విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజల గుండెల్లో నిలిచిపోవాలనే ఆలోచనతో సీఎం వైయస్ జగన్ పరిపాలన చేస్తున్నారన్నారు. విజయవాడలో నిర్వహించిన ఓ సదస్సుకు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంకల్పయాత్ర పేరిట 3648 కిలోమీటర్ల పాదయాత్రలో కోట్లాది మందిని వైయస్ జగన్ కలిశారు. లక్షలాది మంది అభిప్రాయాలు తీసుకున్నారు. అంతకు ముందు తనకు ఉన్న అభిప్రాయాలకు మరింత పదును పెడుతూ సీఎం వైయస్ జగన్ మేనిఫెస్టో రూపొందించారన్నారు. కుల, మత, ప్రాంతం, వర్గం, చివరకు పార్టీలు కూడా చూడకుండా ప్రజలందరి మేలు చేసేలా సీఎం వైయస్ జగన్ పరిపాలన చేస్తున్నారన్నారు. రైతులకు, విద్యార్థులకు, యువతకు, ప్రజా ఆరోగ్యానికి దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చేందుకు, తక్షణం ఎలా ఆదుకోవాలని రెండు అంశాలను ఆలోచించిన ముఖ్యమంత్రిగా సీఎం వైయస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. అమ్మ ఒడితో తల్లలుకు సాయం చేస్తూ.. పాఠశాలలను నాడు – నేడు కార్యక్రమంతో అభివృద్ధి చేస్తున్నారు. రైతులకు వైయస్‌ఆర్ రైతు భరోసాతో తక్షణసాయం చేయడంతో పాటు రైతు భరోసా కేంద్రాలతో మేలు చేయడం.. రూ. వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ అమలు.. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు.. ఇలా ప్రతీది దీర్ఘకాలిక ప్రయోజనం, తక్షణసాయం రెండు కోణాల్లో సీఎం వైయస్ జగన్ ఆలోచన చేస్తున్నారన్నారు.
ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ఏదో ఒకటి రెండు పనులు చేసి.. ఏదో ఒక స్టేట్‌మెంట్ ఇచ్చి జరిగిపోయిందని చెప్పుకోవడం కాకుండా ప్రతి విషయంపై సీఎం వైయస్ జగన్ సంపూర్ణ దృష్టిసారించారన్నారు. ప్రజల్లో మమేకమైన నాయకుడు కాబట్టే ప్రజా సేవకుడిగా పరిపాలన చేస్తున్నారన్నారు. ప్రజలు ఇచ్చిన ఈ ఐదేళ్ల కాలాన్ని సద్వినియోగం చేసుకావాలనే తపనతో పనిచేస్తున్నారన్నారు.
కుటుంబం అంతా బాగుండాలని ఇంటి పెద్ద ఎలా ఆలోచిస్తారో.. ఖర్చు పెడుతున్న ప్రతి పైసా ఉపయోగపడాలని ఎలా ఆలోచిస్తామో.. సీఎం వైయస్ జగన్ కూడా రాష్ట్రానికి తండ్రిస్థానంలో నిలబడి ఆలోచిస్తున్నారు. అందువల్లే చిన్నాభిన్నంగా ఉన్న వ్యవస్థల్లో అతి తక్కువ సమయంలోనే మార్పు తీసుకురాగలిగారని సజ్జల అన్నారు. తన పార్టీ, తన కుటుంబ ప్రయోజనాలే ముఖ్యంగా గత ఐదేళ్లు చంద్రబాబు పాలన సాగింది. గతంలో ఎన్నడూ లేనట్లుగా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టారు. ప్రజల మేలు చేసేలా గుర్తుండిపోయే కార్యక్రమం చేశానని ఒక్క పథకం పేరు చంద్రబాబు చెప్పగలడా అని ప్రశ్నించారు. అధికార యంత్రాంగాన్ని చిన్నాభిన్నం చేశాడు. కేవలం స్వలాభాలు చూసుకునే ఒక ముఠాను తయారు చేసి.. నిజాయితీగా పనిచేసే అధికారులను చంద్రబాబు పక్కకు తోసేశాడని సజ్జల మండిపడ్డారు.
పట్టాలు తప్పిన వ్యవస్థను సీఎం వైయస్ జగన్ గాడిలో పెడుతున్నారు. అధికార యంత్రాంగాన్ని మోటివేట్ చేస్తూనే వాళ్లలో స్ఫూర్తిని నింపుతున్నారు. ప్రతి అంశంపై సీఎం వైయస్ జగన్ రివ్యూలు చేపట్టి అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా ఆలోచన చేస్తున్నారని, ఈ ఐదేళ్లలో ఇచ్చిన మాటలు నిలబెట్టుకొని.. ఆ తరువాత ప్రజల ఆశీర్వాదం కోరాలని సీఎం వైయస్ జగన్ భావిస్తున్నారని చెప్పారు. వృథా ఖర్చులు చేయకుండా ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ.. అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం వైయస్ జగన్ అడుగులు వేస్తున్నారన్నారు.