విద్య, వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

 పేర్ని నాని 

అమరావతి: విద్య, వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింద‌ని మంత్రి పేర్ని నాని తెలిపారు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ప్రభుత్వం చేయూతనిస్తోందని తెలిపారు. డ్వాక్రా మహిళలు తీసుకున్న అప్పుపై వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు.  ఏప్రిల్‌ 22న సున్నా వడ్డీ పథకం నగదును సీఎం విడుదల చేస్తారని వెల్లడించారు. విద్య, వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, వైద్య సిబ్బందిని నియమించి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని పేర్కొన్నారు. మంత్రులందరూ రాజీనామా ఇచ్చినట్లు తెలిపిన పేర్నినాని.. సీఎం జగన్‌ ఏ బాధ్యత అప్పగించినా నిర్వహిస్తానని స్పష్టం చేశారు. తమ సామర్ధ్యాన్ని బట్టి బాధ్యతలు అప్పగిస్తామన్నారని,  ఇప్పుడున్న వారిలో కొంతమందికి మళ్లీ అవకాశం ఉండవచ్చన్నారు.

‘ఎనిమిది మండలాలతో పులివెందుల, ఏడు మండలాలతో కొత్తపేట రెవెన్యూ డివిజన్‌లు ఏర్పాటు చేయనున్నాం. అదే విధంగా 12 పోలీస్‌ సబ్‌ డివిజన్లు, 16 పోలీస్‌ సర్కిళ్ల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపాం. పుంగనూరు వ్యవసాయ పాలిటెక్నిక్‌లో కొత్తగా 12 ఉద్యోగాలకు ఆమెదం.. ఏపీ మిల్లెట్‌ మిషన్‌కు కేబినెట్‌ ఆమోదం. తొగరం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌కు 24 టీచింగ్‌, 10 నాన్‌ టీచింగ్‌పోస్టులు మంజూరు. దర్శి డిగ్రీ కాలేజ్‌లో 34 టీచింగ్‌ పోస్టులు మంజూరు. 

పవన్‌ హాబీగా రాజకీయాలు చేస్తున్నారు. పవన్‌ ఫుల్‌టైమ్‌ పొలిటీషియన్‌ కాదు. ఆయన అవకాశ రాజకీయాలు చేస్తున్నారు.పవన్‌ మాటలనే నమ్మే స్థితిలో ప్రజలు లేరు. పవన్‌ మాటలకు నిబద్ధత ఉందా.. మాటకు కట్టుబడ్డాడా.. పవన్‌లా మాట మార్చితే ప్రజలు మండిపడతారు. పవన్‌ కల్యాణ్‌ పార్టీ పెట్టి చంద్రబాబును కలిశాను అంటారు. ఆయనేమన్నా ఎన్నికల కమిషనరా? పార్టీ పెట్టి చంద్రబాబును కలవడం ఎందుకు. పవన్‌.. చెగువేరా.. పూలే అందరూ అయిపోయారు. ఇప్పుడు చంద్రబాబు ఫోటో పెట్టుకున్నాడు. పవన్‌కు చంద్రబాబు అంటే విపరీతమైన వ్యామోహం. 2014లో పవన్‌ ఎవరి పల్లకీ మోశాడు’ అని పేర్ని నాని ధ్వజమెత్తారు. 

Back to Top