అధికారం అండతో.. బరితెగింపు 

రెవెన్యూ అధికారులపై దాడి చేసింది టీడీపీ నాయకుడే

ఆర్‌ఐపై దాడితో సీరియస్‌ అయిన రెవెన్యూ యంత్రాంగం

రూ.2 కోట్ల విలువచేసే ప్రభుత్వ స్థలాలు ఆక్రమించినట్లు గుర్తింపు

జేసీబీలతో ఆక్రమణలు నేలమట్టం

మదనపల్లె : రెడ్‌బుక్‌ రాజ్యాంగం అండతో టీడీపీ గూండాలు దాడులకు తెగబడుతున్నారు. అధికారంలో ఉన్నది తామేనన్న అహంతో కళ్లు కనిపించక ఏకంగా రెవెన్యూ అధికారులపైనే దాడులకు పాల్పడుతున్నారు. ఆక్రమణలకు అడ్డువచ్చిన అధికారులను మారణాయుధాలతో హత్యచేసేందుకు వెనుకాడటం లేదు. రెండురోజుల క్రితం మదనపల్లె మండలం తట్టివారిపల్లె పంచాయతీ దేవతానగర్‌...సర్వే నంబర్‌.1029లో ఆక్రమణలు తొలగించేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై మారణాయుధాలతో దాడికి పాల్పడి, జేసీబీకి నిప్పుపెట్టి బెదిరింపులకు పాల్పడిన భూకబ్జాదారుడు టీడీపీ నాయకుడేనని తెలిసింది. 

టీడీపీలోని ప్రధాన నాయకుల అండదండలతో మదనపల్లె పట్టణం, మండలంలో సుమారు రూ.2కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ స్థలాలను తప్పుడు పత్రాలతో ఆక్రమించుకోవడమే కాకుండా, వాటిని యథేచ్ఛగా ఇతరులకు లీజు అగ్రిమెంట్‌పై విక్రయించినట్లు తెలిసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరింత జోరు పెంచినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే దేవతానగర్‌లోని ప్రభుత్వ గయాలు స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడం, అడ్డువచ్చిన రెవెన్యూ అధికారులపై దాడికి పాల్పడటం జరిగింది. రెవెన్యూ అధికారులపై భూకబ్జాదారుడి దాడి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్‌ కావడంతో జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరి, సబ్‌ కలెక్టర్‌ మేఘస్వరూప్‌ ఈ విషయంపై సీరియస్‌ అయ్యారు. దాడికి పాల్పడిన నిందితుడు చలపతి ఆక్రమణలు ఎక్కడెక్కడ ఉన్నాయో నిగ్గుతేల్చాల్సిందిగా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. 

దీంతో వారు ఆగమేఘాలపై...దేవతానగర్‌ సర్వేనెం.1029లోని ప్రభుత్వ గయాలు స్థలం, బీకే.పల్లె సర్వేనెంబర్‌.516/1లో 6 సెంట్ల స్థలంలో రెండు పునాదులు, రెండు షాపురూములు, కోమటివానిచెరువు సమీపంలోని ఎస్‌బీఐ కాలనీలో ఇంటిస్థలం, సీటీఎం క్రాస్‌రోడ్డులో ఇంటిస్థలం ఆక్రమించినట్లు నిర్ధారించారు. దీంతో సబ్‌ కలెక్టర్‌ మేఘస్వరూప్‌, ఆక్రమణలను తొలగించడంతో పాటుగా, అక్రమనిర్మాణాలను నేలమట్టం చేయాల్సిందిగా ఆదేశించారు. బుధవారం రాత్రి వరకు పట్టణంలోని ఆక్రమణలు తొలగించిన రెవెన్యూ అధికారులు, గురువారం ఉదయం సీటీఎం క్రాస్‌లోని అక్రమ నిర్మాణాన్ని తొలగించేందుకు ప్రయత్నించారు. 

అయితే..ఆ స్థలంలో భైరవేశ్వర ఎలక్ట్రికల్స్‌, హార్డ్‌వేర్స్‌ పేరుతో దుకాణం ఉండటంతో ఖాళీ చేయాల్సిందిగా అధికారులు కోరారు. దుకాణదారుడు...తాను రూ.10లక్షలకు చలపతి నుంచి స్థలాన్ని కొనుగోలు చేశానని, 20లక్షలకు పైగా ఖర్చుచేసి దుకాణాన్ని నిర్మించుకున్నానన్నారు. రెవెన్యూ అధికారులు ఉన్నఫళంగా దుకాణాన్ని కూల్చేస్తే తన పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశాడు. జేసీబీకి అడ్డుగా కుటుంబ సభ్యులతో బైఠాయించాడు. ప్రభుత్వ స్థలాన్ని కొనుగోలు చేయడం నేరం కిందకే వస్తుందని, పై అధికారుల ఆదేశాలు తాము తప్పక పాటించాల్సిందేనని, పోలీసుల సహాయంతో ఆక్రమణల తొలగింపునకు పూనుకున్నారు. 

భవనాన్ని నేలమట్టం చేశారు. అయితే... అక్కడ గుమికూడిన ప్రజలు, గ్రామస్తులు..రెవెన్యూ అధికారిపై దాడిచేశాడని ఆక్రమణల తొలగింపుకు హడావిడి చేస్తున్నారే కానీ, ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేస్తున్నప్పుడు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులు, భూకబ్జాదారుడైన టీడీపీ నాయకుడు చలపతికి మధ్య జరిగిన పోరులో అమాయకుడు తన కష్టార్జితాన్ని 30 లక్షలకు పైగా నష్టపోయి, రోడ్డున పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్రమణ తొలగింపులో తాలూకా సీఐ కళా వెంకటరమణ, సర్వేయర్‌ రెడ్డిశేఖర్‌, వీఆర్వోలు, పోలీసులు పాల్గొన్నారు.

Back to Top