విజయవాడ: చంద్రబాబు ఇంకా తన ప్రవర్తన మార్చుకోకపోతే ఆంధ్రరాష్ట్ర ప్రజలు రాళ్లతో పరిగెట్టించి కొడతారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. అధికారంలోకి రాబోతున్నాం.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులతో పరిచయాలు పెంచుకోండి అంటూ మరోమోసానికి చంద్రబాబు తెర లేపుతున్నారని, చంద్రబాబు... ప్రజలు అమాయకులు కాదు.. రాళ్లతో కొట్టి అమరావతి నుంచి పరిగెట్టించి కొడతారని, ఎలాగూ చంద్రబాబుకు అమరావతిలో సొంత ఇల్లు లేదు.. హైదరాబాద్కు వెళ్లిపోవాల్సిందేనని బొత్స అన్నారు. విజయవాడ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుకు ఇంకా కుర్చిపై, అధికారంపై యావ తగ్గలేదు. పోలింగ్ అయిపోయిన తరువాత ఇంకో రెండు సంవత్సరాల తరువాత లెక్కబెడితే బాగుండును.. నాకు ఈ పదవి ఉంటే బాగుండు అని ఆయన ఆలోచనలు ఉన్నట్లుగా కనిపిస్తుంది. కొద్ది రోజులుగా ఆయన వ్యవహార శైలి చూస్తుంటే. ఫలితాలు అయిపోయి ఓటమి చవిచూసిన తరువాత కూడా అదే అవగాహన ఉంటే ఆ పరిణామాలు తీవ్ర ప్రమాదం. సచివాలయం, కృష్ణానది చుట్టూ తిరుగుకుంటూ నేనే ముఖ్యమంత్రి అంటూ చెప్పుకుంటూ తిరుగుతే ప్రమాదం. ఆయనకు అలాంటి మానసిక పరిస్థితులు రాకూడదని భగవంతుడిని కోరుకుంటున్నా.. అధికారులతో సమీక్షలు చేస్తే తప్పేంటి అని ఒక నాయకుడు అంటున్నాడు. వ్యవస్థలన్నీ నా చెప్పుచేతల్లో ఉండాలని, ఈసీ కూడా నా చెప్పుచేతల్లో ఉండాలని చంద్రబాబు కోరుకుంటాడు. సమీక్షలు చేయడం తప్పులేదు కానీ, ఆ సమీక్షలు ఇంకా అరకొరగా మిగిలిపోయిన పరిణామాలు, అవినీతి కార్యక్రమాల కోసం చేయడం తప్పు. ఎండ తీవ్రంగా ఉంది. తాగునీరు, సాగునీరు లేదు. దానిపై అధికారులతో సమీక్ష జరిపితే పర్వాలేదు అనిపించేది. కానీ, పాత బకాయిలు ఇంకా ఎందుకు రాలేదని సమీక్షలు చేస్తున్నారు. ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించిన తరువాత అధికారపూర్వకమైన పర్యటనలు, సమీక్షలు చేయకూడదు. అవన్నీ ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తాయి. జూన్ 8వ తేదీ వరకు నాకు అవకాశం ఉందని చంద్రబాబు చెప్పుకుంటున్నాడు. ఎన్నికలు అయిపోయి, ప్రజలు తిరస్కరించిన తరువాత ఇంకా ఉండాలని మనస్సులో కోరుకుంటున్నారంటే.. అది ఏ ఇబ్బందికరమైన మానసిక పరిస్థితిలోకి దారి తీస్తుందో అర్థం కావడం లేదు. భారత రాజ్యాంగానికి ఎవరూ అతీతులు కాదు. రాజ్యాంగానికి లోబడే అందరూ జీవించాలని మహానుభావుడు డాక్టర్ అంబేడ్కర్ రచించారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజల విశ్వాసం, రాజకీయ పార్టీల విశ్వాసాన్ని కూడా కోల్పోయారు. ఒకటి జాతీయ పార్టీ నాయకులు, రెండు ఆయన జాతి నాయకులు తప్ప చంద్రబాబు వెనుక ఎవరూ లేరు. ప్రజలు, రాజకీయ పార్టీలు అందరూ చంద్రబాబును తిరస్కరించారు. ఏ ఒక్కరికీ ఇచ్చిన మాట చంద్రబాబు నిలబెట్టుకోలేదు. మోసం, దగా దీంతోనే కార్యక్రమాలు చేశాడు. పైపెచ్చు నేను అధికారంలోకి రాబోతున్నాను.. వైయస్ఆర్ సీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులతో పరిచయాలు పెంచుకోండి అంటూ మరో మోసానికి తెర లేపుతున్నారు. చంద్రబాబు ప్రజలు అమాయకులు కాదు.. రాళ్లతో కొట్టి అమరావతి నుంచి తరిమికొడతారు. ఎలాగూ మీకు అమరావతిలో ఇల్లు లేదు.. సొంత ఇల్లు ఉన్న హైదరాబాద్కు వెళ్లిపోవాలి. ప్రజాస్వామ్యం అంటే అంత అపహాస్యం, ఆటగా ఉందా.. చంద్రబాబూ? ఓటు హక్కుతో గెలిచిన నాయకులంటే అంత చులకనా.. ఇంకా చంద్రబాబు బుద్ధిలో మార్పు రాలేదు. అంతిమ విజయం ఎప్పుడైనా న్యాయం, ధర్మానిదే. చిత్తశుద్ధితో పనిచేసే వారినే విజయం వరిస్తుంది. అది రానున్న రోజుల్లో తెలిసిపోతుంది. ఇంకా కమీషన్లు, పాత బకాయిలు వసూలు చేసుకోవడానికి సమీక్షలు చేయడం మంచి పద్ధతి కాదు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత కాన్ఫిడెన్షియల్ జీఓ అని 18 జీఓలు రిలీజ్ చేశారు. రాష్ట్రం మీద ఏమైనా దురాక్రమణలు జరుగుతున్నాయా.. ఎన్నికల నోటిఫికేషన్ తరువాత కాన్ఫిడెన్షియల్ ఏంటీ..? చంద్రబాబు చరిత్ర మొత్తం బయటకు వస్తుంది. ఇటువంటి కార్యక్రమాలు చేస్తే లేనిపోని ఆశలు కల్పించుకుంటూ మభ్యపెట్టడం. ఐటీ గ్రిడ్ కంపెనీ ద్వారా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని రోడ్డు మీద పడేశారు. ఇప్పుడు చంద్రబాబు అండ్ కో ఏం సమాధానం చెబుతారు. ఏదేమైనా ఇంకా కొద్ది రోజుల్లో మంచి సంక్షేమ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, వైయస్ఆర్ స్ఫూర్తితో వైయస్ జగన్ నాయకత్వంలో రాబోతుంది. తెలుగుదేశం పార్టీ అంతమైంది. ప్రజా రంజకపాలన వైయస్ జగన్ అందిస్తారని బొత్స సత్యనారాయణ అన్నారు.