తిరుప‌తిలో తోపులాట ప్రభుత్వ వైఫల్యానికి నిద‌ర్శ‌నం

వరుస సెలవులు ఉన్నా ముందస్తు ఏర్పాట్లు చేయని టీటీడీ

ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు ఫైర్‌

తాడేపల్లి వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. 

బంగారం మాయం అంటూ వైయ‌స్ఆర్‌సీపీపై తప్పుడు కథనం

2023లో దీనిపై వివరణ ఇచ్చిన ప్రభుత్వం

అయినా దురుద్ధేశంతో వైయ‌స్ఆర్‌సీపీ పై నిందలు

ఈనాడు తప్పుడు కథనాలపై వెల్లంపల్లి తీవ్ర ఆక్షేపణ

శ్రీవారి మెట్టుమార్గంలో టోకెన్ల వ్యవస్థను తొలగించిన టీటీడీ 

దానివల్లే భక్తుల్లో గందరగోళం 

సామాన్య భక్తులకు కష్టంగా మారిన శ్రీవారి దర్శనం 

వ‌రుస‌ ఘ‌ట‌న‌లు జరుగుతున్నా మారని టీటీడీ తీరు

తిరుమలకు రావాలంటేనే భయపడుతున్న భక్తులు 

నిర్వహణలో విఫలమైన తిరుమల తిరుపతి దేవస్ధానం చైర్మన్ 

బీ ఆర్ నాయుడు గారూ చేతగాకపోతే తప్పుకొండి

మాజీ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస్ డిమాండ్ 

టీటీడీని రాజకీయ వేదిక చేసిన టీడీపీ 

ఆధారాల్లేకుండా సీఎం, డిప్యూటీ సీఎంలు మాట్లాడ్డం బాధ్యతారాహిత్యం

వేంకటేశ్వరస్వామిని రాజకీయాల్లోకి లాగొద్దు 

స్పష్టం చేసిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

తాడేపల్లి :  తిరుప‌తిలో భక్తుల తోపులాట ఘటన కూటమి ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనమని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ తేల్చి చెప్పారు. తాడేపల్లి లోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలలో మాట్లాడుతూ...  కూటమి పాలనలో టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్ధానం) కాస్తా.. టీడీపీ కార్యాలయంలా మారిపోయింద‌ని విమ‌ర్శించారు. కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు వచ్చిన ప్రతిసారీ టీటీడీని తమ రాజకీయాలకు వాడుకుంటున్నార‌ని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో సామాన్య భక్తులకు దర్శనం కష్టంగా మారిందని, అందుకే భక్తులు వారణాసి, అయోధ్యకు వెళ్తున్నార‌ని తెలిపారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో బంగారం మాయం అంటూ వచ్చిన కధనాలను ఆయన తప్పుపట్టారు. 2023 లోనే దీనిపై వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం వివరణ ఇచ్చిందని.. అయినా కేవలం దురుద్ధేశంతో వైయ‌స్ఆర్‌సీపీ పై నిందలు మోపుడూ... ఈనాడు తప్పుడు కధనాలు రాస్తోందని వెల్లంపల్లి ఆక్షేపించారు. మరోవైపు తిరుమలకు వెళ్తే ప్రాణాలతో తిరిగి వస్తామా? రామా? అన్నభయం భక్తుల్లో నెలకొందని మండిపడ్డారు. చైర్మన్ బీ ఆర్ నాయుడు టీటీడీ  నిర్వహణను పూర్తిగా గాలికి వదిలేశారని, ఆయన తక్షణమే బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. గ‌తేడాది ముక్కోటి ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిస‌లాట‌, గోశాలలో గోవుల మ‌ర‌ణాలు వంటి వ‌రుస దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నా ప్రభుత్వం, పాలకమండలి ఎవరూ బాధ్యత తీసుకోక పోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. 

ప్రెస్‌మీట్‌లో వెలంప‌ల్లి శ్రీ‌నివాస్ ఏమ‌న్నారంటే..

● సెల‌వుల్లో భ‌క్తులు వ‌స్తార‌ని తెలియ‌దా?

గురువారం క్రిస్మస్, ఆ తరువాత శుక్ర, శని, ఆదివారం వరుస సెలవులు ఉంటే భారీగా భక్తులు తిరుమ‌ల‌కు వస్తారని పాలక మండలికి తెలియదా. సెలవు రోజుల్లో టీటీడీ ఎలా వ్యవహరించాలో కూడా తెలియని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. గతంలో శ్రీనివాస మంగాపురం దాటిన తరువాత ఉన్న శ్రీవారి మెట్టుమార్గంలోనే దర్శన టోకెన్లు ఇచ్చేవారు, ఇప్పుడు ఆ మార్గంలో వచ్చే భక్తులను కూడా అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌కు ఎందుకు మళ్లించారో చెప్పాలి. భక్తులకు సౌకర్యాలు పెంచాల్సిన పాలక మండలి, వారిని ఇబ్బందులకు గురిచేస్తోంది.

● బీ ఆర్ నాయుడు గారూ చేతగాకపోతే తప్పుకొండి

తిరుమల రావాలంటేనే భయపడే పరిస్థితిని కూటమి ప్రభుత్వం సృష్టించింది.  శ్రీవారి మెట్లు ఎక్కవద్దు, తిరుపతికి రావద్దు అన్న సంకేతాన్ని టీడీపీ పాలక మండలి ఇస్తోంది. తిరుమలకు వచ్చే భక్తులకు అరకొర సౌకర్యాలు, ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి.  తిరుపతిలో తొక్కిసలాట జ‌రిగి ఆరుగురు భక్తులు మృతి చెందిన ఘటనకు ఏడాది పూర్తవుతుంది. ఇలా భక్తులు తొక్కిస‌లాట‌లో చ‌నిపోయిన  ఘటన చ‌రిత్రలో ఎప్పుడూ లేదు.  భక్తులు చనిపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‘సారీ’ చెప్పి వెళ్లిపోయారు, సారీతో ప్రాణాలు తిరిగి వస్తాయా?. గోశాలలో అవులు చనిపోతున్నాయని ప్రశ్నించిన వైయస్‌ఆర్‌సీపీ నాయకులపై అప్పట్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. మా పార్టీ నాయ‌కుడు భూమన కరుణాకర్ రెడ్డి ఈ విష‌యంలో సవాల్ విసిరితే బీఆర్ నాయుడు పారిపోయారు. ఇటీవల పాలక మండలిలో గోశాలను ప్రైవేటుపరం చేయాలన్న చర్చ జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మీకు చేతకాకపోతే టీటీడీ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలి.

● వైయ‌స్ఆర్‌సీపీ పై తప్పుడు ప్రచారం... 

బంగారం మాయం అంటూ వైయ‌స్ఆర్‌సీపీపై తప్పుడు కధనం కధనాలు ప్రచురించారు. 2023లో దీనిపై వైయ‌స్ఆర్‌సీపీ  ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అయినా దురుద్ధేశంతో వైయ‌స్ఆర్‌సీపీ పై నిందలు మోపుతూ.. ఈనాడు తప్పుడు కధనాలతో దురుద్దేశపూర్వకంగా ఇలా ప్రచారం చేస్తున్నారు. ఈనాడు క‌థ‌నంపై టీటీడీ పాలక మండలి స్పందించాల్సిన అవసరం లేదా?. మరోవైపు ఆధారాలు లేకుండానే లడ్డూలో కల్తీ అని చెప్పారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే ఇలా మాట్లాడ్డం దారుణం. దానికి సనాతన ధర్మ నాయకుడు అని చెప్పుకునే పవన్ కళ్యాణ ఊగిపోవడం పరిపాటిగా మారింది. ఇప్పటివరకూ ఏమైనా ఆధారులు దొరికాయా? వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే పరకామణి కేసును పట్టుబడింది. వైయస్.జగన్ హయాంలో సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు ఆత్యాధునిక వసతులుతో పరకామణి భవన నిర్మాణం చేయడం వల్లే నిందితుడు పట్టుబడ్డాడు. మరలా ఇవాళ కొత్తగా గోవిందా 50 కిలోల బంగారం మాయం అంటూ కథనాలు రాస్తున్నారు. నిత్యం బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు.

● టీటీడీని రాజకీయాలకు వాడొద్దు

కూటమి ప్రభుత్వ నాయకులకు మరోసారి సవాల్ చేస్తున్నాను. రాజకీయంగా మిమ్మల్ని ఎదుర్కోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. కానీ రాజకీయాలను శ్రీ వేంకటేశ్వరస్వామివారితో ముడిపెట్టి భక్తుల మనోభావాలను దెబ్బతీయవద్దు. తిరుపతిలో అధికార్లు పనిచేస్తున్నారా? టీటీడీ పాలకమండలి నిత్యం టీడీపీ నాయకులకు సేవ చేయడంతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు భజన చేయడం మినహా మరో పని చేయడం లేదు. దీంతో సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కష్టంగా మారింది. తిరుమల వెళ్లాలంటే భయపడుతున్న భక్తులు... వారణాసి, అయోధ్యకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. తిరుమలకు వెళ్లి ప్రాణాలతో తిరిగి వస్తామా? రామా? అనే భయం భక్తుల్లో నెలకొంది. తిరుప‌తి తిరుమ‌ల దేవ‌స్థానాన్ని టీడీపీ రాజకీయాలకు వాడుకుంటుంది. ఇప్పటికైనా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, టీటీడీ అధికారులు రాజకీయాలు మానుకుని పరిపాలనపై దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడుతారంటూ... కోర్టులు మెట్టికాయలు వేసినా చంద్రబాబులో  మార్పు రాకపోవడాన్ని తప్పుపట్టారు. ఇప్పటికైనా  శ్రీవేంకటేశ్వరస్వామిని రాజకీయాల్లోకి లాగొద్దని ఆయన హెచ్చిరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారికి తగిన సౌకర్యాలు కల్పించాలని వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

Back to Top