అధికారం కోసం బాబు హత్యా రాజకీయాలకూ వెనుకాడరు 

రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ధ్వజం 

 అనంతపురం:  టీడీపీ అధినేత చంద్రబాబు అధికారం కోసం హత్యా రాజకీయాలకు కూడా వెనుకాడరని అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి చెప్పారు. సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశిస్తూ గాల్లోనే కలిసిపోతాడంటూ వ్యాఖ్యానించడం చంద్రబాబు కుట్రపూరిత మనస్తత్వాన్ని తెలియజేస్తోందన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మల్లాది వాసు అనే వ్యక్తి వల్లభనేని వంశీ, కొడాలి నాని, అంబటి రాంబాబులను హత్య చేయడానికి రూ.50 లక్షల సుపారీ ఇస్తానని బహిరంగంగా వ్యాఖ్యానించినా ఒక్క టీడీపీ నాయకుడూ ఖండించకపోవడం శోచనీయమన్నారు.

గతంలో పరిటాల రవిని ముందుపెట్టి రాష్ట్రవ్యాప్తంగా అరాచకాలు చేశారని, ఇప్పుడూ అలాంటి వారిని తయారు చేయడానికి మల్లాది వాసు అభిమాన సంఘం అంటూ జిల్లావ్యాప్తంగా ఫ్లెక్సీలు వేయిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మహిళా ఎమ్మెల్యే (లక్ష్మీపార్వతి)ని నిండు సభలో అవమానించి కౌరవ సభను నడిపించారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆత్మగౌరవ సభల పేరుతో నాటకాలాడుతున్నారని అన్నారు. 

మాది గౌరవసభ 
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యున్నతి కోసం అనేక పథకాలు, చట్టాలను తీసుకొస్తున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నడుపుతున్నది గౌరవ సభ అని తోపుదుర్తి చెప్పారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి మద్దతు తెలిపినప్పటికీ, వైఎస్సార్‌సీపీ కండువా వేయలేదన్నారు. అదీ తమ నైతికత అని అన్నారు.

టీడీపీ ఎమ్మెల్యే వంశీని ఆ పార్టీ నేతలే అనరాని మాటలు అంటుంటే కౌంటర్‌గా చేసిన వ్యాఖ్యలను శాసన సభలో మాట్లాడినట్లు చంద్రబాబు వక్రీకరించడం తగదన్నారు. భార్యను కూడా రాజకీయాలకు వాడుకుంటున్న దుర్మార్గుడు బాబు అని మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజల నెత్తిన రూ.3.57 లక్షల కోట్ల అప్పు పెట్టి వెళితే.. వైఎస్‌ జగన్‌ ఒకవైపు ఖర్చులు తగ్గించుకుంటూ, మరోవైపు సుపరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. సుమారు 39 లక్షల మందికి రుణ విముక్తి కల్పించే ఓటీఎస్‌ పథకాన్ని కూడా బాబు తప్పుబడుతున్నారని విమర్శించారు. 

తాజా వీడియోలు

Back to Top