తిరుపతి: లాక్‌డౌన్ కారణంగా తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనాలు కల్పించలేకపోయినా.. కనీసం స్వామివారి ప్రసాదమైనా భక్తులకు అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రూ. 50 లడ్డూ రూ.25కే భక్తులకు అందించే చర్యలు చేపడుతున్నామని వివరించారు. మరో రెండు రోజుల్లో ప్రసాదాల పంపిణీ ప్రక్రియ అమలు చేస్తామని ఆయన చెప్పారు. తిరుపతిలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అన్ని జిల్లాల్లోని టీటీడీ కల్యాణ మండపాల్లో స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందుబాటులో ఉంచుతామన్నారు. లడ్డూ, ప్రసాదాలు కావాల్సిన వారు ఆలయ అధికారి, పోటు అధికారిని సంప్రదించవచ్చన్నారు. లాక్‌డౌన్ కారణంగా రెండు నెలలుగా స్వామివారి దర్శనాలను నిలిపివేశామని, తిరిగి దర్శనాలు ఎప్పుడు ప్రారంభిస్తామనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. టీటీడీ వద్ద అవసరమైన నిధులు ఉన్నాయని, ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు.. ఎవరూ అపోహలు పడొద్దని సూచించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.1.79 కోట్లు వచ్చిందని, ఈ ఏడాది దర్శనాలు లేకపోయినా ఆదాయం రూ.1.98 కోట్లు వచ్చిందని స్పష్టం చేశారు.