నెల్లూరు: రాష్ట్రంలో యూనివర్సిటీ వైస్ చాన్సలర్ లను బెదిరించి మరీ రాజీనామాలు చేయించిన ప్రభుత్వ రౌడీయిజం మీద అన్ని ఆధారాలు ఉన్నాయని వైయస్ఆర్‌సీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. నెల్లూరు వైయస్ఆర్ సీపీ నగర పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. వీసీల బలవంతపు రాజీనామాలపై అన్ని ఆధారాలను మంత్రి నారా లోకేష్ కు ఇస్తామని, మండలిలో ఆయన చేసిన ప్రకటనకు కట్టుబడి దీనిపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం యూనివర్సిటీలను సైతం కూటమి ప్రభుత్వం కలుషితం చేసిందని మండిపడ్డారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... రాష్ట్రంలో యూనివర్సిటీ వీసీలను బెదిరించి రాజీనామాలు చేయించినట్టు ఆధారాలు చూపిస్తే ఏ విచారణకైనా సిద్ధమని శాసనమండలిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నాం. రాష్ట్రంలో 19 మంది వీసీలుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం మూడు రోజుల్లో 17 మంది వీసీలను బెదిరించి, భయపెట్టి రాజీనామాలు చేయించారు. మిగిలిన ఇద్దరిలో ఒకరు చంద్రబాబు సామాజికవర్గానికి చెందినవారు, మరొకరు మంత్రి అచ్చెన్నాయుడి బంధువు కావడంతోనే వారిని మినహయించారు. ఉన్నత విద్యామండలి పరిధిలోకి రాని నాలుగు యూనివర్సిటీల వీసీలను సైతం రాజీనామా చేయించడం చూస్తే కూటమి ప్రభుత్వ అధికార దుర్వినియోగం అర్థమవుతోంది. వీసీల బలవంతపు రాజీనామాలకు సంబంధించి ఆంగ్ల, తెలుగు దినపత్రికల క్లిప్పింగులు, వీడియోలు, వీసీల రాజీనామా లేఖలను లోకేష్ కి అందజేస్తాం. ఆయనకు చిత్తశుద్ది ఉంటే మండలిలో సవాల్ చేసినట్టుగా జ్యుడిషియరీ ఎంక్వయిరీ జరిపించాలి. ఈ ఆధారాలను మండలి సాక్షిగా ప్రదర్శిస్తుంటే మంత్రులు, అధికార పార్టీ సభ్యులు పదే పదే అడ్డు తగలడం ద్వారా వారి దుర్మార్గం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. శాసనమండలిలో మా గొంతు నొక్కుతున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత విద్యావ్యవస్థలో జరుగుతున్న తప్పిదాలపై శాసనమండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సమాధానం చెప్పుకోలేక ప్రతిపక్ష వైయస్ఆర్‌సీపీ సభ్యులపై మంత్రి లోకేష్ సహా ఇతర మంత్రులు, టీడీపీ సభ్యులు ఎదురుదాడికి దిగుతున్నారు. మా గొంతు నొక్కుతున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడు యూనివర్సిటీలు, వీసీలపై జోక్యం చేసుకున్న ఘటనలు రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడూ జరగలేదు. తొలిసారి కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక వీసీలను బెదిరించి రాజీనామా చేయించిన దుర్మార్గమైన పరిస్థితిని చూశాం. మూడేళ్లపాటు ఉండాల్సిన వీసీలు కేవలం ఐదారు నెలల తర్వాత దేశంలో ఎక్కడాలేని విధంగా మూకుమ్మడి రాజీనామాలు చేసిన దుస్థితికి కారణం కూటమి నాయకులు కాదా? దీనిపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారిలో ఉలిక్కిపాటు మొదలైంది. ఆధారాలు చూపించమంటారు.. చూపిస్తుంటే తట్టుకోలేక మండలిలో మమ్మల్ని మాట్లాడనివ్వకుండా చేస్తున్నారు. వీసీలపై చాంబర్లలో టీడీపీ గుండాల దౌర్జన్యం రాజీనామా చేయాలని ప్రభుత్వం, ఉన్నత విద్యా మండలి చైర్మన్ నుంచి వచ్చిన మౌఖిక ఆదేశాల మేరకు రాజీనామా సమర్పించినట్టు వీసీలు స్పష్టంగా తమ లేఖల్లో రాశారు. ప్రభుత్వం బెదిరించి రాజీనామాలు తీసుకుందని చెప్పడానికి దీనికన్నా వేరే ఆధారాలు కావాలా? వైస్ చాన్స్‌లర్లు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం గూండాలు వీసీ ఛాంబర్లలోకి వెళ్లి దౌర్జన్యం చేసిన వార్తలను ఇంగ్లిష్ పత్రికల్లో, టీవీల్లో వార్తలొస్తే దానిపై ముఖ్యమంత్రి ఎందుకు దృష్టిపెట్టలేదు? తెలుగుదేశం పార్టీకి చెందిన గూండాలు వీసీల ఛాంబర్‌లోకి వెళ్లి 'నా కొడకా... నిన్ను ఏ నా కొడుకు కాపాడుతాడో చూస్తాం' అంటూ వీసీల ముందు పేపర్లు పెట్టి రాజీనామాలు తీసుకున్న వీడియాలు రాష్ట్రంలో వైరల్ అయితే ఇంతకన్నా ఆధారాలు ఇంకేం కావాలి. వీసీలను బెదిరించి సెల్‌ఫోన్లు పగలకొట్టి రాజీనామాలు తీసుకున్న ఘటనలు ఏపీలో తప్ప దేశంలో ఇంకెక్కడా జరిగి ఉండవు. ఇలాంటి ఘటనలు రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చుతాయని మండలిలో చెబుతుంటే మమ్మల్ని మాట్లాడనివ్వకుండా చేశారు.