అన్యాయానికి గురైన ప్రతి కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుంది..

ప్రజల గొంతు నొక్కే పాలనకు రాజకీయంగా మూల్యం తప్పదు

మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు హెచ్చ‌రిక‌

శ్రీకాకుళం : రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ, పోలీసు వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని ప్రభుత్వం దెబ్బతీస్తోందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ, రాజ్యాంగం కల్పించిన హక్కులను హరిస్తున్నారని విమర్శించారు. అన్యాయంగా కేసులు బనాయించి ప్రజలను జైళ్లకు పంపించడం ద్వారా భయభ్రాంతులకు గురిచేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సింగుపురం (మామిడివలస) గ్రామానికి చెందిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రావాడ ఇల్లయ్య కుటుంబ సభ్యులు జిల్లా జైలులో ఉన్న నేపథ్యంలో, వారిని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, వైయ‌స్ఆర్ సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, పార్టీ నాయకులతో కలిసి సోమవారం జిల్లా జైలులో ములాఖాత్‌లో పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ధర్మాన ప్రసాదరావు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో రోజురోజుకూ శాంతిభద్రతలు దిగజారిపోతున్నాయని, రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు తమ రాజ్యాంగబద్ధ బాధ్యతలను విస్మరిస్తున్నారని అన్నారు. గ్రామాల్లో చిన్నచిన్న వివాదాలను కూడా రాజకీయ కోణంలో చూసి, ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై తీవ్రమైన కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారని విమర్శించారు. సింగుపురానికి చెందిన రావాడ ఇల్లయ్య కుటుంబంపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం కూడా అలాంటి చర్యేనని పేర్కొన్నారు. ఆల్ ఇండియా సర్వీసులకు చెందిన ఉన్నతాధికారులు సైతం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించకుండా అధికార పార్టీ నేతల ఆదేశాల మేరకు పనిచేస్తుండటం బాధాకరమన్నారు. తన రాజకీయ జీవితంలోనూ, రాష్ట్ర చరిత్రలోనూ పోలీసు వ్యవస్థ ఇంతగా రాజకీయ ప్రభావానికి లోనైన పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు.  సోషల్ మీడియా ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే వేదిక అని, ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నిస్తున్న వారిపై తప్పుడు కేసులు నమోదు చేసి వేధించడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. పోలీస్ స్టేషన్లలోనే చట్టవ్యతిరేక చర్యలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపించడం అత్యంత ఆందోళనకరమని పేర్కొన్నారు. దీనివల్ల పోలీసు వ్యవస్థపై ప్రజల విశ్వాసం దెబ్బతింటోందని అన్నారు.

అమాయక రైతులు, నిరుపేదలు, సాధారణ ప్రజలు కూడా తప్పుడు కేసుల్లో జైళ్లలో మగ్గుతున్నారని ధర్మాన ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రజలను శాశ్వతంగా అణచివేయడం ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదని, ప్రజల తిరుగుబాటు ముందు ఏ అధికార వ్యవస్థా నిలబడలేదని చరిత్ర చెబుతోందన్నారు. ప్రభుత్వాలు శాశ్వతం కావని, కానీ రాజ్యాంగం, చట్టాలు శాశ్వతమని గుర్తుంచుకోవాలని అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి నుంచి స్థానిక ప్రజాప్రతినిధుల వరకు అధికార దుర్వినియోగం జరుగుతోందని ఆరోపిస్తూ, ఇలాంటి ధోరణి కొనసాగితే ప్రజలే తగిన తీర్పు ఇస్తారని హెచ్చరించారు. ఈరోజు ఎన్నికలు జరిగినా ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయే పరిస్థితి ఉందని, వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.

ఇటీవల పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిసి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న అధికారుల వివరాలను నమోదు చేయాలని నిర్ణయించినట్లు ధర్మాన తెలిపారు. మండల, జిల్లా, జోన్, రాష్ట్ర స్థాయిల్లో ఈ సమాచారాన్ని సేకరించి భద్రపరుస్తామని, భవిష్యత్తులో చట్టపరంగా అవసరమైన చర్యలకు వాటిని వినియోగిస్తామని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఒకరిని బెదిరిస్తే పది మంది, పదిమందిని అణచివేస్తే వంద మంది ముందుకు వస్తారని చరిత్ర చెబుతోందన్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా ప్రజలు ఐక్యంగా నిలబడి ప్రశ్నించాలని, సోషల్ మీడియాలో అభిప్రాయాలను వ్యక్తం చేయడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని స్పష్టం చేశారు. ఆ హక్కును ఎవరూ హరించే అధికారం లేదని, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ధైర్యంగా ముందుకు రావాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు.
 

Back to Top