ఒక్క వైద్య పథకమైనా తెచ్చారా?

చంద్రబాబుపై వైద్య శాఖ మంత్రి విడదల రజిని ధ్వజం

కనీసం ఒక్క ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ కూడా ఏర్పాటు చేయలేకపోయారు

వైద్యులు, సిబ్బందిని నియమించలేకపోయారు

ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారు

మీకు వైద్య, ఆరోగ్య రంగం గురించి మాట్లాడే హక్కు లేదు 

చిలకలూరిపేట: వైద్య, ఆరోగ్య రంగానికి టీడీపీ పాలనలో ఏం మేలు చేశారో చెప్పాలని చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌కు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని సవాల్‌ విసిరారు. పేదల కోసం ఒక్క వైద్య పథకాన్ని అయినా ప్రవేశపెట్టారా? అని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చిన ఘనత చంద్రబాబుదని మండిపడ్డారు.  పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఆమె మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు తన హయాంలో రాష్ట్రానికి కనీసం ఒక్క ప్రభుత్వ మెడికల్‌ కాలేజీని తీసుకురాలేకపోయారని విమర్శించారు. కొత్త ఆస్పత్రులను ఏర్పాటు చేయడం తర్వాత సంగతి.. కనీసం పాత ఆస్పత్రులను బాగు చేయాలనే ఆలోచన కూడా చంద్రబాబుకు రాలేదని దుయ్యబట్టారు. వైద్య సిబ్బందిని నియమించాలన్న ఆలోచన కూడా గత ప్రభుత్వం చేయలేదని మండిపడ్డారు.

ఆరోగ్యశ్రీ నిధులకు పూర్తిగా కోత విధించి.. దానిని అటకెక్కించేందుకు ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తులు నేడు వైద్య, ఆరోగ్య శాఖ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం గ్రామీణ ప్రజల కోసం ప్రతిష్టాత్మకంగా ఫ్యామిలీ డాక్టర్‌ వైద్య విధానాన్ని తీసుకువస్తే.. దీన్ని కూడా తక్కువ చేసి మాట్లాడటం లోకేశ్‌ అజ్ఞానానికి నిదర్శనమన్నారు.
  
ఇదీ మా ఘనత..  
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ కోసం ఏకంగా రూ.8,300 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి రజిని వెల్లడించారు. టీడీపీ హయాంలో ఆరోగ్యశ్రీ కింద కేవలం 1,059 ప్రొసీజర్లు ఉంటే.. ఆ సంఖ్యను ఏకంగా 3,257కు పెంచామని చెప్పారు. ఈ స్థాయిలో పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్న రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదన్నారు.

ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన రోగులకు వారి ఆరోగ్యం కుదుటపడే వరకు ఆరోగ్య ఆసరా ద్వారా అండగా ఉంటున్న గొప్ప సీఎం వైఎస్‌ జగన్‌ అని చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్‌ విధా­నంలో వైద్యులే నేరుగా ఇళ్లకే వెళ్లి రోగులకు వైద్య సేవలందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 17 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని, వీటిలో ఐదు కాలేజీలను ఈ ఏడాది నుంచే ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.

ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత లేకుండా ఏకంగా 49 వేలకు పైగా పోస్టుల భర్తీ చేపట్టామని చెప్పారు. నాడు–నేడు ద్వారా ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నామని వివ­రించారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు వైద్య, ఆరోగ్య రంగాన్ని అన్ని విధాలుగా బలోపేతం చేస్తున్న ప్రభుత్వం తమదని చెప్పారు. చంద్రబాబు, లోకేశ్‌ చేస్తున్న విష ప్రచారానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు.

Back to Top