రైతులు నిన్ను న‌మ్మ‌రు బాబూ?

వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు, ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి

వ్య‌వ‌సాయం గురించి టీడీపీ మాట్లాడటం వింతల్లోకల్లా వింత

రాయ‌ల‌సీమ‌లో టీడీపీ అబ‌ద్ధ‌పు ప్ర‌చారాలు

రుణ‌మాఫీ పేరుతో రైతులను మోసం చేసిన విషయం మరిచి పోలేదు బాబూ?

కరువు రికార్డులను కూడా బాబే బ్రేక్ చేశాడు

 సంక్షోభంలో ఉన్న వ్యవ‌సాయానికి చేయూత‌నిచ్చిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

దేశంలోనే ఆద‌ర్శంగా నిలుస్తున్న వైయ‌స్ఆర్‌సీపీ ప‌థ‌కాలు

తాడేప‌ల్లి: అధికారం కోసం అడ్డ‌గోలు హామీలు ఇచ్చిన  మోసం చేసిన చంద్ర‌బాబును రైతులు న‌మ్మ‌ర‌ని వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు, ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి పేర్కొన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్ర‌బాబు రాయ‌ల‌సీమ‌కు చేసింది ఏమీ లేదు..పైగా ఆయ‌న ఎప్పుడు అధికారంలోకి వ‌చ్చినా రాష్ట్రంలో క‌రువే అన్నారు. వ్య‌వ‌సాయం దండ‌గ అని చంద్ర‌బాబు అంటే..దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పండ‌గ చేశారు. ఆ మ‌హానేత కుమారుడు వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యాక వ్య‌వ‌సాయానికి చేయూత‌నిచ్చి రైతును రాజును చేశాడు. వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న రైతు సంక్షేమ ప‌థ‌కాలు దేశానికే ఆద‌ర్శంగా నిలిచాయ‌న్నారు. ఇలాంటి ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు తెచ్చేందుకు టీడీపీ విష ప్ర‌చారం చేస్తోంది. టీడీపీ త‌ప్పుడు ప్ర‌చారంపై ఎంవీఎస్ నాగిరెడ్డి గ‌ణంకాల‌తో ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 

రాష్ట్రంలో ఖరీఫ్ లో వరి తరువాత అత్యధికంగా సాగు జరిగే పంట, అత్య ధికంగా ప్రొటీన్, అత్యధికంగా నూనె ఇచ్చే  పంట  వేరుశనగ...
 2014-15 నుంచి ఈ సంవత్సరం వరకు రాష్ట్రంలో  వేరుశనగ పంట సాగు, మొత్తం  ఉత్పత్తి మరియు హెక్టారు సరాసరి దిగుబడి వివరములు... వాస్తవాలు ఏమిటో ఒక్కసారి పరిశీలించండి 

రాయలసీమలో కేవలం 3 శాసన సభా స్థానాలకే మిమ్మల్ని ప్రజలు పరిమితం చేసిన తరువాత కూడా..  అక్కడి ప్రజలను ఇంకా మోసం చేసేందుకు గత రెండు రోజులుగా తెలుగు దేశం పార్టీ నాయకులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.  కరువు-చంద్ర బాబు నాయుడు గారు కవల పిల్లలుగా సాగిన పాలన అందరికీ తెలుసు. రాయలసీమలో, ఆనంతపురం జిల్లాలో 2012 లో బేషరతుగా  వ్యవసాయ రుణాలన్నీ మాఫీచేస్తాను అని చెప్పి, పగటిపూటే 9 గంటలు నిరంతరాయంగా వ్యవ సాయానికి ఉచిత విద్యుత్ ఇస్తాను అని రాయలసీమ  రైతులను మోసం చేసిన విషయం మరిచి పోలేదు. అటువంటి చంద్రబాబు, టీడీపీ నేతలు  ఈ రోజు వ్యవసాయం గురించి, రైతుల  గురించి మాట్లాడటం వింతగా ఉన్నది... 

రాయల సీమలో పండే పంట, రాయలసీమలో మాత్రమే పండే పంట వేరుశనగ. 5 సంవత్సరాల తెలుగు దేశం పార్టీ పాలనలో 3 సంవత్సరాలు వేరుశనగ రైతుల దుర్భర పరిస్థితిని  గమనిస్తే...
2014-15 ఖరీఫ్ లో రాష్ట్రం మొత్తం ఉత్పత్తి 3.3 లక్షల టన్నులు... హెక్టారుకు సరాసరి దిగుబడి 410 కిలోలు, 
2016-17 ఖరీఫ్ లో మొత్తం ఉత్పత్తి 3.91 లక్షల టన్నులు... హెక్టారుకు సరాసరి దిగుబడి 419 కిలోలు, 
2018-19 లో మొత్తం ఉత్పత్తి 3.33 లక్షల టన్నులు... హెక్టారుకు సరాసరి దిగుబడి 484 కిలోలు మాత్రమే... 
--- నా రికార్డులు నేనే బ్రేక్ చేశాను అని చెప్పుకునే చంద్ర బాబు నాయుడు గారు.. ఆఖరికి తన హయాంలో  కరువు రికార్డులను కూడా తానే బ్రేక్ చేశాడు. ఇవి అన్నీ మరచి గత 2 రోజులుగా తెలుగు దేశం పార్టీ నాయకులు తమ పాలనలో వేరు శనగ రైతులు అని ఏదో ఉద్దరించినట్టు మాట్లాడుతున్నారు...

అదే జగన్ మోహన రెడ్డి గారు ముఖ్య మంత్రి అయిన తరువాత..
2019-20 ఖరిఫ్ లో రాష్ట్రం మొత్తం వేరు శనగ ఉత్పత్తి 5.88 లక్షల టన్నులు... హెక్టారుకు సరాసరి దిగుబడి 1035 కిలోలు, 
2020-21 ఖరిఫ్ లో మొత్తం ఉత్పత్తి 5.4 లక్షల టన్నులు... హెక్టారుకు సరాసరి దిగుబడి 723 కిలోలు, 
ఈ సంవత్సరం ఖరిఫ్ కు గానూ, ఆర్ధిక గణాంక శాఖ ప్రకటించిన ప్రథమ ముందస్తు అంచనాల ప్రకారం... ఖరీఫ్ లో మొత్తం దిగుబడి 4.96 లక్షల టన్నులు... హెక్టారుకు సరాసరి దిగుబడి 803 కిలోలు... 

చంద్ర బాబు నాయుడు గారు ముఖ్య మంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో వేరుశనగ పంటే  ప్రధాన ఆధారమైన అనంత పురం జిల్లాలో..
2014-15 ఖరీఫ్ లో మొత్తం  63 కు 63 మండలాలు కరువు మండలాలు, 
2015-16 ఖరీఫ్ లో 63 కి 63 మండలాలు కరువు మండలాలు, 
2016-17 ఖరీఫ్ లోనూ 63 కు 63 మండలాలు కరువు మండలాలు, 
2017-18 ఖరీఫ్ లో 63 కు 23 మండలాలు కరువు మండలాలు, 
2018-19 ఖరీఫ్ లో నూ *63 కు 63 మండలాలు కరువు మండలాలు... రబీలో కూడా 32 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వమే ప్రకటించినది... 
ఇటువంటి పరిస్థితి తిరిగి కావాలని ఏ అనంతపురం వాసి అయినా కోరుకుంటాడా చంద్ర బాబు నాయుడు గారూ... ?

ఈ సంవత్సరం 29/9/21 నాటికి రాయల సీమ మొత్తం కురవవలసిన సాధారణ వర్షం 400.6 మిల్లీ మీటర్లు ఆయితే కురిసిన వర్షం 449.6 మిల్లీ మీటర్లు (12.2% అధికం)... అనంత పురం జిల్లాలో కురవవలసిన సాధారణ వర్షం 329.3 మిల్లీ మీటర్లు ఆయితే కురిసిన వర్షం 342.6 మిల్లీ మీటర్లు... 

కానీ మధ్యలో 15 రోజులు పైగా డ్రై స్పెల్ రావడం మూలంగా కొన్ని ప్రాంతాలలో పంట నష్ట పోయిన మాట వాస్తవం అయినప్పటికీ 15 లక్షల ఎకరాలలో పంట నష్ట పొయినదని అబద్దపు ప్రచారం చెయ్యడం  తెలుగు దేశం పార్టీ నాయకుల బాధ్యతా రాహిత్యం...

గత రెండు సంవత్స రాలుగా  రాష్ట్రంలో పంట నష్ట పోయిన రైతులను ఆదుకోవడం లో ముఖ్య మంత్రి జగన్ మోహన రెడ్డి గారు ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా ఆ పంట కాలంలోనే పెట్టుబడి రాయితీ చెల్లించిన విషయం అందరికీ తెలిసినదే. ఈ సంవత్సరం కూడా అలానే ఆదుకుంటారు... 

29/9/2021 నాటికి రాష్ట్రంలో వేరు శనగ జరగ వలసిన సాధారణ  సాగు 7.16 లక్షల హెక్టార్లు ఆయితే ఈ సంవత్సరం 6.42 లక్షల హెక్టార్లలో సాగు జరిగినది... దాని కనుగుణంగానే దిగుబడులు వస్తాయని ఆర్ధిక గణాంక శాఖ మొదటి ముందస్తు అంచనాలు విడుదల చేసినది...

ఈ వివరాలేవీ నేను(నాగిరెడ్డి) తయారు చేసిన లెక్కలు, అంచనాలు కాదు... ఆర్ధిక గణాంక శాఖ వాస్తవ వివరాలు మాత్రమే... 

వ్యవసాయానికి ప్రకృతి అనుకూలతే ప్రథమం... దరిదాపుగా ఖరిఫ్ లో  వర్షాధారంగా సాగు చేసే వేరు శనగ పంట ఒడిదుడుకులతో కూడి ఉన్న సంగతి జగ మెరిగిన సత్యం... 

రైన్ గన్ల తో కరువును జయించాను, తుపానులను, సముద్రాన్ని కంట్రోల్ చేశాను అంటూ తానేదో మానవాతీత వ్యక్తిగా మాటలు చెప్పి ప్రజలను వంచించిన చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకుడు కాదు నేటి ముఖ్య మంత్రి జగన్ మోహన రెడ్డి గారు...

కోవిడ్ సంక్షోభానికి సంపన్న దేశాలు, దేశంలోని సంపన్న రాష్ట్రాలు కూడా ఆర్ధిక సంక్షోభంలో కొట్టు మిటాడుతున్న సమయంలో కూడా మన రాష్ట్రంలో ప్రకటించిన సమయానికే అన్ని పథకాలూ, దేశంలో ఏ రాష్ట్రం లోనూ లేని అనేక కొత్త పథకాలు అందిస్తున్న యువ ముఖ్య మంత్రి  వైయ‌స్ జగన్ మోహన రెడ్డి గారు...

క్షేత్ర స్థాయిలో ఎక్కడైనా చిన్న చిన్న లోటుపాట్లు కనిపిస్తే...  ప్రభుత్వం దృష్టికి తెచ్చి నిర్మాణాత్మక ప్రతి పక్షంగా వ్యవహరించకపోగా,  కులాల పేరుతో మతాల పేరుతో అబద్దపు ప్రచారాలతో నడుస్తున్న ఇటువంటి ప్రతిపక్షాన్ని దేశంలోనే ఇంతకు ముందెన్నడూ చూసి ఉండం...ఇది ఆపార్టీ పతనానికి మరో దిగజారుడు తనమే...

Back to Top