ఎన్టీఆర్ జిల్లా: వ్యవసాయం దండగ అంటూ సాగుని గత పాలకులు నిర్లక్ష్యం చేయగా, రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తూ సీఎం వైయస్ జగన్ పండగలా మార్చారని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు అన్నారు. జి.కొండూరులో రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు ఎమ్మెల్యే అందజేశారు. అన్నదాతల సాగు అవసరాలను తీర్చి తక్కువ ధరకే వ్యవసాయ ఉపకరణాలను సమకూర్చే వైయస్ఆర్ యంత్ర సేవా పథకం కింద రైతు సంఘాలకు సబ్సీడీపై ట్రాక్టర్లను అందించడం గొప్ప విషయమన్నారు. వైయస్ఆర్ రైతు భరోసా కేంద్రాలలో అన్నదాతలకు కావాల్సిన పనిముట్లన్నీ తక్కువ ధరకు లభించేలా రైతులతో సంఘాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం తరఫున 40 శాతం రాయితీ ఇస్తున్నట్లు వెల్లడించారు. మరో 50 శాతం రుణాలను బ్యాంకులతో మాట్లాడి తక్కువ వడ్డీకే మంజూరు చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు గ్రూపులుగా ఏర్పడి కేవలం 10 శాతం డబ్బులు చెల్లిస్తే చాలని, వ్యవసాయానికి ఉపయోగపడే ట్రాక్టర్లతో సహా ఉపకరణాలన్నీ వారికి గ్రామంలోనే ఆర్బీకేల పరిధిలో సరసమైన ధరలకే అందుబాటులో ఉంటాయన్నారు. వీటిని రైతు సోదరులు సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులు సాధించాలన్నారు.