నంద్యాల జిల్లా: అధికార తెలుగు దేశం పార్టీ నేతల ఆగడాలు రోజు రోజుకు శృతిమించిపోతున్నాయి. నంద్యాల జిల్లా మహానంది మండలం మసీదుపురం గ్రామంలో నూతన సంవత్సరం సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు విషయంలో వైయస్ఆర్‌సీపీ, టీడీపీ నాయకుల మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయి దాడికి పాల్పడిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. వైయస్ఆర్‌సీపీ నాయకులు, అభిమానులు మసీదుపురం గ్రామంలో నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని బ్యానర్లు ఏర్పాటు చేశారు. అయితే అధికార పార్టీకి చెందిన రాజేష్, ఓబులేసు, శేఖర్ తదితరులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి దిగారు. ఈ దాడిలో వైయస్ఆర్‌సీపీకి చెందిన చిన్న దానమ్మ, పెద్ద దానమ్మ, నరసింహులుతో పాటు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరికి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. టీడీపీ నాయకులపై రాళ్లతో దాడి చేసినట్లు గ్రామ ఎంపీటీసీ మల్లికార్జున రెడ్డి తెలిపారు. గ్రామంలో పోలీసులు వచ్చినప్పటికీ మహిళలని చూడకుండా దాడి చేశారని, గ్రామ ప్రజలకు భయభ్రాంతులకు గురిచేశారని, గతంలోనూ వైయస్ఆర్‌సీపీ అభిమానులపై దాడికి పాల్పడ్డారని చెప్పారు. అయితే ఇప్పటి వరకు దాడికి పాల్పడిన టీడీపీ శ్రేణులపై పోలీసులు కేసు నమోదు చేయలేదు.