వైయ‌స్ జ‌గ‌న్‌కు మా సంపూర్ణ మ‌ద్ద‌తు

వైయస్ఆర్ సీపీ ధ‌ర్నాకు మ‌ద్ద‌తు తెలిపిన స‌మాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాద‌వ్‌

ప్ర‌జాస్వామ్య‌ ప‌రిర‌క్ష‌ణ‌, కార్య‌క‌ర్తల కోసం వైయ‌స్ జ‌గ‌న్ పోరాటం

అరాచక పాలనను ధైర్యంగా ఎదుర్కొంటున్న వైయ‌స్ జ‌గ‌న్‌ని, వైయ‌స్ఆర్ సీపీని అభినందిస్తున్నా..

కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌ల అండ‌తో వైయ‌స్ జ‌గ‌న్ మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి అవుతారు

ప్రజలను భయపెట్టేవారు మంచి ముఖ్యమంత్రి కాలేరు

ప్రజాస్వామ్య వ్యవస్థలో హ‌త్య‌లు, దాడులు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు

నేరపూరిత‌ రాజకీయాలను బీజేపీ సమర్థించొద్దు

ధ‌ర్నాలో పాల్గొని ఫొటో గ్యాల‌రీ, దాడుల వీడియోలు వీక్షించిన అఖిలేష్ యాద‌వ్‌

ఢిల్లీ: ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ కోసం, కార్య‌క‌ర్త‌ల కోసం, ఏపీలో జ‌రుగుతున్న అరాచ‌క పాల‌న‌కు వ్య‌తిరేకంగా పోరాడుతున్న వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి త‌న పార్టీ పూర్తిగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తుంద‌ని స‌మాజ్ వాదీ పార్టీ అధ్య‌క్షులు అఖిలేష్ యాద‌వ్ స్ప‌ష్టం చేశారు. ఢిల్లీలో జంత‌ర్ మంత‌ర్ రోడ్డులో వైయ‌స్ఆర్ సీపీ చేప‌ట్టిన ధ‌ర్నా కార్య‌క్ర‌మానికి అఖిలేష్ యాద‌వ్ హాజ‌రై సంఘీభావం తెలిపారు. నిరసన కార్యక్రమంలో పాల్గొని ఫొటో గ్యాలరీని సందర్శించిన అనంత‌రం ఏపీలో జ‌రిగిన దౌర్జ‌న్యాలు, దాడులు, హ‌త్య‌లు, హ‌త్యాయ‌త్నాల‌పై రూపొందించిన వీడియోను వీక్షించారు. అఖిలేష్ యాద‌వ్‌కు ఒక్కో ఘ‌ట‌న‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వివ‌రించారు. 

ఈ సందర్భంగా అఖిలేష్‌ యాదవ్‌ ఏమన్నారంటే..
వైయ‌స్‌ జగన్‌కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ధర్నా కార్యక్రమానికి ఆయన నన్ను ఆహ్వానించారు. ఒకవేళ నన్ను ఆయన ఆహ్వానించి ఉండకపోయి ఉంటే, నేను ఇక్కడికి రాకుండా ఉండి ఉంటే.. నాకు ఇన్ని వాస్తవాలు తెలిసి ఉండేవి కాదు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజం. ఇవన్నీ చూసిన తరవాత, నేను ఒక విషయం స్పష్టం చేయదల్చాను. అధికారంలో ఉన్నవారు సంయమనం పాటించాలి. ప్రజల సమస్యలు పట్టించుకోవాలి. ఎదుటివారు చెప్పేది వినాలి. అంతేకానీ, వారి ప్రాణాలు తీయకూడదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ, ఆ వెంటనే ప్రతిపక్ష పార్టీపై దాడులు మొదలుపెట్టినట్లు.. ఈ ఫొటోలు, వీడియోలు చూసిన తరవాత అర్థ‌మైంది. పట్టపగలే దాడులు చేయడం, హత్య చేయడం, వారి ఆస్తులు ధ్వంసం చేయడం, ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా ఉన్న వారిపై అక్రమంగా కేసులు నమోదు చేయడం, వేధించడం.. అలాగే ఎన్నికైన ప్రజాప్రతినిధులపై ఏకంగా హత్యాయత్నం చేయడం.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు.

నెల‌న్న‌ర క్రితం వరకు వైయ‌స్‌ జగన్ సీఎంగా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు సీఎంగా ఉన్నారు. రేపు మళ్లీ వైయ‌స్ జగన్  ముఖ్యమంత్రి అవుతారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో బుల్డోజర్‌ సంస్కృతిని మా సమాజ్‌వాదీ పార్టీ ఏనాడూ సమర్థించలేదు. దాన్ని తప్పు పడుతున్నాం. చివరకు ప్రభుత్వ పెద్దలు.. అలా బుల్డోజర్‌ సంస్కృతిని పెంచి, పోషిస్తూ.. సమాజానికి ఏం సందేశం ఇవ్వదల్చారు?. అలా చేసి ప్రజలను భయపెట్టాలనుకుంటున్నారా? అది సరికాదు. ప్రజలు సంతోషంగా జీవించాలి. ఎవరైతే ప్రజలను భయపెడుతుంటారో.. వారు మంచి ముఖ్యమంత్రి కారు. అలాగే అది సుపరిపాలన కాదు. మంచి ప్రభుత్వం కాదు. ఒక్క విషయం గుర్తు పెట్టుకొండి. ఆ పని చేసే వాళ్లు ఎక్కువ కాలం అధికారంలో ఉండబోరు. ఇది నిజం.

వైయ‌స్ జగన్‌ని, ఆయన పార్టీ వారిని అభినందిస్తున్నాను. వారు రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనను ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ కార్యకర్తలంతా ఆయన వెంట నడుస్తున్నారు. ఇది గొప్ప విషయం. వైయ‌స్ జగన్ కూడా ఎప్పుడూ కార్యకర్తలతో మమేకం అవుతారు. అలాంటి నాయకుడు ఈరోజు, తమ కార్యకర్తలో కోసం పోరాడుతున్నారు. రేపు వారే పోరాడి, మిమ్మల్ని తిరిగి అధికారంలోకి తీసుకొస్తారు.

ఆంధ్రప్రదేశ్‌లో సాగుతున్న విధ్వంసాన్ని నేష‌న‌ల్ మీడియా అందరికీ చూపాలి. బుల్డోజర్‌ సంస్కృతి అనేది ఎప్పుడూ, ఎక్కడా మంచిది కాదు. మేం యూపీలో దాన్ని చూశాం. వ్యక్తుల ఆస్తులు ధ్వంసం చేయడాన్ని మా యూపీలో చూశాం. అంత కంటే మరో దారుణం కూడా చూశాం. ఫేక్‌ ఎన్‌కౌంటర్‌. ఏకంగా పోలీస్‌ కస్టడీలోనే ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఎవరైనా పోలీస్‌ కస్టడీ సురక్షితం అనుకుంటారు. కానీ, మా దగ్గర ఏకంగా పోలీస్‌ కస్టడీలోనే ఎన్‌కౌంటర్‌ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో వైయస్సార్‌సీపీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోంది. అదే పరిస్థితి మా యూపీలో కూడా చూశాం. మాకు కేవలం ముగ్గురు ఎంపీలు మాత్రమే ఉన్నా కూడా.. ప్రభుత్వంతో పోరాడాము. అంతేకానీ, ప్రభుత్వం ముందు తల వంచలేదు. ఆ తర్వాత మా పార్టీ నుంచి 37 మంది ఎంపీలు గెల్చారు. కాంగ్రెస్‌ నుంచి కూడా ఆరుగురిని గెలిపించాం. ప్రజల వెంట ఉన్నవారిని, వారు ఎప్పుడైనా ఆదరిస్తారు. కాబట్టి, రేపు వైయ‌స్ జగన్‌ని ప్ర‌జ‌లే  గెలిపించుకుంటారు.

బీజేపీ ఒక విషయం గుర్తుంచుకోవాలి. నేరపూరిత‌ రాజకీయాలు చేయకూడదు. ఇలాంటి ఘటనలను సమర్థించొద్దు. వైయస్సార్‌కాంగ్రెస్‌ పార్టీకి, వైయ‌స్‌ జగన్‌కి మా మద్దతు ఉంటుంది. ఇలాంటి పరిస్థితి రేపు మరెవరికైనా జరగొచ్చు. అన్యాయానికి వ్యతిరేకంగా మేమెప్పుడూ పోరాడతాం. అలాంటి వారికి అండగా నిలబడతాం`` అని అఖిలేష్ యాద‌వ్ చెప్పారు.

Back to Top