హైకోర్టు ఆదేశాలంటే లెక్కలేదా?

మాజీ ఏఏజీ, సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి
 

హైదరాబాద్‌: చట్టాన్ని లెక్క చేయకుండా ఏపీలో ప్రభుత్వం పనిచేస్తుందని.. హైకోర్టు ఆదేశాలను ఖాతరు చేయకుండా వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయాన్ని కూల్చేశారని మాజీ ఏఏజీ, సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గుర్తింపు పొందిన పార్టీలకు ఆఫీస్‌లు కట్టుకోవడానికి చంద్రబాబే 340 జీవో తీసుకొచ్చారన్నారు. పాలకులు మారొచ్చు.. కానీ చట్టం మారదు. న్యాయవ్యవస్థ ఆదేశాలను తుంగలో తొక్కారని పొన్నవోలు సుధాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. 

నిన్నటి నుంచి ఇవాళ ఉదయం వరకు ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన సంఘటనలు దురదృష్టకరమని, ప్రభుత్వం, సీఆర్డీయే అధికారులు న్యాయవ్యవస్ధ ఆదేశాలను తుంగలో తొక్కారని మాజీ అడ్వొకేట్ జనరల్ పొన్ననోలు సుధాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని లెక్క చేయకుండా ఏపీలో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. 

చట్టం, కోర్టులు వాటి ఆర్డర్లు తెలిసిన వ్యక్తిగా అవి బేఖాతరు అయిన పరిస్థితుల్లో, లెక్క చేయనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు గర్హనీయమన్నారు.  

సూర్యోదయానికి ముందే సుమారు 4 గంటలకు మొదలుపెట్టి… కోర్టు ఆర్డరు ఉన్నా వైయస్సార్సీపీ కార్యాలయాన్ని కూల్చి వేశారని... కొన్ని వందల మంది పోలీసులు సమక్షంలో… జేసీబీలు, ప్రొక్లెయినర్లతో వైయస్సార్సీపీ కార్యాలయాన్ని కూల్చివేసిన విధానాన్ని కచ్చితంగా ప్రజలందరి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పొన్నవోలు తేల్చిచెప్పారు. 
కోర్టులో పోరాడిన వ్యక్తిగా… అన్ని విషయాలు తెలిసిన వ్యక్తిగా మీడియా ద్వారా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. 
 
అసలు రాజకీయపార్టీల కార్యాలయాలకు స్ధలాలు ఇవ్వాలని జీవో తీసుకొచ్చిందే గత చంద్రబాబు ప్రభుత్వమన్న ఆయన…  దీనికి సంబంధించి 21-07-2016 నాడు  జీవో ఎంఎస్ నెంబరు 340 ను గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.  దీని ప్రకారం గుర్తింపు ఉన్న జాతీయ పార్టీలకు, ప్రాంతీయ పార్టీలకు ప్రతి జిల్లాలో వారి కార్యాలయాలు నిర్మించుకోవడానికి, ఆయా పార్టీల ప్రాతినిధ్యం బట్టి.. దిగువ సభలో 50 శాతం మంది సభ్యులు ఉంటే… అంటే 175 మంది ఎమ్మెల్యేల్లో 50 శాతం మంది ఉంటే ఆ పార్టీకి 4 ఎకరాలు ప్రతి చోటా స్ధలం ఇవ్వాలని జీవో నంబరు 340 తీసుకొచ్చిందే చంద్రబాబు ప్రభుత్వమని చెప్పారు.
దీని ప్రకారం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో  20-07-2015 నాడు జీవో ఎంఎస్ నెంబరు 279 ద్వారా వైయస్సార్ కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఒక ఎకరా కేటాయించారు. అదే విధంగా జీవో ఎంఎస్ నెంబరు 228 ప్రకారం 22-06-2017 నాడు 3 ఎకరాల 65 సెంట్ల స్ధలాన్ని మంగళగిరి మండలం ఆత్మకూరులో జాతీయ రహదారికి ఆనుకుని తెలుగుదేశం పార్టీ ఆఫీసుకి కేటాయించారన్నారు. 
దురదృష్టకరమైన విషయం ఏమిటంటే… బీఎస్ఓ 15-4 ప్రకారం  వాగు పోరంబోకు అసైన్ చేయడానికి వీలు లేదని.. అయినా కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో జీవో నెంబరు 228 ద్వారా స్ధలాన్ని కేటాయించుకున్నారన్నారు. 

ఇక జిల్లాల వారీగా చూస్తే… వైయస్ఆర్‌ కడప జిల్లాలో జీవో నంబరు 279 ప్రకారం 1 ఎకరా స్ధలం, శ్రీకాకుళం జిల్లాలో జీవో నెంబరు 318 ద్వారా 2010లో 2 ఎకరాలు దఖలుపర్చుకున్నారు. గుంటూరులో 3.65 సెంట్లుతో పాటు విజయనగరం, కృష్ణా, ప్రకాశం , చిత్తూరులో ఈ జీవో ప్రకారం పార్టీ ఆఫీసులకు స్ధలాలు కేటాయించుకున్నారు. వాళ్లు తీసుకొచ్చిన చట్టం ప్రకారమే ఎకరాకు రూ.1000 లీజు అమౌంట్  నిర్ణయించింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమేనని... ఈ జీవో ప్రకారం మీరు తీసుకున్నారా ? లేదా?  అని ఆయన ప్రశ్నించారు. 

ఈ జీవో  ప్రకారమే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ… 175 కి 151 స్ధానాలు కలిగి ఉన్నా కూడా 2019లో కేవలం 2 ఎకరాలు మాత్రమే బోట్ యార్డు ఏరియాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తీసుకోవడం  ఏ విధంగా చట్ట వ్యతిరేకం అవుతుందని ఆయన ప్రశ్నించారు. 

ప్రభుత్వం మారినా.. రాజ్యం మారదని, వ్యక్తులు మాత్రమే మారుతారని ఆయన చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లీజుకి తీసుకున్న 2 ఎకరాల స్ధలం.. సీఆర్డీయే ప్రాంతంలో ఉందని, దానికి పర్మిషన్ తీసుకోలేదని నోటీసులు ఇచ్చారని…  సీఆర్డీయే సెక్షన్ 108 ప్రకారం పర్మిషన్ తీసుకోవాలని చట్టం నిర్దేశించిందన్న ఆయన… అది వర్చువల్ పోర్టల్ అని.. ఈ స్ధలం ఉన్న 201,202 బై ఏ 1  సర్వే నెంబరు ప్రభుత్వ స్ధలం కాబట్టి…  ఆ సర్వే నెంబరును ప్రభుత్వ ప్రొహిబిటెడ్ జాబితా నుంచి తీయలేదు కాబట్టి…. ఎన్నిసార్లు ఈ పోర్టల్ ద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పర్మిషన్ కోసం దరఖాస్తు చేసినా.. ఆ పోర్టల్ రిసీవ్ చేసుకోలేదన్నది నిజం కాదా?  అని ప్రశ్నించారు. 

ఆ తర్వాత సీఆర్డీయే అధికార్లు  ప్రొవిజనల్ ఆర్డర్ 108, 114 ప్రకారం నోటీసు ఇచ్చారు. అనుమతి తీసుకోలేదు కాబట్టి.. మీరే దాన్ని తొలగించాలని 10 వ తేదీ నోటీసుపై వేసి… 15 వ తేదీన నోటీసు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.  నోటీసులు  తీసుకున్న తర్వాత లంచ్ మోషన్ ద్వారా హైకోర్టులో ఫైల్ చేసి.. తాను వాదనలు వినిపిస్తూ….  ప్రభుత్వం వైయస్సార్సీపీ భవనాన్ని కూల్చివేయబోతున్నారు… కాబట్టి రక్షణగా స్టే ఇవ్వాలని కోరితే ప్రభుత్వం
తరపున వచ్చిన న్యాయవాదులు మేం ఆ భవనాన్ని కూల్చబోవడం లేదని, వుయ్ ప్రొసీడ్ యాస్ ఫర్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని చెప్పిన విషయాన్ని పొన్నవోలు గుర్తు చేసారు. ఈ మాటను గౌరవ న్యాయస్ధానం రికార్డు చేసిందన్నారు. 

మరోవైపు సెక్షన్ 114  ప్రకారం అక్రమ నిర్మాణం ఉంటే నోటీసు ఇచ్చే హక్కు ఉంటుందని… అయితే సీఆర్డీయే చట్టం 115 ప్రకారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వివరణ తీసుకోవాలని… అది కూడా ఇచ్చామన్నారు. ఆ వివరణ నచ్చకపోతే మీరు అంతిమంగా కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వాలన్నారు. ఆ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా టైం ఇచ్చి… మా వివరణ ఇచ్చిన తర్వాత అది నచ్చకపోతే అప్పుడు కూల్చే హక్కు ఉంటుందన్నారు. అప్పుడు కూడా సీఆర్డీయే యాక్టు 116 ప్రకారం మాకు ట్రిబ్యునల్కు వెళ్లే హక్కు ఉంటుందని.. అక్కడ కేసు తేలేంత వరకూ కూడా కూల్చే హక్కు లేదని ఇదే చట్టం నిర్దేశించిన విషయమని..  కోర్టు కూడా ఇదే  చెప్పిందని పొన్నవోలు స్పష్టం చేశారు.

అన్ని నిబంధనలను తుంగలో తొక్కి… తెల్లవారుజామునే కూల్చివేతలు చేపట్టారని ఆక్షేపించిన పొన్నవోలు… కోర్టు ఆదేశాల విషయం సీఆర్డీఏ కమిషన్ కాటమనేని భాస్కర్ కు మెయిల్, వాట్సప్ ద్వారా తెలియజేశామన్నారు. సదరు మెసేజ్ చూసి కూడా ఆయన పట్టించుకోలేదని… డ్యూ ప్రాసెస్ అఫ్ లా ఫాలో కాలేదని ఆక్షేపించారు. 

ఈ విషయంలో గతంలో  గౌరవ ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం… సూర్యోదయానికి ముందు కానీ, సూర్యాస్తమయం తర్వాత కానీ కూల్చివేతలు చేపట్టరాదని తెలిపారు. చట్టం అంటే గౌరవం లేకుండా వ్యవహరించిందన్నారు. ఇది కచ్చితంగా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని దీనిపై కంటెమ్ట్ ఆఫ్ ఆర్డర్ పిటిషన్ వేస్తామన్నారు. దీంతో పాటు ఐపీసీ చట్టం కింద క్రిమినల్ లా కు కూడా బాధ్యలవుతారన్నారు. 

ఈ కూల్చివేత వ్యవహారంలో అధికారులు చట్టానికి, కోర్టు నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రవర్తించారన్నారు.  అంతిమంగా ప్రభుత్వ దుశ్చర్యకు ప్రజాస్వామ్యంలో అడ్డుకట్టను గౌరవ కోర్టులు మాత్రమే వేయగలవని… ఆ కోర్టు ఆదేశాలే ఖాతరు చేయని పరిస్థితులు వస్తే… రాష్ట్రంలోనైనా, దేశంలోనైనా చట్టం అమలు కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
ఎవరు అధికారంలో ఉంటారో.. వారి రాజ్యాంగం, వారి చట్టం మాత్రమే అమలవుతుందని.. ఇది సామాన్యుడికి దుర్ధినమని తేల్చి చెప్పారు.
ఏ శక్తి అయినా రాజ్యంగానికి, కోర్టు తీర్పుకి లోబడి ప్రవర్తించకపోతే దేశంలో క్లిష్టపరిస్థితి, అల్లకల్లోలం ఏర్పడుతుందన్నారు. అందుకే కోర్టు తీర్పు అమలుచేయకపోతే కంటెమ్ట్ పెట్టారని గుర్తు చేశారు. కేవలం ప్రొవిజనల్ ఆర్డర్ మీద కూల్చే హక్కు లేకపోయినా.. వైయస్ఆర్‌సీపీ కార్యాలయాన్ని కూల్చివేయడం ద్వారా చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని ఆక్షేపించారు.

ఇల్లు అలకగానే పండగ కాదని… చట్టప్రకారం మా హక్కులను కాపాడుకుంటామని… కూల్చివేతకు పాల్పడినవారు అందరిపై క్రిమినల్ చర్యల దిశగా కోర్టు ద్వారా ప్రొసీడ్ అవుతామన్నారు. 

అనంతరం జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ…
ప్రజా వేదిక కూల్చివేతకు, వైయస్ఆర్‌సీపీ కార్యాలయం కూల్చివేతకు సంబంధం లేదని… ప్రజావేదికను నదీపరీవాహక ప్రాంతంలో నిబంధనలకు విరుద్దంగా నిర్మించారన్నారు. ప్రజావేదికకు, పార్టీ కార్యాలయానికి సంబంధం లేదన్నారు. ప్రజా వేదికకు పార్టీలకు సంబంధం లేదన్నారు. కరకట్ట ప్రాంతంలో ప్రతి ఇటుక తీసేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. అయితే ఆ శక్తి ప్రభుత్వానికి ఉందా? లేదా? అన్నది వేరే విషయం అని చెప్పారు.

Back to Top