శ్రీకాకుళం : దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుని, పేదల గుండెల్లో దేవుడిగా నిలిచిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవితకాలం గుర్తుంచుకోదగ్గ మహనీయుడని వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లాలో వైయస్ఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. వైయస్ఆర్ కూడలి (7 రోడ్డు), మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నివాసం, నరసన్నపేటలలో నిర్వహించిన వైయస్ఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడుతూ, వైయస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరైనందుకు హర్షం వ్యక్తం చేశారు. మాజీ సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. ఆరోగ్యశ్రీ, 104, 108 వంటి ప్రాణరక్షక పథకాలతో పాటు ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా పేద విద్యార్థులకు ఉన్నత విద్యలో అవకాశాలు కల్పించారని, రైతులకు ఉచిత విద్యుత్, పేదలకు ఇంద్రమ్మ ఇళ్ళు, వ్యవసాయం అభివృద్ధి కోసం జలయజ్ఞం ద్వారా 82 నీటిపారుదల ప్రాజెక్టులు ప్రారంభించి అపర భాగీరధుడిగా నిలిచారని అన్నారు. అలాగే ఉద్యోగుల వేతనాల పెంపు, వృద్ధులకు పింఛన్ల పెంపు చేసి విలువలతో కూడిన సంక్షేమ పాలనను అందించారని పేర్కొన్నారు. నేడు ప్రతి వీధిలో ఒక ఎన్నారై, ప్రతి పేదవాడి ఇంట్లో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉన్నాడంటే, అది వైయస్ గారి దూరదృష్టి, దార్శనికత వల్లే సాధ్యమైందని ధర్మాన కృష్ణదాస్ అన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాలు సబ్సిడీతో అందించి, గిట్టుబాటు ధరలు కల్పించి వ్యవసాయాన్ని పండుగ చేసిన వ్యక్తి వైయస్ఆర్ అని ఆయన కొనియాడారు. రైతు పక్షపాతిగా, మాట తప్పని నేతగా నిలిచిన వైయస్ఆర్ చూపిన బాటలో ఆయన కుమారుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు నడుస్తూ, తండ్రి ఆశయాలను ఆచరణలో పెడుతున్నారు. అలాంటి మహానేతకు మనమందరం భక్తిపూర్వక నివాళులు అర్పిద్దామని అన్నారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, యువనాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య, ధర్మాన రామ్మనోహర్ నాయుడు తోపాటు అనేకమంది కార్యకర్తలు పాల్గొన్నారు.