విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థిగా చిన అప్పలనాయుడు.

పార్టీ నేతల అభిప్రాయం మేరకు పార్టీ అధ్యక్షులు వైయస్‌.జగన్ నిర్ణయం.

క్యాంపు కార్యాలయంలో విజయనగరం జిల్లా నేతలతో సమావేశంలో ప్రకటించిన వైయస్‌.జగన్‌.

తాడేపల్లి: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీనియర్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పల నాయుడు పేరును మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు  వైయస్‌.జగన్‌ ప్రకటించారు. పార్టీనాయకులతో సమావేశమైన జగన్‌, వారందిరి అభిప్రాయాలను తీసుకున్నారు. పార్టీ నాయకులు వ్యక్తంచేసిన ఏకాభిప్రాయం మేరకు అప్పలనాయుడు పేరును ప్రకటిస్తున్నట్టు వైయస్‌.జగన్‌ వెల్లడించారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్‌నేత బొత్సకు అవకాశం ఇచ్చిన దృష్ట్యా, ఈసారి వెలమ సామాజిక వర్గానికి చెందిన అప్పలనాయుడు పేరును పార్టీ నేతలంతా బలపరిచినందున ఈ నిర్ణయం తీసుకున్నామని వైయస్‌.జగన్ అన్నారు. అనుభవం, సామాజిక వర్గం రీత్యా అప్పలనాయుడు పేరును ప్రకటించామన్నారు. 

అప్పలనాయుడు అనుభవజ్క్షడు, సీనియర్ అయినందున అందరి గౌరవాన్ని పొందుతారన్నారు. సమిష్టి కృషితో విశాఖపట్నం ఎమ్మెల్సీ స్థానాన్ని చేజిక్కించుకున్నామని, విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీనికూడా అదే స్ఫూర్తితో గెలుచుకోవాలని పార్టీనేతలకు వైయస్‌.జగన్‌ పిలుపునిచ్చారు. 

విజయనగరం జిల్లాల్లో స్థానిక సంస్థలకు చెందిన మొత్తం ప్రతినిధుల సంఖ్య 753 అని, ఇందులో 592 మంది  వైయ‌స్ఆర్‌సీపీ స్థానిక సంస్థల ప్రతినిధులుగా గెలుపొందిన వారు ఉన్నారు.  
పార్టీ అభ్యర్థి చినఅప్పలనాయుడు సుమారు నాలుగుదశాబ్దాలుగా ప్రజాజీవితంలో కొనసాగుతున్నారు. బొబ్బిలి నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన శంబంగి వెంకట చినఅప్పలనాయుడు 2019లో ప్రొటెం స్పీకర్‌గా పనిచేశారు.

Back to Top