ఇబ్ర‌హీంప‌ట్నంలో టీడీపీకి షాక్‌

వైయ‌స్ఆర్‌సీపీలో భారీగా చేరికలు 
 

 ఇబ్రహీంపట్నం: ఏపీలో అధికార కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆత్కూరుకు చెందిన ఆరుగురు టీడీపీ కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులు మొత్తం 30 మంది కూటమి ప్రభుత్వ తీరుకు విసుగు చెంది ఆదివారం వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. పటాపంచల సాంబశివరావు, పటాపంచల గోపి, గంగుల నాగరాజు, గంగుల బాలాజీ, గంగుల వెంకట్రావు, గంగుల రమేష్‌ తదితరులకు ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా జోగి రమేష్‌ మాట్లాడుతూ..‘కూటమి పాలన టీడీపీ నేతలకే అసంతృప్తి కలిగిస్తోందన్నారు. ఇప్పటికే ప్రజలు ఆత్మపరిశీలనలో పడ్డారని, వచ్చే ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ విజయం తథ్యం. కూటమి ప్రభుత్వం ఏడాదిగా రాష్ట్ర ప్రజలను చేసిన మోసాలను ప్రజలలోకి తీసుకు వెళ్లేందుకు వెన్నుపోటు దినంగా నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. కూటమి ప్రభుత్వం చేసిన మోసాల్ని ప్రజల సమక్షంలో ఎండగడతాం. మైలవరం నియోజకవర్గంలో జూన్ నాలుగో తేదీన  జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.

జూన్ 4తో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైంది.. ప్రజల నుంచి కూటమి ప్రభుత్వం వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్. ప్రజలను నమ్మబలికిన కూటమి ప్రభుత్వానికి పతనం మొదలైందన్నారు.  జి.కొండూరు మండల వైయ‌స్ఆర్‌సీపీ కన్వీనర్‌ జడ రాంబాబు, ఆత్కూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు గంగుల తిరుపతిరావు అధ్యక్షతన  వైయ‌స్ఆర్‌సీపీలో చేరికలు శుభపరిణామమని అన్నారు.  వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వేములకొండ తిరుపతిరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Back to Top