● ఈ సందర్భంగా నలమారు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. “కూటమి ప్రభుత్వం సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఉద్యోగులకు డీఏ, పెన్షనర్స్‌కు డిఆర్‌ను 30 నెలలకు బదులు 60 నెలలకు ఇచ్చినట్లుగా ఈ రోజు యెల్లో పత్రికలో కథనం రాసింది. కానీ ప్రభుత్వం చేసేది ఒక్కటి… పత్రికల్లో రాసేది మరొకటిగా ఉంది. పెన్షనర్స్‌కు ఎవరికీ కూడా 60 నెలల డిఆర్ రాలేదు. కొంతమందికి 30 నెలలకు మాత్రమే వచ్చింది. అందులో కూడా కొందరికి రూ.4 వేలు, మరికొందరికి రూ.10 వేలు మాత్రమే ఇచ్చారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ఇస్తూ, సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వం కానుకలు ఇస్తున్నట్లు రెండు మూడు రోజులుగా ఊదరగొడుతున్నారు. రూ.1100 కోట్లు సీపీఎస్ ఉద్యోగులకు డీఏ ఇస్తామని, పెన్షనర్స్‌కు డిఆర్ ఇస్తామని చెబుతున్నారు. అలాగే పోలీసులకు సరెండర్ లీవ్స్‌కు రూ.110 కోట్లు ఇస్తామన్నారు. ప్రభుత్వం చెబుతున్నది ఒక్కటి… పత్రికల్లో రాసేది మరొకటి. దీనివల్ల ఉద్యోగులు, పెన్షనర్స్‌లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ చర్యలను వైయస్‌ఆర్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. అధికారంలోకి రాగానే పీఆర్, ఐఆర్ ఇస్తామని ఉద్యోగులు, పెన్షనర్స్ నుంచి ఓట్లు వేయించుకున్నారు. కానీ 20 నెలలు గడిచినా వాటి ఊసే లేదు. మధ్యంతర భృతి పరిస్థితి కూడా ఏమాత్రం లేదు. 1.07.2018 నుంచి రావాల్సిన పీఆర్‌సీ ఇప్పటికీ అమలు కాలేదు. ఇప్పటివరకు పీఆర్‌సీ కమిషన్ చైర్మన్‌ను కూడా నియమించలేదు. జీపీఎఫ్, మెడికల్ రీయింబర్స్‌మెంట్, పెన్షనర్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కు సంబంధించి దాదాపు రూ.35 వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. 2019లో వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే, టీడీపీ ప్రభుత్వం ఉద్యోగులకు ఇవ్వాల్సిన రెండు డీఏలకు జీవోలు ఇచ్చారు. ఆ రోజు ఇచ్చిన జీవోల వల్లనే ఈ రోజు ఈ ప్రభుత్వం చెల్లింపులు చేస్తోంది. 2018 నుంచే టీడీపీ ప్రభుత్వం జీవోలు ఇవ్వకుండా ఉద్యోగులను ఎగనామం పెట్టింది. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను ఎప్పటికప్పుడు చెల్లించాలి. వెంటనే ఐఆర్ ప్రకటించి, పీఆర్‌సీ కమిషన్‌కు చైర్మన్‌ను నియమించాలని వైయస్ఆర్‌సీపీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది` అని చంద్రశేఖర్ రెడ్డి ఆ వీడియోలో పేర్కొన్నారు.