్లు వ్యయం చేస్తూ మూడు విడతల్లో కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. 
– తొలి విడతలో 2023–24 లో విజయనగరం, రాజమండ్రి, మచిలీపట్నం, ఏలూరు, నంద్యాలలో 5 మెడికల్‌ కాలేజీలు పూర్తి చేసి, ఒక్కో కాలేజీకి 150 సీట్ల చొప్పను మొత్తం 750 సీట్లు అందుబాటులోకి తీసుకొచ్చాం.
– రెండో విడతలో అదోని, పాడేరు, పులివెందుల, మార్కాపురం, మదనపల్లి మెడికల్‌ కాలేజీలు మొదలుపెట్టాం. 
అవి ఈ ఏడాది ప్రారంభించాల్సి ఉందంటూ.. వాటి నిర్మాణానికి సంబంధించి తమ ప్రభుత్వ హయాంలో జరిగిన పనుల ఫోటోలు చూపారు.
ఆయా కాలేజీల హాస్పిటల్స్, కాలేజీ బ్లాక్‌లు, బాయ్స్‌ హాస్టల్, గర్ల్స్‌ హాస్టళ్ల భవనాల ఫోటోలు చూపారు.

వైయ‌స్ జగన్‌కు క్రెడిట్‌ రావొద్దనే..:
– మా ప్రభుత్వ హయాంలో అంత వేగంగా పనులు కొనసాగినా, మంత్రి సత్యకుమార్‌ దురుద్దేశంతో ఆరోపణలు చేస్తున్నారు. పనులు ఎలాగూ ఆపేయాలని చూస్తున్నారు కాబట్టి, కావాలనే ఈ ఆరోపణలు చేస్తున్నారనిపిస్తోంది.
– అంతే కాకుండా ముందుగా నిర్దేశించుకున్నట్లు కొత్త మెడికల్‌ కాలేజీలు మొదలైతే, ఆ క్రెడిట్‌ మొత్తం జగన్‌గారికి వస్తుందన్న ఆలోచనతో, మంత్రి ఈ విమర్శలు చేస్తున్నారని భావిస్తున్నాం.
– హాస్టళ్లు కట్టలేదు కాబట్టి మెడికల్‌ కాలేజీలకు పర్మిషన్‌ రాలేదని మండలిలో మంత్రి తప్పుడు ప్రకటన చేశారు. నిజానికి పులివెందుల మెడికల్‌ కాలేజీలో ఈ ఏడాది కొత్తగా 50 సీట్లకు అనుమతి ఇస్తూ, జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) ప్రభుత్వానికి లేఖ రాస్తే, తాము అవి నిర్వహించలేమంటూ, ప్రభుత్వం రిప్లై రాసింది.
– దీంతో ఆగస్టు 16న పులివెందుల మెడికల్‌ కాలేజీకి ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తూ ఎన్‌ఎంసీ నిర్ణయం తీసుకుంది. ఇంత  ఘోరమైన పని ఏ ప్రభుత్వం చేయదు. కానీ కూటమి ప్రభుత్వం చేసింది. 
కేవలం వైయ‌స్ జగన్‌గారి మీద విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తున్నారు. 

ప్రైవేటీకరణ కుట్ర:
– కొత్త మెడికల్‌ కాలేజీలన్నింటినీ ప్రైవేటుపరం చేయాలన్న కుట్రతోనే కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
– నిజానికి ఇప్పుడు జగనన్న ఉండి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదికన ఈ 5 మెడికల్‌ కాలేజీలు పూర్తయి ఉండేవని ప్రజలే అంటున్నారు. 
– అందుకే కొత్త మెడికల్‌ కాలేజీల పనులు వేగంగా పూర్తి చేసి, మెడికల్‌ సీట్లు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్‌ చేస్తున్నాం.

కేంద్ర సాయం నామమాత్రం:
– కొత్త మెడికల్‌ కాలేజీల్లో పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్ల మెడికల్‌ కాలేజీలకు మాత్రమే రూ.194 కోట్ల చొప్పున కేంద్రం సహాయం అందిస్తోంది. మిగిలిన మొత్తం బడ్జెట్‌లో ప్రత్యేకంగా కేటాయింపులు చేసి నిర్మించాం.
– దశల వారీగా ఏయే కాలేజీలకు ఎంత ఖర్చు చేయాలో ఆ మేరకు కేటాయింపులు చేశాం. ఆ విధంగానే మొదటి దశలో 5 మెడికల్‌ కాలేజీల నిర్మాణం పూర్తి చేసి, వాటిలో సీట్లు అందుబాటులోకి తెచ్చి నిరూపించాం. 

వైద్య ఆరోగ్య రంగం నిర్వీర్యం:
– రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 5 నెలల్లోనే వైద్య ఆరోగ్య రంగం నిర్వీర్యం అయింది. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకపోవడంతో, అవి వైద్యానికి నిరాకరిస్తున్నాయి. ఆరోగ్య ఆసరా లేదు. ఫ్యామిలీ డాక్టర్లు లేరు, మెడికల్‌ కాలేజీలు లేవు. 108, 104 సర్వీసులు మూలన పడ్డాయి. ఆ సిబ్బంది సమ్మెకు దిగుతున్నారు.
ఇంకా నాడు–నేడు పనులకు మంగళం పాడారు. 
– మహానేత వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన 108, 104 అంబులెన్స్‌లను, ఆ తర్వాత దేశవ్యాప్తంగా అమలు చేశారు. అలాంటి వాటి కోసం మరో రెండడుగులు ముందుకేసి 976 కొత్త వాహనాలు కొనుగోలు చేశాం.
– మా ప్రభుత్వ హయాంలో 104 సర్వీస్‌ వాహనాలు 531 నుంచి 768కి పెంచడం జరిగింది. అత్యాధునిక వసతులు, టెక్నాలజీతో వాటిని తీర్చిదద్దాం. 
– ఫోన్‌ చేసిన 15 నిమిషాల్లో వాహనం వెళ్లేది. ఈరోజు గంటలు గడిచినా వాహనాలు వెళ్లడం లేదు. 
– బాధితులను గోల్డెన్‌ అవర్‌లో ఆస్పత్రికి చేర్చి వారి ప్రాణాలు కాపాడాలన్న లక్ష్యంతో గిరిజన ప్రాంతాల కోసం ప్రత్యేకమైన 108, 104 వాహనాలను కొనుగోలు చేసి అందుబాటులోకి తెచ్చాం. 
– అలాంటి సర్వీసులపై మంత్రి సత్యకుమార్‌ అసత్య ఆరోపణలు చేశారు. బాధితులకు మంచి చేసే ఆలోచన పక్కన పెట్టి, వాటి నిర్వహణ బాధ్యత వేరే సంస్థకు అప్పగించేందుకే మంత్రి ఆ ఆరోపణలు చేశారన్న అనుమానం కలగుతోందని మాజీ మంత్రి విడదల రజని తెలిపారు.

Back to Top