సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు రుణపడి ఉంటాం

  వీఆర్వోలకు పదోన్నతులు  

 ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం  

శ్రీకాకుళం :  రాష్ట్రంలో పనిచేస్తున్న అర్హులైన గ్రేడ్ 1 గ్రామ రెవిన్యూ అధికారులను సీనియర్ సహాయకులుగా పదోన్నతులు కల్పించడం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్ర రాజు ఆంధ్ర ప్రదేశ్ రెవిన్యూ జేఏసీ ఏపీ  తహసిల్దార్ల సంఘంతో కలసి  హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్ కు తామంతా రుణపడి ఉంటామని, ఉప ముఖ్యమంత్రి (రెవిన్యూ) మంత్రి ధర్మాన కృష్ణదాస్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో వీఆర్వోలకు పదోన్నతి కల్పిస్తూ జారీ అయిన ఉత్తర్వులను ఉప ముఖ్య మంత్రి ధర్మాన కృష్ణదాస్ స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో శుక్రవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో  అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్ర రాజు, ఏపీ రెవెన్యూ జేఏసీ రాష్ట్ర చైర్మన్ వాస దివాకర్ తదితరులు మాట్లాడుతూ సీఎం జగన్ తన పాదయాత్రలో వీఆర్వోల కష్టాలను చూశారని, అర్హులైన వారందరికీ పదోన్నతులు కల్పిస్తామని మాట ఇచ్చి మేనిఫెస్టోలో పొందుపరిచారని, ఆయన చెప్పినట్టుగానే ఏడో నెలలో జీవో 154 విడుదల చేసి తమ కుటుంబాల్లో ఆనందాన్ని నింపారని అన్నారు. అందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లాలో తొలి విడతగా తమకు ఈ నియామక ఉత్తర్వులు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ చేతుల మీదగా అందాయని సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా రాష్ట్రంలో 450 మంది విఆర్వో లకు ప్రయోజనం కలగనుందని వారు పేర్కొన్నారు. రాష్ట్రంలో  మిగిలిన జిల్లాల్లో కూడా త్వరితగతిన నియామక పత్రాలు అందజేయాలనీ వారు కోరారు. గతంలో వీఆర్ఏల ను విఆర్వోలు గా పదోన్నతులు కల్పించడంతో 4 వేల మందికి ప్రయోజనం కలిగిందని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి ఎం. అప్పలనాయుడు, గుంటూరు జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు సూరేపల్లి రాజశేఖర్, అనిల్ కుమార్, శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి వేణుగోపాలరావు, జి శ్రీనివాసులు, ఏపీ రెవిన్యూ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ అడహక్ కమిటీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు ఆర్ రమేష్ కుమార్, విశాఖ జిల్లా అధ్యక్షులు బి రవి కుమార్, తాసిల్దార్ దారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి. సుగుణ తదితరులు పాల్గొన్నారు.

Back to Top