రాజమహేంద్రవరం : కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో దారుణమైన అకృత్యాలు చోటుచేసుకుంటున్నాయని, మహిళల భద్రత పూర్తిగా ప్రశ్నార్థకంగా మారిందని వైయస్ఆర్‌సీపీ నాయకుడు, మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళను అవమానించిన ఘటన అత్యంత దారుణమని పేర్కొంటూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ నాయకులే ఒక మహిళను అవమానించేలా వ్యవహరించడం అత్యంత బాధాకరమని అన్నారు. సీసీటీవీ కెమెరాలు లేకపోయి ఉంటే ఈ ఘటన వెలుగులోకి కూడా వచ్చేది కాదని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే ప్రజల గొంతు నొక్కే పార్టీ అని విమర్శించిన మార్గాని భరత్, అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఈ కేసును సెటిల్ చేసేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యే మంతనాలు జరుపుతున్నారనే వార్తలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. నిందితులను కాపాడే ప్రయత్నాలు కాకుండా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటనను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించి, వెంటనే సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ మార్గాని భరత్ కోరారు. మహిళల గౌరవం, భద్రతకు భంగం కలిగించే ఘటనలను వైయస్ఆర్‌సీపీ తీవ్రంగా ఖండిస్తుందని, బాధితురాలికి న్యాయం జరిగే వరకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.