స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ కోసం ప్రతిజ్ఞ

 

తూర్పుగోదావరి: స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ కోసం అందరం కృషిచేద్దామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. తూర్పుగోదావరి జిల్లా కరప గ్రామ పంచాయతీలో జరిగిన బహిరంగ సభలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ కోసం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సభకు హాజరైన వారితో ప్రతిజ్ఞ చేయించారు. ‘మహాత్మా గాంధీజీ కేవలం రాజకీయ స్వాతంత్య్రం కోసమే కాక స్వచ్ఛమైన భారతదేశం, అభివృద్ధిని ఆకాంక్షించారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ను సాధించి తద్వారా స్వచ్ఛ భారత్‌ను సాధించే లక్ష్యంలో నేను కృషిచేస్తానని ప్రతిజ్ఞపూనుతున్నాను. నేను పరిశుభ్రంగా ఉండడంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కూడా కేటాయిస్తానని శపథం చేస్తున్నాను. నేను పరిసరాలను అశుభ్రపరచను, వేరేవారిని అశుభ్రపరచనివ్వను. నేను ఈ రోజు నుంచి ప్లాస్టిక్‌ సంచులను, ఒక్కసారి మాత్రమే వాడే ప్లాస్టిక్‌ను వాడను. వాటికి బదులుగా జూట్, వస్త్ర సంచులను వాడుతాను. తద్వారా నా కుటుంబాన్ని, నా రాష్ట్రాన్ని, నా దేశాన్ని ప్లాస్టిక్‌ నుంచి కాపాడుకుంటాను. ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని, భారతదేశాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ప్రతిజ్ఞ పూనుతున్నాను’ అని అందరితో ప్రతిజ్ఞ చేయించారు.

Back to Top