సీఎం నిర్ణ‌యం ప‌ట్ల సినీ ప‌రిశ్ర‌మ‌లో హ‌ర్షాతీరేకాలు

వైయ‌స్ జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన సినీ హీరోలు, ద‌ర్శ‌కులు 

ముఖ్య‌మంత్రి నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తూ సినీ ప్ర‌ముఖులు ట్వీట్ల వ‌ర్షం

హైదరాబాద్‌: కరోనా కారణంగా నష్టపోయిన సినీ పరిశ్రమపై వరాలు కురిపించిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సినీ ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నారు. ఇప్ప‌టికే సినీ అగ్ర‌హీరో మెగాస్టార్ చిరంజీవి, సినీ నిర్మాత‌ల మండ‌లి స‌భ్యులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా కృత‌జ్ఞ‌త‌లు తెలుప‌గా, యంగ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు, నాగ‌బాబు, ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ కూడా థాంక్యూ సీఎం గారు అంటూ ట్వీట్ చేశారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ నిర్ణయం హర్షణీయం.. విపత్కర సమయంలో ఇలాంటి ఉద్దీపన చర్యలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వానికి బిగ్‌ థాంక్యూ. తెలుగు సినీ పరిశ్రమ తిరిగి పూర్వవైభవంతో వెలిగిపోయేందుకు ఇవి ఉపయోగపడతాయి. సినిమా మళ్లీ ట్రాక్‌లో పడుతోంది’’ అని సీఎం వైయ‌స్‌ జగన్‌ నిర్ణయం పట్ల సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు హర్షం వ్యక్తం చేశారు.

సీఎం నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్నాం:  నాగ‌బాబు
 సీఎం తన నిర్ణయంతో లాక్‌డౌన్‌ కారణంగా ఇండస్ట్రీలో ఏర్పడిన శూన్యాన్ని పూడ్చారని నాగ‌బాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ఆపత్కాలంలో పరిశ్రమకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం చొరవతో మూవీ ఇండస్ట్రీకి జవసత్వాలు చేకూరుతాయన్నారు. ఈ మేరకు నాగబాబు ట్వీట్‌ చేశారు.

 
సీఎం వైయ‌స్‌ జగన్‌కు కృతజ్ఞతలు: పూరి జగన్నాథ్‌
‘‘గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు. సినీ ఇండస్ట్రీపై ఆధారపడి బతుకుతున్న ఎన్నో కుటుంబాలకు ఈ రీస్టార్ట్‌ ప్యాకేజీ ద్వారా లబ్ది చేకూరుతుంది. ఇలాంటి గొప్ప నిర్ణయం వల్ల కోవిడ్‌ మహమ్మారితో చితికిపోయిన పరిశ్రమ తిరిగి నిలదొక్కుకుంటుంది’’ అని టాలీవుడ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ ట్వీట్‌ చేశారు.

కాగా థియేటర్లు చెల్లించాల్సిన 3 నెలల ఫిక్స్‌డ్‌ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేస్తూ ఏపీ మంత్రి మండలి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు సంబంధించి మల్టీప్లెక్స్‌లు సహా, అన్ని థియేటర్లకూ ఫిక్స్‌డ్‌ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేయనుంది. నెలకు రూ.3 కోట్ల రూపాయల చొప్పున ప్రభుత్వం భరించనుందని తెలిపింది. దీంతో సినీ ప‍్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
 

Back to Top