ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా సుదీర్ఘ భేటీ  

రాత్రి 7 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు మంతనాలు 

సమ్మె విరమణ దిశగా మంత్రుల కమిటీ, ఉద్యోగ సంఘాల చర్చలు 

చర్చల తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాలు 

ఉద్యోగుల అసంతృప్తిని సరిదిద్దేందుకు మంత్రుల కమిటీ ప్రయత్నం.. హెచ్‌ఆర్‌ఏ, ఐఆర్‌ రికవరీపై సానుకూల స్పందన 

నేటి మధ్యాహ్నం మరోసారి చర్చలు.. తర్వాత తుది నిర్ణయం

అమరావతి: ఉద్యోగుల ఉద్యమం విరమణ దిశగా మంత్రుల కమిటీ, ఉద్యోగ సంఘాలు సానుకూలంగా చర్చలు జరిపాయి. తాము కోరుతున్న ప్రధాన అంశాల్లో కొన్నింటిపై మంత్రుల కమిటీ సానుకూలంగా స్పందించినట్లు ఉద్యోగ సంఘాలు తెలిపాయి. చర్చలు సఫలమయ్యేలా జరుగుతున్నట్లు స్పష్టం చేశాయి. ఉద్యోగుల అసంతృప్తిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని, శనివారం కల్లా ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రుల కమిటీ తెలిపింది. హెచ్‌ఆర్‌ఏ, ఐఆర్‌ రికవరీ అంశాలపై సానుకూలంగా ఉన్నట్లు మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాలకు తెలిపింది.

శనివారం మరోసారి పూర్తి స్థాయి చర్చలు జరపాలని నిర్ణయించారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో మంత్రుల కమిటీ సభ్యులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ, జీఏడి ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌లు పీఆర్సీ సాధన కమిటీ స్టీరింగ్‌ కమిటీ సభ్యులైన బండి శ్రీనివాసరావు, సూర్యనారాయణ, కే వెంకట్రామిరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు మరో 16 మందితో ఆరు గంటలపాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. రాత్రి 7 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు 6 గంటలపాటు చర్చలు జరిగాయి. తొలుత మంత్రుల కమిటీ తమ అభిప్రాయాలను ఉద్యోగ సంఘాల ఎదుట ఉంచి వాటిపై మాట్లాడాలని సూచించింది. ఉద్యోగ సంఘాల నేతలు సచివాలయంలోనే విడిగా సమావేశమై చర్చించి.. ఆ తర్వాత మళ్లీ మంత్రులతో సమావేశమయ్యారు.  
 
సుహృద్భావ వాతావరణంలో చర్చలు 
చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయి. పీఆర్సీ అమలుపై ఉద్యోగుల్లో ఉన్న అపోహలు, అనుమానాలు తొలగించి, వారి అసంతృప్తికి కారణాలను సాధ్యమైనంత వరకు తగ్గించేందుకు ప్రయత్నించాం. వారు చెప్పిన కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని చర్చించాం. ఉద్యోగులకు చాలా ఉదారంగా మేలు చేద్దామనుకున్నా, కోవిడ్‌ వల్ల వాళ్లు ఆశించిన స్థాయిలో ఇవ్వలేకపోయాం. దీంతో వారిలో ఏర్పడిన అసంతృప్తిని సరిదిద్దే ప్రయత్నం చేశాం. ఈ అంశాలపై శనివారం మధ్యాహ్నం 2 గంటలకు మరోసారి చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకుంటాం. ఉద్యోగులతో ప్రభుత్వానికి ఉన్న స్నేహ పూర్వక వాతావరణాన్ని భవిష్యత్తులో కొనసాగిస్తాం.  
– సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు   
 
ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం 
 సీఎం జగన్‌ ఉద్యోగ సంఘాలతో మాట్లాడిన తర్వాత మిగిలిపోయిన హెచ్‌ఆర్‌ఏ, ఇతర అంశాలను అధికారులతో మాట్లాడుకోవాలని సూచించారు. వాటిపై ఏర్పడిన అసంతృప్తిని సరిదిద్దే ప్రయత్నం చేశాం. హెచ్‌ఆర్‌ఏ, ఫిట్‌మెంట్‌ రికవరీ అంశాలను ఉద్యోగ సంఘాలు ప్రస్తావించాయి. వాటిపై సానుకూలంగా చర్చలు జరిగాయి. ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా శనివారం సాయంత్రం లోపు తుది నిర్ణయం తీసుకుంటాం. 
– బొత్స సత్యనారాయణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి 
 
చర్చలు సఫలమవుతాయనే విశ్వాసం  
మంత్రుల కమిటీతో మంచి వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయి కాబట్టి అవి సఫలమవుతాయనే విశ్వాసం ఉంది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇంకా చాలా విషయాలు చర్చించాల్సి ఉంది. ఉద్యోగుల ఆశలు వమ్ముకాకుండా స్టీరింగ్‌ కమిటీ నేతలం ప్రభుత్వంతో చర్చలు జరిపాం. మంత్రుల కమిటీ నష్ట నివారణకు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చింది.  
– బండి శ్రీనివాసరావు, పీఆర్సీ సాధన సమితి నేత  
 
  

Back to Top