జలశక్తి అభియాన్‌ కింద ఏపీలో 9 జిల్లాల ఎంపిక

రాజ్య‌స‌భ‌లో ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌శ్న‌కు కేంద్ర‌మంత్రి జ‌వాబు

న్యూఢిల్లీ : దేశంలో నీటి కొరతను ఎదుర్కొంటున్న 256 జిల్లాల్లో జల సంరక్షణ, జల వనరుల నిర్వహణను ప్రోత్సహించేందుకు 2019లో ప్రారంభించిన జల శక్తి అభియాన్‌ (జేఎస్‌ఏ) కింద ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, వైయ‌స్ఆర్‌ కడప జిల్లాలను ఎంపిక చేసినట్లు జల శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు సోమవారం రాజ్యసభలో వెల్లడించారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబు ఇచ్చారు. జేఎస్‌ఏ కింద చేపట్టే కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులు, భూగర్భజల నిపుణులు, శాస్త్రవేత్త్లలు ఆయా రాష్ట్ర, జిల్లాల అధికారులతో కలిసి పనిచేస్తారని వివరించారు.

వర్షాన్ని వడిసి పట్టాలి అనే నినాదంతో ప్రారంభించిన జల శక్తి అభియాన్‌లో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వర్షపు నీటిని వడిసి పట్టేందుకు అవసరమైన నిర్మాణాలు చేపట్టడం జరుగుతుంది. ప్రజల భాగస్వామ్యంతో కొనసాగే ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా 2021 మార్చి నుంచి నవంబర్‌ వరకు వర్షాలకు ముందు, వర్షాకాలంలోను అనేక కార్యకలాపాలు నిర్వహించినట్లు కేంద్ర‌మంత్రి తెలిపారు.

Back to Top