విశాఖ: సామాజిక సాధికార బస్సు యాత్ర విశాఖ జిల్లా తూర్పు నియోజకవర్గంలో ఉత్సాహం ఉరకలేస్తూ సాగింది. ఆరిలోవలోని స్వర్గీయ వైయస్ఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నేతలు ఘన నివాళులు అర్పించారు. అనంతరం తొటగరువులోని జీవీఎంసీ స్కూల్ లో నాడు - నేడు ద్వారా చేపట్టిన పనులను పరిశీలించారు. తర్వాత బస్సు యాత్ర ర్యాలీగా సాగుతూ ఎంవీపీ కాలనీలోని ఏ ఎస్ రాజా కాలేజీ గ్రౌండ్ కు చేరుకుంది. ఇక్కడ జరిగిన బహిరంగ సభకు భారీ ఎత్తున జనం తరలి వచ్చారు. రాష్ట్ర మంత్రులు విశ్వరూప్, సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్ నాథ్, ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, వాసుపల్లి గణేశ్ కుమార్, కరణం ధర్మశ్రీ హాజరయ్యారు. సంక్షేమం అమలులో దేశానికి దిక్సూచి జగన్, పాలనలో రాష్ట్ర దిశ, దశను సీఎం మార్చారు - మంత్రి విశ్వరూప్ ఈ సందర్భంగా బహిరంగ సభలో మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు చేసిన పాలనకు, జగన్ మోహన్ రెడ్డి చేసిన నాలుగున్నరేళ్ల పాలన మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. ఉమ్మడి ఆంధ్రలో 14 లక్షలు పెన్షన్ లను వైఎస్ ఆర్ 60 లక్షలకు పెంచారని, అలాగే జగన్ సీఎం అయ్యాక అంచలంచెలుగా పింఛన్ మొత్తాన్ని రూ. 2,750కి పెంచారని, త్వరలోనే రూ. 3,000 చేయబోతున్నారని అన్నారు. సంక్షేమం అమలు విషయంలో జగన్ పొరుగు రాష్ట్రాలకు దిక్సూచిగా నిలిచారని వివరించారు. రూ. 25 వేల కోట్ల డ్వాక్రా రుణ మాఫీ, రూ. 56 కోట్ల రైతు రుణ మాఫిని జగన్ చేయగా, చంద్రబాబు గత పాలనలో అందర్నీ నమ్మించి మోసగించారని విమర్శించారు. పరిపాలనలో సంక్షేమానికి జగన్ సరికొత్త దిశ, దశను నిర్దేశం చేసారని విశ్వరూప్ పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు వాగ్ధానాలను అమలు చేయక మోసం చేసిన నేత చంద్రబాబు అయితే, హామీలన్నింటిని తూచా తప్పకుండా అమలు చేసిన నిజాయితీ గల నేత జగన్ అని వివరించారు. మైనార్టీలకు, గిరిజనులకు మంత్రి పదవి నాలుగున్నరేళ్లపాటు ఇవ్వకుండా సామాజిక అన్యాయం చంద్రబాబు ఇస్తే, జగన్ అన్ని వర్గాలకు కేబినెట్ లో స్థానం కల్పించడంతో పాటుగా డిప్యూటీ సీఎం పదవులిచ్చి సామాజిక న్యాయం చేసారని వివరించారు. మరోసారి జగన్ సీఎం కాకపోతే ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు తీవ్రంగా నష్ట పోయే ప్రమాదం ఉన్నందున మరోసారి మళ్లీ ఆయన్ను ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని విశ్వరూప్ అన్నారు. వైయస్ జగన్ సీఎం అయ్యాక ఉత్తరాంధ్రకు స్వాతంత్రం వచ్చింది. 10 హార్బర్ లు, నాలుగు పోర్టులతో మత్స్యకారుల ఆత్మగౌరవాన్ని జగన్ చాటారు - మంత్రి సీదిరి అప్పలరాజు పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ, మత్స్యకారుల సమస్యలు చెప్పుకోవడానికి చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో వెళితే వారిని ఫినిష్ చేస్తానని బెదిరించి అవమానపరిచిన ఘటన ఇప్పటికీ అందరినీ కలిచి వేస్తోందన్నారు. మత్స్యకారులు జీవనాధారమైన తిీర ప్రాంత అభివృద్ధికి జగన్ ధృడ సంకల్పంతో ఉన్నారని, ఇందులో బాగంగానే అన్ని జిల్లాల్లో హార్బర్ లు నిర్మాణానికి శ్రీకారం చుట్టారని, రూ. 150 కోట్లతో ఆధునిక హార్బర్ విశాఖలో త్వరలోనే అందుబాటులోకి రానుందని మంత్రి అప్పలరాజు వివరించారు. నాలుగున్నరేళ్లలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు హార్బర్ ల నిర్మాణం చేపట్టడానికి నిధులు కూడా మంజూరు చేసారని వివరించారు. చంద్రబాబు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన కాలంలో ఏనాడైనా సరే మత్స్యకారుల కోసం ఒక్క హార్బర్ ను అయినా సరే నిర్మాణం చేపట్టారా అని ప్రశ్నించారు. ఈ నాలుగున్నరేళ్ల పాలనలో 10 హార్బర్ లు, 4 పోర్టులు ఇచ్చి మత్స్యకారుల ఆత్మగౌరవాన్ని జగన్ చాటి దేశానికి చెప్పారని వెల్లడించారు. ఏ పథకానికి నోచుకోని ఆ చంద్రబాబు పాలన ఎక్కడ, అర్హులైన వారందరికీ ఇళ్లకే వచ్చి లబ్ధి చేకూరుస్తున్న జగన్ పాలన ఎక్కడ, ఎంత వ్యత్యాసం ఉన్నదో ప్రజలు ఆలోచించాలని మంత్రి అప్పలరాజు పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్రులు ఏదైనా కావాలనుకుంటే ఉద్యమాలు, పోరాటాలు చేసేవారని, కానీ ఇప్పుడు జగన్ హయాంలో ఆ అవసరం లేకుండా విశాఖ కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేస్తున్నారన్నారు. జగన్ సీఎం అయ్యాక ఉత్తరాంధ్రకు స్వాతంత్రం వచ్చిందన్నారు. బాబుకు బానిసలుగా ఉందామా.. జగన్ తో కలసి దమ్ముతో రొమ్ము విరుచుకుని ముందుకు సాగుదామా.. బీసీలంతా ఆలోచించాలి - ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, మంత్రివర్గ కూర్పు, రాజ్యసభ సభ్యత్వాలు, కార్పొరేషన్ల ఏర్పాటులో బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యతను జగన్ ఇచ్చారని,. శాసన మండలిలో కూడా బీసీలకే అగ్రతాంబూలం ఇచ్చారని వివరించారు.. 2024 ఎన్నికల్లో జగన్ ఒక్కరే ఒక పక్క వస్తే, చంద్రబాబు, పవన్ మరోవైపు మాయ మాటలతో వస్తున్నారని, ప్రజలు ఈ అంశాన్ని ఆలోచించాలన్నారు. 75 ఏళ్ల తర్వాత బీసీలకు రాజ్యాధికారం కల్పించిన జగన్ మోహన్ రెడ్డి కావాలా, మళ్లీ 70 ఏళ్ల వెనక్కి వెళ్లేలా చంద్రబాబును తెస్తారో ప్రజలు ఆలోచన చేసుకోవాలని పిలుపునిచ్చారు. జగన్ ను సీఎంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. నెల్లూరు జిల్లాలో నాకు మంత్రి పదవి ఇస్తే గొర్రెలు కాచుకునే వారికి ఇచ్చారని హేళన చేసారని, కానీ జగన్ సాహసోపేతంగా నిర్ణయం తీసుకుని యాదవులకు ప్రాధాన్యతను ఇచ్చారన్నారు. శ్రీకృష్ణుడు, ఏసు ప్రభువు కూడా గోడ్లు కాచుకునేవారిని, తర్వాత ప్రజల ఆరాధ్య దైవంగా మారారని గుర్తు చేసారు. పాలు అమ్ముకుంటున్నామనే నారా భువనేశ్వరి హెరిటేజ్ కంపెనీ ద్వారా యాదవుల మీద ఆధారపడి వ్యాపారం చేసుకోవడం లేదా అని ప్రశ్నించారు. నమ్మకానికి మారుపేరు బీసీలు, అలాంటి వారిని జగన్ గుండెల్లో పెట్టుకున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆయన్ను మళ్లీ సీఎంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పిలుపునిచ్చారు. పవన్ వంటి సైడ్ అర్టిస్ట్ నాయకుడు అవసరామా లేదా అని యువత ఆలోచించాలన్నారు. సినిమాల్లో పవన్ పవర్ స్టార్ కావొచ్చు.. కానీ రాజకీయాల్లో మాత్రం చంద్రబాబు జెండా మోస్తాడని, అలాంటి వాడిని నాయకుడుగా ఎలా గుర్తిస్తారో యువత ఆలోచన చేయాలని కోరారు. రాజకీయాల్లో ప్రజల కోసం దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని, సామాజిక సాధికార యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న ఆదరణ చూస్తుంటే సీఎం జగన్ పిలుపునిచ్చినట్లుగా వై నాట్ 175 సాధించడం ఖాయమని అనిల్ కుమార్ యాదవ్ ఉద్ఘాటించారు. ఈ ఆరు నెలల్లో ఇతర పార్టీల నేతలు అనేక వేషాలు వేసుకుని వస్తారని, మోసపోయి బానిసలుగా మిగిలిపోదామా. జగన్ ను గెలిపించి రొమ్ము విరుచుకుని మళ్లీ రాజ్యాధికార పదవుల్లో కొనసాగుదామా అన్నది బీసీ నేతలు ఆలోచించాలన్నారు. విప్ కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ... ఉత్తరాంధ్రకు అన్యాయం చేసే వారిని విశాఖ తూర్పు నియోజకవర్గంలో మళ్లీ ఎన్నుకుంటే ఉపాధి కోసం వలస పోవాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. విశాఖలోని ముడసర్లోవ, మేఘాద్రి గెడ్డ, రైవాడ రిజర్వాయిర్ ల నుంచి ప్రజలకు తాగు, సాగు నీరు అందించకుండా మద్యం డిస్టలరీస్ కు నీరు కేటాయింపులు చేసేందుకు టీడీపీ హయాంలో ప్రయత్నించారన్నారు. ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ..... సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆశలు, ఆశయాలు సాధనకు బీసీలంతా ఏకమై మళ్లీ వైయస్ఆర్ సీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.