అశ్విని ఆసుపత్రిలోనే అన్ని రకాల వైద్య పరీక్షలు

 టాటా స‌హ‌కారంతో అశ్విని ఆసుప‌త్రి అభివృద్ధి 

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి 

తిరుమల: తిరుమ‌ల‌కు విచ్చేసే భ‌క్తులు, స్థానికులకు అశ్విని ఆసుపత్రిలోనే అన్ని రకాల వైద్య పరీక్షలు అందించనున్నట్లు  టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. భక్తుల సౌక‌ర్యార్థం టాటా ట్రస్ట్‌ స‌హ‌కారంతో అశ్విని ఆసుప‌త్రిని అభివృద్ధి చేశామ‌ని వెల్లడించారు.  ఆధునీక‌రించిన అశ్విని ఆసుప‌త్రిని శుక్రవారం వైవీ సుబ్బారెడ్డి పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. టాటా ట్రస్ట్‌ రూ. 4 కోట్లతో అశ్వని ఆసుపత్రిలో ఆధునిక వైద్య ప‌రిక‌రాల‌ను స‌మ‌కూర్చిందన్నారు. టీటీడీ రూ.65 లక్షలతో ఆసుప‌త్రి ప‌రిస‌రాల‌ను అభివృద్ధి చేసింద‌న్నారు. 30 ప‌డ‌క‌లు గ‌ల ఈ ఆసుప‌త్రిలో 2 ఐసియులు, మినీ ఆప‌రేష‌న్ థియేట‌ర్‌, నూత‌న ప‌రిశోధ‌న‌ శాల ఉన్నాయ‌ని తెలిపారు. అపోలో ఆసుప‌త్రి ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన చికిత్స కూడా అందుబాటులో ఉంద‌న్నారు. క్యాన్సర్‌ స్క్రీనింగ్‌, క్యాన్సర్‌ చికిత్సల కోసం టాటా ట్రస్ట్‌ స‌హ‌కారం అందించ‌నుంద‌ని వివ‌రించారు. గ‌తంలో ఇక్కడి రోగుల‌ను మెరుగైన వైద్యం కోసం తిరుప‌తిలోని స్విమ్స్‌కు రెఫ‌ర్ చేసేవార‌ని, ఇక‌పై అలాంటి అవ‌స‌రం లేకుండా అశ్విని ఆసుప‌త్రిలోనే మెరుగైన వైద్యం అందిస్తామ‌ని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. టీటీడీకి   స‌హ‌కారం అందిస్తున్న టాటా ట్రస్ట్‌కు, అపోలో ఆసుప‌త్రి యాజమాన్యానికి వైవీ సుబ్బారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 
 

Back to Top