ప్రజల కోసం ఎన్ని కేసులైనా భరిస్తా.. న్యాయస్థానాల్లో న్యాయపోరాటం చేస్తా

పామర్రులో వాస్తవ పరిస్థితులపై ఎస్పీ మనస్సాక్షితో పరిశీలించాలి

మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్

కృష్ణాజిల్లా: జిల్లాలో పోలీసు వ్యవస్థ పనితీరు పూర్తిగా దిగజారిపోయిందని, న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన తనపైనే ఎదురు కేసులు నమోదు చేయడం దారుణమని పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మండిపడ్డారు. కృష్ణాజిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, కూటమి ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ బహిరంగ లేఖ విడుదల చేశారు. నందమూరి తారక రామారావు పుట్టిన కృష్ణాజిల్లాలో గతంలో ఎందరో ఎస్పీలు పనిచేశారని, కానీ ఏనాడూ పోలీసు వ్యవస్థ ఇంతగా మసకబారలేదన్నారు. ప్రస్తుత ఎస్పీ వచ్చిన తర్వాత పోలీసుల పనితీరు పూర్తిగా బ్రష్టుపట్టిందని ఆరోపించారు. చాలామంది పోలీసులు మనసు చంపుకుని విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

పామర్రులో జరిగిన ఒక్క ఘటన చూస్తేనే పోలీసుల పనితీరు ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్తే, విధులకు ఆటంకం కలిగించారనే పేరుతో తనపైనే కేసు నమోదు చేశారని తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలన్నా, ఫిర్యాదు ఇవ్వాలన్నా ముందస్తు అనుమతి తీసుకోవాలా అని ప్రశ్నించారు. ‘‘పోలీస్ స్టేషన్‌కు రావాలన్నా, ఫిర్యాదు ఇవ్వాలన్నా, రోడ్డుపై నడవాలన్నా, రైతు పొలానికి వెళ్లాలన్నా, విద్యార్థులు బడికి వెళ్లాలన్నా పోలీసుల అనుమతి తప్పనిసరి అని ఒక జీవో తీసుకురండి. ప్రతి పోలీస్ స్టేషన్ ముందు ‘ముందస్తు అనుమతి లేనిదే లోపలికి రావడానికి వీల్లేదు’ అని బోర్డులు పెట్టండి’’ అని కైలే అనిల్ కుమార్ ఎద్దేవా చేశారు.

తాము అంబేద్కర్ వారసులమని, చట్టం, రాజ్యాంగంపై అవగాహన ఉన్న కుటుంబం నుంచి వచ్చామని పేర్కొన్నారు. తప్పుడు కేసులు పెట్టించడం, కులాల మధ్య చిచ్చు రేపడం, వర్గాలను రెచ్చగొట్టడం తమ స్వభావం కాదన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టాలని ఏనాడూ పోలీసులకు చెప్పలేదన్నారు. ‘‘నాకు కేసులు కొత్త కాదు. ప్రజల కోసం ఎన్ని కేసులైనా భరిస్తా. న్యాయస్థానాల్లో న్యాయపోరాటం చేస్తా. కానీ తెరవెనుక నుంచి వ్యవస్థను నడిపిస్తున్న తీరు గురించి చర్చ జరగాలి’’ అని స్పష్టం చేశారు. పామర్రు నియోజకవర్గంలో వాస్తవంగా ఏం జరుగుతోంది? అనిల్ కుమార్ వ్యక్తిత్వం ఏమిటి? పోలీసులు చట్టానికి, రాజ్యాంగానికి లోబడి విధులు నిర్వహిస్తున్నారా? లేక ఎమ్మెల్యే చెప్పినట్లు పనిచేస్తున్నారా? అనే అంశాలన్నింటినీ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మనస్సాక్షితో పరిశీలించాలని కైలే అనిల్ కుమార్ కోరారు.
 

Back to Top