కొవ్వూరు: రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ప్రభుత్వం చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో ప్రతిపక్షం ప్రభుత్వం బురదజల్లే ప్రయత్నం చేస్తోందని, ప్రతి విషయాన్ని రాజకీయ రంగు పులిమి కుట్రలు చేస్తోందని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత మండిపడ్డారు. అందులో భాగంగానే విజయవాడ సమీపంలోని కంచికచర్ల రాజీవ్ నగర్ కి చెందిన కాండ్రు శ్యాంకుమార్ ఘటనని వాడుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ ఘటనలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించినా సరే తెలుగుదేశం పార్టీ నాయకులు లేనిపోని బురద చల్లే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని ఆమె తెలిపారు.
కొవ్వూరు క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో పూర్తి వివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. రాష్ట్రం వ్యాప్తంగా వైయస్ఆర్‌సీపీ నిర్వహిస్తున్న సామాజిక సాధికార యాత్ర అద్భుతంగా సాగుతోందని, అది చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష టీడీపీ అబద్దపు ప్రచారాలతో, ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
గత కొంత కాలం చంద్రబాబు అరెస్ట్ పై ఆరోపణలు చేశారని.. ఇప్పుడు కండిషనల్ బెయిల్ పై బయటకు రావడంతో విజయవాడ సమీపంలోని కంచికచర్లలో జరిగిన విద్యార్థుల మధ్య గొడవను దళితులపై దాడిగా చిత్రీకరించాలని కుట్రలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఈ రాష్ట్రంలోని బీసీలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలంతా జగనన్నకి అండగా నిలుస్తున్నారన్నది ఈ సామాజిక సాధికార యాత్రతో రుజువవుతోందన్నారు. కంచికచర్ల ఘటనలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించారన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళితులపై గానీ, ఇతర వర్గాల పై గానీ ఎవరు దాడులు చేసినా, ఎవరు దురాఘతాలు చేసినా మా ప్రభుత్వం, మా పోలీసులు చూస్తూ ఊరుకోరని స్పష్టం చేశారు.
కంచికచర్ల రాజీవ్ నగర్ ప్రాంతానికి చెందిన కాండ్రు శ్యాంకుమార్ ఈ నెల రెండో తేదీన కంచికచర్లలో పోలీసులకు ఫిర్యాదు చేశారని, వెంటనే పోలీసులు IPC మరియు SC & ST Act క్రింద కేసు నమోదు చేశారన్నారు. ఈ ఘటన స్టూడెంట్స్ మధ్య జరిగిన గొడవ అయినప్పటికీ మా ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేయడం తగదన్నారు. జరిగిన ఘటన పై శ్యాంకుమార్ కంచికచర్ల పోలీస్ స్టేషన్ నందు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీసులు , విజయవాడ నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్. ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారని తెలిపారు. పోలీసు అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు 48 గంటలలో ఆరుగురు నిందితులందరిని అదుపులోనికి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగిందని, వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపెట్టడం జరిగిందన్నారు.అంటే ఈ ఘటనలో చాలా స్పష్టంగా, పోలీసులు ఎంత నిష్పక్షపాతంగా వ్యవహరించారో స్పష్టమౌతుందన్నారు.
48 గంటల్లో దళిత యువకుడిపై దాడిచేసిన వారిని అరెస్ట్ చేసిన పోలీసులను హోంమంత్రి అభినందించారు.అసలు దళితుల కోసం మాట్లాడే అర్హత తెలుగుదేశం పార్టీకి ఉందా...? అని ఆమె ప్రశ్నించారు. మన ప్రభుత్వంలో చట్టం ఎవరికీ చుట్టం కాదు.. కారాదని ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చియున్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల పాలనలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ లో దళితులపై దాడులు ఎక్కువ జరిగాయని వివారించారు. చంద్రబాబు నాయుడు ఎప్పటికీ దళిత వ్యతిరేకేనని, అలా చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా..? అని చంద్రబాబు ప్రశ్నించారని గుర్తు చేశారు.
చంద్రబాబు హయాంలో దళితులపై ఎన్నో దాడులు, అత్యాచారాలు జరిగాయని, మహిళా ప్రజాప్రతినిధులపై దాడులు జరిగాయన్నారు. గరగపర్రులో అంబేద్కర్ విగ్రహాన్ని పెడుతుంటే.. 400 కుటుంబాలను వెలివేస్తే ఆనాడు చంద్రబాబు నాయుడు కనీసం స్పందించ లేదన్నారు. అచ్చెన్నాయుడు దళిత మహిళను బూటు కాలితో కడుపులో తన్నారని తెలిపారు. ఇకనైనా చంద్రబాబు నాయుడు దళితులపై కపట ప్రేమను చూపిస్తూ కుల రాజకీయాలు చేయవద్దని కోరుతున్నామన్నారు.
తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటికైనా ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలి. కాలేజీలో విద్యార్థుల గొడవల వలన జరిగిన వివాదానికి రాజకీయ రంగు పులమడం సిగ్గుచేటు అన్నారు. ప్రతిపక్షం ఎన్ని కుట్రలు, తప్పుడు ప్రచారాలు చేసిన దళితుల గుండెల్లో గూడు కట్టుకున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి మీద బురద చల్లలేరు అన్న విషయం గుర్తు పెట్టుకోవాలని హోంమంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు.