దగా డీఎస్సీపై వైయస్సార్‌సీపీ పోరుబాట

 డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి

 మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలి

 తాడేపల్లిగూడెంలో టౌన్‌హాల్‌ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వడ్డీ రఘురామ్‌ నాయుడు

 తాడేపల్లిగూడెం: డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగిన అక్రమాలతో దగాపడిన నిరుద్యోగ యువతకు అండగా వైయస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన "పోరుబాట" కార్యక్రమాలను విజయవంతం చేయాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైయస్సార్‌సీపీ ఇంచార్జ్ వడ్డీ రఘురామ్‌ నాయుడు పిలుపునిచ్చారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెంలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి టౌన్‌హాల్‌ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు.

 డీఎస్సీపై సమగ్ర విచారణ అవసరం

డీఎస్సీ నియామకాలలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి, ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని వడ్డీ రఘురామ్‌ నాయుడు డిమాండ్‌ చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ వెంటనే రాజీనామా చేయాలని కోరారు. డీఎస్సీ నియామకాలపై యువతలో నెలకొన్న అనుమానాలను ప్రభుత్వం పారదర్శకంగా నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉందన్నారు.
 
 నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను తక్షణమే విడుదల చేయడంతో పాటు, ఎన్నికల హామీ ప్రకారం ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి అందించాలని కోరారు. యువత, విద్యార్థుల హక్కుల కోసం వైయస్సార్‌సీపీ పోరాటం కొనసాగిస్తుందని వడ్డీ రఘురామ్‌ నాయుడు స్పష్టం చేశారు.
 

Back to Top