గుంటూరు: తనపై దాడులకు పాల్పడిన వారిని, ప్రేరేపించిన వారిని ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌ను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తన ఇంటిపై జరిగిన దాడి ఘటనతో పాటు నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్‌పై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని కోరుతూ ఎస్పీకి రెండు వినతి పత్రాలు సమర్పించారు. ఆయన వెంట పార్టీ నేతలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నూరి ఫాతిమా, డైమండ్ బాబు, అన్నాబత్తుని శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ..“ఈరోజు ఎస్పీ గారిని కలిసి రెండు వినతి పత్రాలు అందజేశాను. నా ఇంటిపై దాడి జరిగిన కేసులో విచారణ అధికారిని మార్చాలని ఒక వినతి పత్రం ఇచ్చాను. అలాగే నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో నన్ను కస్టోడియల్ టార్చర్‌కు గురిచేసిన వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని మరో వినతి పత్రం సమర్పించాను” అని తెలిపారు. జనవరి 31వ తేదీన తెలుగుదేశం పార్టీ నాయకులు తన ఇంటిపై దాడి చేసి సుమారు 7:30 గంటల పాటు హింసకు దిగారని, తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఘటనలో పోలీసులు కూడా సహకరించారని విమర్శించారు. ఇలాంటి సంఘటనల్లో పోలీసులు స్వయంగా కేసు నమోదు చేయాల్సి ఉండగా, తాను ఫిర్యాదు చేసిన తర్వాతే కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. తనపై మాత్రం ఏడేళ్ల లోపు శిక్షకు సంబంధించిన సెక్షన్లతో కేసు నమోదు చేసి జైలుకు పంపించగా, తన ఇంటిపై దాడి చేసిన వారిని స్టేషన్ బెయిల్‌పై వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాభిపురం సిఐ గంగా వెంకటేశ్వర్లు తన కేసులో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని, తేలికపాటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని ఆరోపించారు. ఇక్కడ న్యాయం జరగకపోతే హైకోర్టు, అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తాం. నాపై దాడులకు పాల్పడిన వారిని, ప్రేరేపించిన వారిని ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు. చట్టంపై నాకు పూర్తి నమ్మకం ఉంది… కచ్చితంగా న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నాను” అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.