కూట‌మి అరాచ‌కాల‌ను ధీటుగా ఎదుర్కొందాం

వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన తిరువూరు కౌన్సిల‌ర్లు

తాడేప‌ల్లి:  కూటమి ప్రభుత్వ అరాచకాలను, దాష్టికాలను ధీటుగా ఎదుర్కుందామని వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి అన్నారు. తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిప‌ల్ కౌన్సిల‌ర్లు పార్టీ అధినేత‌ను క‌లిశారు.  ఇటీవ‌ల మున్సిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్ ఎన్నిక సంద‌ర్భంగా చోటుచేసుకున్న ప‌రిణామాల‌ను ఆయ‌న‌కు వివ‌రించారు.  తిరువూరు నగర పంచాయతీ ఛైర్‌పర్సన్‌ ఎన్నిక సందర్భంగా తమపై టీడీపీ నాయకుల దాడి, దౌర్జన్యం వివరాలు వైయస్‌ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు, కూటమి నేతలు, టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌ రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరించిన తీరును వైయస్ జగన్‌కు వివ‌రించారు. 

పార్టీ అండ‌గా ఉంటుంది:
ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ జరుగుతోందని, స్ధానిక సంస్ధల ఉప ఎన్నికల్లో మెజారిటీ లేకపోయినా బరితెగించి అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారని వైయస్‌ జగన్‌ ఆగ్రహం వ్య‌క్తం చేశారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను, దాష్టికాలను ధీటుగా ఎదుర్కుందామని, చట్టపరంగా, న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుందని భరోసా క‌ల్పించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ధైర్యంగా నిలిచారంటూ కౌన్సిలర్లను వైయ‌స్ జ‌గ‌న్‌ అభినందించారు. సమావేశంలో  ఎన్టీఆర్‌ జిల్లా  వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్‌, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌, తిరువూరు  ఇంఛార్జ్‌ నల్లగట్ల స్వామిదాసు, పలువురు కౌన్సిలర్లు, స్ధానిక నాయకులు పాల్గొన్నారు.

Back to Top