ఈరోజు జీఓ తగలబెట్టావు.. రేపు ఇంకేంటో బాబూ?

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య సాయిరెడ్డి ట్వీట్‌

తాడేప‌ల్లి: సంక్రాంతి పండుగ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు తన స్వగ్రామం నారావారిపల్లెలో జీవో నం.1 ప్రతులను భోగిమంటల్లో తగలబెట్టిన విషయం అందరికీ తెలిసిందే! ఈ వ్యవహారంపై వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదిక‌గా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈరోజు జీవోని తగలబెట్టాడని, రేపు రాజ్యాంగాన్ని కూడా చంద్రబాబు తగలబెడతాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం తెచ్చిన జీవోను బహిరంగంగా తగలబెట్టడాన్ని బట్టి.. భారతీయ చట్టం, ప్రజాస్వామ్యం పట్ల చంద్రబాబుకు ఏమాత్రం మర్యాదలేదని స్పష్టమవుతోంది. ఈరోజు ఆయన జీవోని తగలబెట్టాడు, రేపు ప్రజాస్వామ్యాన్ని కూడా తగలబెడతాడేమో. గతంలోనూ ఇలాగే ఒకరు బహిరంగంగా ప్రభుత్వ పత్రాలను చించివేసినప్పుడు ప్రజలు ఏమనుకున్నారో అందరికీ తెలుసు. నియంత పోకడలు అంటే ఇవే’’ అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

Back to Top