అమరావతి: టీడీపీ నేతలు ఓటమి అక్కసుతో రగిలిపోతున్నారు. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. కడుపు మంటతో భౌతిక దాడులకు దిగుతున్నారు. రోజు రోజుకు పచ్చ నేతల ఆగడాలు అధికమవుతున్నాయి. నిన్న వైయస్‌ఆర్‌సీపీకి చెందిన దళిత, మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. తుళ్లూరు మండలం అనంతవరంలో ఎమ్మెల్యే శ్రీదేవి గణేష్ చతుర్థి వేడుకల్లో పాల్గొంటే వినాయకుడు మైలపడతాడు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించారు. ఇవాళ సింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం ఏ. కొండాపురంలోనూ టీడీపీ నేతల దాడిలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు కార్యకర్తలు గాయపడ్డారు. కొండాపురం గ్రామంలో వినాయకచవితి వేడుకలు వైయస్‌ఆర్‌సీపీ నేతలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన టీడీపీ నేతలు వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని, తాము చెప్పినట్లు నడుచుకోవాలని దాడికి పాల్పడ్డారు.అలాగే ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ స్వగ్రామమైన కౌకుంట్ల గ్రామంలో టీడీపీ నేతలు దాష్టీకానికి పాల్పడ్డారు. వైయస్‌ఆర్‌సీపీకి ఓటు వేశారన్న కారణంతో టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడటంతో నలుగురు వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన వారిని పోలీసులు గుర్తించారు. అయితే ఇప్పటిదాకా పోలీసులు నిందితులను అరెస్టు చేయలేదు.