తాడేపల్లి: రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దలే యూరియా కృత్రిమ కొరతను సృష్టించి, బ్లాక్ మార్కెట్ దందాను ప్రోత్సహిస్తున్నారని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కైలా అనీల్ కుమార్ మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అక్రమంగా తరలిస్తున్న యూరియాను పట్టుకుని రైతులు పోలీసులకు అప్పగిస్తే, రాత్రికి రాత్రే దానిపై మాయ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా అడుగుతున్న రైతులను ఫేక్ అంటూ సాక్షాత్తు సీఎం చంద్రబాబే మాట్లాడటం ఈ ప్రభుత్వ దివాలాకోరుతనంకు నిదర్శనమని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే... రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలైన్లలో నిలబడితే కనీసం అర బస్తా యూరియా కూడా దొరకడం లేదు. ఇదేమని ప్రశ్నించిన రైతుల మీద దాడులు చేస్తున్నారు. ప్రభుత్వమే దగ్గరుండి యూరియాను బ్లాక్ మార్కెట్‌కి తరలించి వాటాలు పంచుకుంటున్నారు. పామర్రు నియోజకవర్గంలో బ్లాక్ మార్కెట్‌కి తరలిస్తున్న లారీని రైతులు పట్టుకుని పోలీస్ స్టేషన్ కి తరలిస్తే, తెల్లారేసరికి ఫేక్ బిల్లులు సృష్టించి ఆథరైజ్డ్ లారీగా డిక్లేర్ చేయడం దుర్మార్గం. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయలేని అసమర్థ స్థితిలో ఉన్న చంద్రబాబు, యూరియా వాడితే కేన్సర్ వస్తుందని డ్రామాలాడటం సిగ్గుచేటు. దమ్ముంటే, గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో మాదిరిగా ఒక్క రైతు కూడా క్యూలైన్లలో నిలబడకుండా యూరియా పంపిణీ చేసి చూపించాలి. ● చంద్రబాబు సహనం కోల్పోతున్నారు: రైతాంగ సమస్యలపై ప్రశ్నిస్తే సీఎం చంద్రబాబు సహనం కోల్పోతున్నారు. తొక్కేస్తాం, తాట తీస్తామని బెదిరిస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిరసనలను ఉక్కుపాదంతో అణచి వేసే ధోరణి చంద్రబాబుకి కొత్తగా వచ్చింది కాదు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా ఉండగానే విద్యుత్ ఉద్యమం చేసినందుకు రైతుల మీద కాల్పుల జరిపించాడు. అంగన్‌వాడీలను గుర్రాలతో తొక్కించాడు. ఇప్పుడూ అదే విధంగా రైతులకు యూరియా అందడం లేదని ప్రతిపక్ష వైయస్ఆర్‌సీపీ ప్రశ్నిస్తుంటే సీఎం చంద్రబాబు సమాధానం చెప్పలేకపోతున్నారు. అధికారంలోకి రావడం కోసం రైతుల మీద ప్రేమ ఉన్నట్టు కోరిన వరాలిచ్చేస్తుంటాడు. నచ్చిన వాగ్ధానాలు ఇస్తుంటాడు. తీరా అధికారంలోకి వచ్చాక తనకేం సంబంధం లేదన్నట్టు, ప్రజలకు నేనెందుకు చేయాలనే విధంగా అపరిచితుడిలా నోటికొచ్చిన మాటలతో బెదిరిస్తాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతులు క్యూలైన్లలో నిలబడితే కనీసం అరకట్ట యూరియా కూడా దక్కని పరిస్థితులు నెలకొన్నాయి. ● యూరియా అడిగే రైతుల మీద దాడులా? రైతులకు కావాల్సినంత యూరియా అందుబాటులో ఉందని చంద్రబాబు చెబుతుంటే రైతులు క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? రూ.267ల యూరియా బస్తాను బ్లాక్ మార్కెట్‌లో రూ.200లు అదనంగా చెల్లించి కొనాల్సిన దుస్థితి రైతులకు ఎందుకొచ్చిందో సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి. గత ఐదేళ్ల వైయస్ జగన్ పాలనలో ఏనాడైనా యూరియా కొరత అనే మాట వినిపించిందా? ఎక్కడైనా రైతులు క్యూలైన్లలో నిలబడాల్సి వచ్చిందా? గత మా ప్రభుత్వంలో ఆర్బీకే సెంటర్ల ద్వారా యూరియాను సరఫరా చేశాం. వాటికే మీరు రైతు సేవా కేంద్రాలని పేరు మార్చుకున్నారు. ఆ ఆర్ఎస్కేల ద్వారా యూరియా ఎందుకు పంపిణీ చేయడం లేదు? దమ్ముంటే యూరియా కొరత ఉందని ఒప్పుకోండి. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా యూరియా తెప్పించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందా? యూరియా కోసం పీఏసీఎస్‌ల వద్ద రైతులు బారులుదీరితే టీడీపీ వారికి మాత్రమే టోకెన్‌లు ఇస్తున్నారు. ఎకరం, రెండెకరాలు వ్యవసాయం చేసుకునే కౌలు రైతులకు యూరియా అందడం లేదు. యూరియా ఎందుకివ్వడం లేదని రైతులు ప్రశ్నిస్తుంటే వారి మీద పోలీసులతో దాడులు చేయిస్తున్న దుర్మార్గ ప్రభుత్వం. ● యథేచ్ఛగా బ్లాక్ మార్కెట్‌కి తరలిస్తున్నారు: రాష్ట్రంలో అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదు. లోకేష్ రచించిన రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. పామర్రు నియోజకవర్గం పెదపారిపూడి మండలం యలమర్రి గ్రామంలో సర్పంచ్ శ్రీనివాస్ యూరియా కోసం అధికారులను ప్రశ్నిస్తే ఆయన మీద దాడి చేశారు. యూరియా అడిగితే వైయస్ఆర్‌సీపీ నాయకులు అరాచకాలు చేస్తున్నారని, ఫేక్ ప్రచారం చేస్తున్నామని సాక్షాత్తు ముఖ్యమంత్రే చెబుతున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే వైయస్ఆర్‌సీపీ నాయకుల పేర్లు చెప్పి స్మగ్లర్లు, రౌడీలు అని ముద్ర వేస్తున్నారు. ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? ఇదే పామర్రు నియోజకవర్గం మొవ్వ మండలం చినముత్తేవి గ్రామంలో మార్క్‌ఫెడ్ నుంచి బ్లాక్ మార్కెట్‌కి తరలిస్తున్న ఒక యూరియా లారీని అర్ధరాత్రి వేళ గ్రామస్తులు అడ్డగించారు. రైతులే ఆ లారీని నేరుగా పోలీస్‌స్టేషన్‌లో అప్పజెప్పారు. లారీ ఓనర్‌ని యూరియా లోడ్‌కి సంబంధించి బిల్లులు చూపించమని అడిగితే చూపించలేకపోయారు. విజిలెన్స్ సిబ్బంది చేయాల్సిన పనిని రైతులు చేశారు. కానీ తెల్లారేసరికి స్క్రిప్ట్ మొత్తం మార్చేశారు. బ్లాక్ మార్కెట్‌కి తరలించిన యూరియా లారీని ఆథరైజ్డ్‌గా చూపించారు. ఇదంతా చూస్తుంటే ప్రభుత్వమే దగ్గరుండి యూరియాను బ్లాక్ మార్కెట్ చేస్తున్నట్టుగా ఎవరికైనా అర్థమవుతుంది. ఫొటోలు, వీడియోలతో సహా రైతుల యూరియా కష్టాలను మా అధ్యక్షులు వైయస్ జగన్ ట్వీట్ చేస్తే నిస్సిగ్గుగా దానికి కూడా ఫేక్ న్యూస్ అని చెబుతున్నారంటే, ఈ ప్రభుత్వానికి రైతులను ఆదుకునే ఉద్దేశమే లేనట్టు స్పష్టంగా తెలుస్తోంది. ధాన్యం పొట్టపొసుకునే సమయంలో యూరియా అత్యవసరం. రైతుల అవసరం మేరకు యూరియాను అందివ్వలేక కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది. తన చేతకానితనాన్ని కప్పి పుచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు యూరియా వాడకం సగానికి తగ్గించాలని నిర్ణయించాం, యూరియా వాడితే కేన్సర్ వస్తుందని కొత్త కథలు అల్లుతున్నాడు.