రూల్స్‌ ప్రకారం నడుచుకుంటే సెక్రటరీని బెదిరించినట్లా..?

నిబంధనలు పాటించకుండా సెలెక్ట్‌ కమిటీ ఎలా వేస్తారు..?

విచక్షణాధికారానికి కూడా హద్దులు ఉంటాయి

మండలి చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు 

తాడేపల్లి: మండలిలో ఓటింగ్‌ పెట్టకుండా.. సభ్యుల అంగీకారం తీసుకోకుండా వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపిస్తున్నామని శాసనమండలి చైర్మన్‌ సభను నిరవధిక వాయిదా వేశారు. సెలెక్ట్‌ కమిటీ స్వరూపం చెప్పకుండానే.. సభను వాయిదా వేసినప్పుడే కమిటీకి పంపించే అర్హత కోల్పోయారని మండలి చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. అసెంబ్లీ సెక్రటరీని బెదిరించామని టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని, సెక్రటరీని బెదిరించి అవసరం మాకు లేదన్నారు. దీంట్లో తప్పు ఉంది కాబట్టి సెలెక్ట్‌ కమిటీకి పంపించలేమని అసెంబ్లీ సెక్రటరీ చెప్పారని, రూల్స్‌ ప్రకారం నడుచుకుంటే మేము బెదిరించడం ఎలా అవుతుందని ప్రశ్నించారు. 

సచివాలయంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన ఏం మాట్లాడారంటే.. ‘జనవరి 21వ తేదీ అసెంబ్లీలో ఆమోదం పొంది.. 22వ తేదీన మండలిలో ప్రవేశపెట్టారు. రూల్‌ 71 ప్రకారం బిల్లుకు అర్హత లేదు.. ఇది పాలసీ బిల్లు దీన్ని వ్యతిరేకించాం కాబట్టి బిల్లు ప్రవేశపెట్టేందుకు వీల్లేదని అభ్యంతరం చెప్పారు. జీఓ విడుదల అయిన తరువాతే పాలసీ ఫైనల్‌ అవుతుంది. రూల్‌ 71 ప్రకారం పాలసీనే అడ్డుకుంటాం.. చర్చ జరగడానికి వీల్లేదు అని అడ్డుకున్నారు. దీని తరువాత చైర్మన్‌ సభ వాయిదా వేసి చాంబర్‌లో కూర్చొని చర్చ జరగకుండా కాలయాపన చేస్తున్నారని గ్రహించి 71పై చర్చకు ఇష్టమేనని చెప్పాం. 

595 రూల్‌ ప్రకారం స్పష్టంగా చెప్పాం.. ఎప్పుడైతే ఒక అంశాన్ని ప్రవేశపెట్టారో.. ఎవరైనా దానిపై అభ్యంతరం చెప్పాలనుకుంటే ఇమ్మిడియట్‌గా ఈ విషయంపైన సెలెక్ట్‌ కమిటీని కోరబోతున్నానని చెప్పాలి. అది రికార్డులోకి వెళ్లాలి.. సెలెక్ట్‌ కమిటీకి పంపిస్తున్నామని అడగకుండానే సాయంత్రం లెటర్‌ను సెక్రటరీకి ఇచ్చి వెళ్లారు. మేము సెలెక్ట్‌ కమిటీ అడుగుతున్నామని, అప్పటికే రూల్‌ ప్రకారం సెలెక్ట్‌ కమిటీ వేసే అవకాశం, అధికారం వెంటనే ప్రతిపాదించనందుకు కోల్పోయారు. 

మండలి చైర్మన్‌ చాంబర్‌లోకి వెళ్లి రూల్‌ ప్రకారం వెంటనే ప్రతిపాదించాల్సిన అవసరం ఉంది.. వారు ప్రతిపాదించలేదు కాబట్టి వ్యాలిడిటీ ఈ రూల్‌ 71కి లేదు. సెలెక్ట్‌ కమిటీ వేయడానికి వీల్లేదని చెప్పాం. చెప్పిన తరువాత ఏం మాట్లాడకుండా.. చైర్‌లోకి వచ్చిన తరువాత రూల్‌ ప్రకారం జరగలేదు.. తప్పులు ఉన్నమాట వాస్తవమే.. అయినా నా విచక్షణాధికారాలు ఉపయోగించి సెలెక్ట్‌ కమిటీకి పంపిస్తానని చెప్పారు. ఈ మాట చెప్పడానికి చైర్మన్‌ 15 నిమిషాలు వెనకాడారు. తప్పులు జరిగాయని చెప్పిన తరువాత 154కు అవకాశం లేదు. రూల్‌లో క్లారిటీ లేని సందర్భంలో విచక్షణాధికారులు ఉపయోగిస్తాం.. ఇక్కడ క్లారిటీ ఉంది.. వెంటనే ప్రస్తావించలేదు కాబట్టి సెలెక్ట్‌ కమిటీకి పంపించే అవకాశం లేనే లేదు అనేది స్పష్టం. 
సెలెక్ట్‌ కమిటీ వేస్తానని చెప్పి సభను నిరవధిక వాయిదా వేసి వెళ్లిపోయారు. 

దాని తరువాత ఆరు దశలు ఉన్నాయి. 1. సెలెక్ట్‌కి వేస్తున్నానని చెప్పిన తరువాత సభ ఆమోదం తీసుకోవాలి. 2. డివిజన్‌ అని ఏ ఒక్కరు అడిగినా డివిజన్‌ పెట్టాలి. 3. సెలెక్ట్‌ కమిటీ స్వరూపం ఏంటో చెప్పాలి. కౌన్సిల్‌ నుంచి 8 మంది మెంబర్లు ఉంటారని స్పష్టంగా చెప్పాలి. 4. మెంబర్లలో ఏయే పార్టీకి ఎంత మంది సభ్యులు అనేది చెప్పాలి. 5. మీ పార్టీ నుంచి ఎవరి పేర్లు ఇస్తారని ఆ పార్టీ అధినేతను అడగాలి.. ఎప్పటిలోగా ఇస్తారని అనౌన్స్‌ చేయాలి. అప్పుడు సెలెక్ట్‌ కమిటీ వేయాలి. ఇవన్నీ రూల్‌ ప్రకారం చేయాల్సిన పనులు.

సెలెక్ట్‌ కమిటీ వేస్తున్నానని చెప్పి అర్థాంతరంగా లేచి వెళ్లిపోయారు. ఒక రోజు ఓ పత్రికలో సెలెక్ట్‌ కమిటీ వేసినట్లుగా.. కమిటీలో మెంబర్ల పేర్లు కూడా చూశాం. న్యూస్‌ పేపర్‌లో మా వాళ్ల పేర్లను చూసుకోవాల్సి వచ్చింది. దీనిపై మండలి చైర్మన్‌కు లేఖ రాశాను. సభను, సభలోని సభ్యులను గౌరవించాలని ఆలోచన లేకుండా మా పార్టీ మెంబర్ల పేర్లు ఇద్దరివి వేశారు. న్యూస్‌ పేపర్లలో పేర్లు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే.. ఇంతకంటే అవమానం ఎక్కడా ఉండదు. సెలెక్ట్‌ కమిటీ స్వరూపం చెప్పకుండా వెళ్లిపోయినప్పుడే ఆ అర్హత కోల్పోయారు. లీడర్‌ ఆఫ్‌ ది హౌస్‌ సుభాష్‌ చంద్రబోస్, చీఫ్‌ విప్‌నైన నాకు తెలియకుండా పేర్లు ఎలా కమిటీలో వేశారు. న్యాయంగా అయితే షరీఫ్‌పై ప్రివిలేజ్‌ మూవ్‌ చేయొచ్చు కానీ, కౌన్సిల్‌ చైర్మన్‌ అని మర్యాద పాటిస్తున్నాం. 

అసెంబ్లీ సెక్రటరీని బెదిరించామని అంటున్నారు. చైర్మన్‌గా మీరు చేయమన్న పని చేయడమే కాదు.. నిబంధనల ప్రకారం పంపించడానికి వీళ్లేదు..  దీంట్లో తప్పు ఉంది కాబట్టి సెలెక్ట్‌ కమిటీకి పంపించలేమని అసెంబ్లీ సెక్రటరీ చెప్పారు. దానికి బెదిరించినట్లుగా మాట్లాడుతున్నారు. రూల్స్‌కు భిన్నంగా చేస్తూనే మేం చెప్పినట్లుగా జరగాలని మాట్లాడడం తప్పు. విచక్షణాధికారానికి కూడా హద్దులు ఉన్నాయి. రూల్స్‌ ప్రకారం ఇష్టం వచ్చిన వారిని సంప్రదించండి. రూల్స్‌ ఎవరూ బ్రేక్‌ చేయకుండా న్యాయ ప్రకారంగా ముందుకు వెళ్లాలి. 
 

Back to Top