కేంద్రం నిబంధనల మేరకే ఇళ్లస్థలాలు కేటాయించాం

రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని న్యాయస్థానాన్ని అభ్యర్థిస్తాం

మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

విజయవాడ: కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకే ఇళ్ల స్థలాలు కేటాయించామని, 220  చదరపు అడుగుల స్థలం ఇవ్వాలని నిబంధన ఉంటే.. 270 చదరపు అడుగుల స్థలం  కేటాయించామని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అధికారం కోల్పోయిన తెలుగుదేశం పార్టీ.. సంక్షేమాన్ని అడ్డుకునేందుకు కేసులు వేస్తోందని మండిపడ్డారు. మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని న్యాయస్థానాన్ని అభ్యర్థిస్తామని చెప్పారు. సాంకేతిక అంశాలు కాకుండా.. ఏ స్ఫూర్తితో చేస్తున్నామో చూడాలని కోరతామన్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్థం చేసింది చంద్రబాబేనని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గతంలో అధిక టారిఫ్‌లకు విద్యుత్‌ కొనుగోలు చేయడం వల్లే విద్యుత్‌ పంపిణీ సంస్థలు నష్టాల్లో కూరుకున్నాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రూ. వేల కోట్ల బకాయిలను పెండింగ్‌లో పెట్టిందని, ఆ బకాయిలన్నింటినీ వైయస్‌ జగన్‌ ప్రభుత్వం చెల్లిస్తోందని చెప్పారు. 

మంత్రి బొత్స సత్యనారాయణ ఇంకా ఏమన్నారంటే..

ఇళ్ల నిర్మాణాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు చూస్తే బాధనిపించింది. న్యాయస్థానాలు అన్నా, న్యాయమూర్తులు అన్నా, వారిచ్చిన తీర్పులన్నా మాకు పూర్తి గౌరవం ఉంది. వారి అభిప్రాయాలతో మేము విభేదించం. అయితే,  ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ఇస్తున్న జీవోలు..  ఏ స్పూర్తితో ఇస్తున్నాం, ఎవరి కోసం ఇస్తున్నాం, ఏ పేదల కోసం ఆలోచన చేస్తున్నామో అనే దానిపై కూడా న్యాయస్థానాలు ఆలోచించాలన్నది మా అభిప్రాయం. కేంద్ర ప్ర‌భుత్వం సూచించిన విధివిధానాల మేర‌కే పేద‌ల‌కు ఇళ్ల నిర్మాణ కార్య‌క్ర‌మాన్ని నూటికి నూరుశాతం అమలు చేస్తున్నాం. దీనిపై ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉంటే ప్రభుత్వాన్ని అడిగారా? అడగలేదు?

పేదల ఇళ్ళ నిర్మాణ కార్యక్రమానికి..  ప్రభుత్వం స్థలంతో పాటు దానికి తగ్గట్టుగా కొన్ని వేల కోట్లతో కొన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం. అలాగే కేంద్రం ఇస్తున్న రూ. లక్షా 50వేలు కూడా పేదలకు ఇస్తున్నాం. కేంద్రం 220 చదరపు అడుగుల్లో ఇళ్ల నిర్మాణానికి శాంక్షన్‌ ఇచ్చారు. అయితే, ఈ ప్రభుత్వం 270 చదరపు అడుగులలో పేదలకు ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం. వారికి ఇస్తున్న సెంటు, సెంటున్నర స్థలంలో ఇళ్లు కడుతున్నాం. 

దేశమంతా కూడా ఇవే నిబంధనల ప్రకారం కడుతున్న ఇళ్ల నిర్మాణాలను ఆపేస్తారా? మరి అలా చేస్తే,  దేశమంతా ఇళ్ల నిర్మాణాలు ఆపేస్తారా?, అలా ఆపేస్తే.. పేదలకు అసలు ఇళ్లు  ఉంటాయా? స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయినా,  ఈ రాష్ట్రంలో ఇళ్లు కావాల్సినవాళ్లు 30 లక్షల మంది దరఖాస్తులు చేసుకుంటే.. ఆ దరఖాస్తులు చూసి బాధపడాలా? సిగ్గుపడాలా? అనే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పరిపాలన చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణాలపై హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై మేము ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. పేదలకు న్యాయం జరిగేలా చేస్తాం. న్యాయస్థానంలో మా ప్రభుత్వ ఉద్దేశం గుర్తించాలని అభ్యర్థిస్తాం. అయితే పేదవారి కోసం చేస్తున్న పక్కా ఇళ్ళ యజ్ఞాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు సాంకేతిక అంశాలను ఆసరా చేసుకొని,  తమ పలుకుబడితో వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వారి పొట్టకొడుతున్నారు. పేదల ఇంటి నిర్మాణమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే టీడీపీ అడ్డుకట్ట వేస్తుంది. ఈ విషయంలో న్యాయస్థానాలు పునఃసమీక్షిస్తాయని ఆశిస్తున్నాం. పేదల పొట్టకొట్టవద్దు అని కోరుకుంటున్నాం. ఇది క్షమించరాని విషయం. ప్రజలెవరూ దీన్ని హర్షించరు. వరుసగా స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో అయినా టీడీపీకి బుద్ధిరాలేదు. రాబోయే రోజుల్లో ఆ పార్టీ గ్రామాల్లో కూడా అడుగుపెట్టే పరిస్థితి లేదు. 

చంద్రబాబు నాయుడు విమర్శ చేసే ముందు తాను  ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి. గురివింద గింజకు తన కింద నలుపు తెలియదంట. టీడీపీ అధికారం నుంచి దిగిపోయేసరికి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన ఘనత చంద్రబాబు నాయుడిదే. ఇరవై ఏళ్ళ క్రితమే ప్రభుత్వ ఆస్తులు చంద్రబాబు అమ్మి ఇప్పుడున్న ప్రభుత్వంపై ఆరోపణలు చేయటం సిగ్గుచేటు. గ‌తంలో అధిక టారిఫ్‌ల‌కు విద్యుత్ కొనుగోలు చేయ‌డం వ‌ల్లే నేడు విద్యుత్ పంపిణీ సంస్థ‌లు న‌ష్టాల్లో కూరుకున్నాయి. విద్యుత్‌ డిస్కమ్‌లకు టీడీపీ హయాంలో వేలకోట్లు అప్పులు పెట్టారు. గత ప్ర‌భుత్వ హ‌యాంలో బ‌కాయిల‌న్నీ పెండింగ్ పెట్టి వేల కోట్ల రూపాయ‌లు చెల్లింపులు చేయ‌కుండా వ‌దిలేశారు, వాట‌న్నింటినీ ఈ ప్ర‌భుత్వ హ‌యాంలో చెల్లిస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్థం చేసి వెళ్లిపోయారు. ఇవాళ నీతి కబుర్లు చెప్పడమా?  

రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విషయంలో అయినా విమర్శించే హక్కు, అధికారం చంద్రబాబు నాయుడుకు లేదు. ఆయన చేసిన తప్పుల వల్ల రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్ళింది. పుట్టిన బిడ్డను పురిటిలోనే చంపాలనే దుర్మార్గపు ఆలోచన ఉన్న వ్యక్తి చంద్రబాబు. గత ప్రభుత్వంలా జన్మభూమి కమిటీల పేరుతో మా ప్రభుత్వం ఏమీ దోచుకోవడం లేదే? పేద ప్రజల అభ్యున్నతి కోసమే అహర్నిశలు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి పాటుపడుతున్నారు. 

ఎన్ని ఇబ్బందులు ఉన్నా,  ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పక్కా ఇళ్ళ నిర్మాణ కార్యక్రమాన్ని రెండు విడతలుగా చేపట్టడం జరిగింది. ఎన్నికల ముందు ముఖ్యమంత్రిగారు ఏమైతే హామీ ఇచ్చారో దాన్ని అమలు చేయడానికి ఎన్ని ఇబ్బందులు, అడ్డంకులు, అవరోధాలు ఎదురైనా చేసి తీరుతాం.

ఎవరైనా  అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతతో ఆలోచించాలి. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఏం చేయాలనే దానిపై ఆలోచించి మేం పరిపాలన చేస్తున్నాం. గత రెండున్నరేళ్లలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటునే మేం ముందుకు వెళుతున్నాం. 

ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఆస్తులు కుదవ పెట్టడం, విక్రయించటం అన్నది సర్వసాధారణం. అలాంటిది ప్రభుత్వంపై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయి. మాట్లాడేటప్పుడు ఆయన ఒకసారి తాను ఏం చేశాడో కూడా ఆలోచన చేసుకుంటే మంచిది. 
- ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎయిర్ ఇండియాను అమ్మితే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయా? గ్యాస్, పెట్రోల్ ధరలు పెరుగుతుంటే విపక్షాలు ఎందుకు మౌనం వహిస్తున్నాయి. దీనిపై ఎందుకు మాట్లాడటం లేదు? 

పవన్ కళ్యాణ్ వంటి బాధ్యతారాహిత్యం గల వ్యక్తి గురించి మాట్లాడుకోవటమే తప్పు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అవగాహన ఉన్న వ్యక్తి మాట్లాడితే మేము స్పందిస్తాం. బాధ్యతలేని వ్యక్తి గురించి ఏం మాట్లాడతాం. అలాంటి వ్యక్తులు గురించి, అలాంటి పార్టీలు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. 
 
సీఎం వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎన్నికల సమయంలో డ్వాక్రా సంఘాల మహిళా సోదరీమణులకు ఇచ్చిన వాగ్దానాలును అమలు చేస్తున్నారు. డ్వాక్రా మహిళల బకాయిలను నాలుగు విడతలుగా చెల్లిస్తామని వైయ‌స్ జగన్‌ చెప్పిన మాటను నిలబెట్టుకుంటున్నారు. 

Back to Top