పార్వతీపురం : వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న “వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా మన్యం జిల్లా పార్వతీపురంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో విస్తృత సమావేశం నిర్వహించారు. శ్రీవాసవి ఆర్యవైశ్య ఇండుపూరు వెంకటరావు కళ్యాణ వేదికలో జరిగిన ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), మన్యం జిల్లా పార్టీ అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు, రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ పరిశీలకుడు మావుడి శ్రీనివాస్ నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను మోసం చేస్తోందని, సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలు, అమలు కాని హామీలు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలు, రైతులు, మహిళలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. “వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలకు వాస్తవాలను వివరించి ప్రభుత్వం చేసిన మోసాలను ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే బాధ్యతాయుత ప్రతిపక్షంగా వైయస్ఆర్‌సీపీ పనిచేస్తోందని, ప్రజా హక్కులు, సంక్షేమ పరిరక్షణ కోసం పార్టీ పోరాటం మరింత ఉధృతంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. రానున్న కార్యక్రమాలను విజయవంతం చేయాలని, ప్రతి గ్రామం, ప్రతి వార్డులో ప్రజలతో మమేకమై ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. అనంతరం ఇటీవల పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా నియమితులైన నగేష్ గంగులను మజ్జి శ్రీనివాసరావు అభినందించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.