ఏలూరు: దెందులూరు నియోజకవర్గంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడటం దారుణమని మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి మండిపడ్డారు. పెదవేగి మండలం జగన్నాధపురంలోని వైయస్ఆర్‌సీపీ నాయకుడు పాలడుగు భాను, ఆయన డ్రైవర్ పిట్టా రవిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా దాడులు పాలడుగు భాను, పిట్టా రవి నివాసానికి వెళ్లిన టీడీపీకి చెందిన కొందరు వ్యక్తులు వారిపై దాడికి పాల్పడటం అత్యంత దుర్మార్గమని పేర్కొన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక భౌతిక దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని స్పష్టం చేశారు. దాడిలో గాయపడిన పాలడుగు భాను, పిట్టా రవి ప్రస్తుతం ఏలూరులోని సరస్వతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించారు. వైద్యులను అడిగి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ఉందని అబ్బయ్య చౌదరి స్పష్టం చేశారు. ఆ హక్కును అణచివేయడానికి దౌర్జన్యాలకు పాల్పడితే వైయస్ఆర్‌సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. పాలడుగు భాను, పిట్టా రవిపై దాడికి పాల్పడిన వారిని గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అన్యాయం, అక్రమాలు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా వైయస్ఆర్‌సీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.