చంద్రబాబు ఆటలు ఇక సాగవు

రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదు

ఒక ప్రాంత, కుల నాయకుడిగా మిగిలిపోతున్నందుకు బాబు సిగ్గుపడాలి

ఆస్తులు కాపాడుకోవడానికే ప్రజలను రెచ్చగొడుతున్నాడు

బాబు మాటలు విని అమాయక ప్రజలు, రైతులు నష్టపోవద్దు

అమరావతి రైతులకు సీఎం వైయస్‌ జగన్‌ అండగా ఉంటారు

ఎమ్మెల్యేలపై జరిగిన దాడులపై చంద్రబాబును అరెస్టు చేసి విచారించాలి

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ నందిగం సురేష్‌

తాడేపల్లి: దోచుకున్న సొమ్ము కాపాడుకునేందుకు అమరావతి రైతులను చంద్రబాబు రెచ్చగొట్టి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నాడని, ఒక ప్రాంత, ఒక కుల నాయకుడిగా మిగిలిపోతున్నందుకు సిగ్గుపడాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ నందిగం సురేష్‌ ధ్వజమెత్తారు. దుర్మార్గమైన వ్యక్తిగా, ఫ్యాక్షనిస్టుగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నాడన్నారు. రైతుల ముసుగులో టీడీపీ గూండాలు చేరి ఎమ్మెల్యేలపై హత్యాయత్నాలకు పాల్పడుతున్నారన్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఆటలు సాగవని, రాజధాని రైతులకు సీఎం వైయస్‌ జగన్‌ అన్ని విధాలుగా అండగా ఉంటారన్నారు. అమరావతి, విశాఖపట్నం, కర్నూలు మూడు ప్రాంతాల అభివృద్ధికి చంద్రబాబు అనుకూలమా..? వ్యతిరేకమా..? చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబుకు సిగ్గు, శరం, చీము, నెత్తురు ఉంటే అమరావతి పేరుతో చేసిన మోసాన్ని ఒప్పుకోవాలన్నారు.

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ నందిగం సురేష్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లారంటే.. ‘దుర్మార్గమైన వ్యక్తిగా, ఫ్యాక్షసిస్టుగా ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు. అందులో భాగంగానే మా ఎమ్మెల్యేలపై దాడి చేయించారు. దాడి చేయడమే కాదు.. ఎమ్మెల్యేలు కారు దిగి ఉంటే వారిని అంతమొందించేందుకు కూడా టీడీపీ గూండాలు వెనకాడే పరిస్థితి లేదు.
 
రాజధాని రైతులు భూముల కోసం పోరాటం అయితే.. ఉత్తరాంధ్ర, రాయలసీమ వాళ్లు అందరం బాగుండాలని పోరాటం చేస్తున్నారు. చంద్రబాబు మాత్రం దోచుకున్న సొమ్ము కోసమే పోరాటం చేస్తున్నాడు. చంద్రబాబు నైజం వారి తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాటల్లో విన్నాం. ధర్నా, బంద్‌ చేస్తే ఒక్క బస్సు అయినా, కారు అయినా తగలబడలేదా..? అని అడిగే వ్యక్తి చంద్రబాబు. అలాగే టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్‌ కూడా చంద్రబాబును ఔరంగజేబుతో పోల్చిన సందర్భాలు కోకొల్లలు. చంద్రబాబు నాయుడికి వైజాగ్‌కు అభివృద్ధి చేస్తే, కర్నూలులో హైకోర్టు పెడితే వచ్చే నష్టం ఏంటీ.. ? అమరావతి ఆందోళనలతో ఒక ప్రాంత, ఒక కుల నాయకుడిగా మిగిలిపోతున్నందుకు చంద్రబాబు సిగ్గుపడాలి. సిగ్గు, శరం వదిలేసి రాజధాని రైతులను రెచ్చగొట్టి దుర్మార్గమైన చర్య చేపట్టాలని కుట్రలు చేస్తున్నాడు.

అమరావతి రైతులను ఎలా ఆదుకోవాలో సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వానికి తెలుసు. కచ్చితంగా వారికి మెరుగైన డెవలప్‌మెంట్‌ చూపిస్తాం. ఒక వ్యక్తి బాధపడితేనే సీఎం వైయస్‌ జగన్‌ చూడలేరు. అలాంటిది 29 గ్రామాల్లోని రైతులు ఏ చిన్న ఇబ్బంది పడినా చూస్తూ ఊరుకోరు. వారికి తగిన న్యాయం చేస్తారని నమ్మకం మాకు ఉంది.

ఏదో విధంగా పబ్బం గడుపుకోవాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు. ధర్నాలు, బందుల్లో టీడీపీ గూండాలు చొరవడి దాడులకు తెగబడుతున్నారు. అల్లర్లు సృష్టించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నాడు. చంద్రబాబుపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలి. ఆందోళనల పేరుతో చేసే దాడుల్లో ఎంత కుట్ర దాగి ఉందో బయటపడుతుంది. ప్రభుత్వం, పోలీస్‌ వ్యవస్థ చంద్రబాబును విచారణ చేయాలి.

కమిటీల రిపోర్టులు తప్పుబడుతున్న చంద్రబాబు గతంలో రాజధాని ప్రాంతంలో శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికలను పక్కనబెట్టి సొంత కమిటీలు వేసి తనకు అనుకూలంగా మల్చుకున్నాడు. నారాయణ కమిటీతో రాజధాని ప్రాంతాన్ని సర్వనాశనం చేశాడు. రైతులను సర్వనాశనం చేసింది చంద్రబాబే. రాష్ట్రం విడిపోయేటప్పుడు పూర్తిగా సహకరించి.. ఇప్పుడు రాష్ట్రమంతా డెవలప్‌ చేస్తామంటే నా ఆస్తులు ఉన్నచోటే డెవలప్‌ చేయాలని చంద్రబాబు అంటున్నాడు.

ప్రపంచ మేధావిని, భవిష్యత్తు ప్రధానిని అని చెప్పుకొని చతికిలబడి చివరకు 23 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష నేతగా మిగిలిపోయాడు. ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా పోతుందని భయపడి పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారు. చంద్రబాబుకు సిగ్గు, శరం, చీము, నెత్తురు ఉంటే చేసిన తప్పును ఒప్పుకోవాలి. పూలింగ్‌ అనే చట్టబద్ధత లేని కార్యక్రమంతో రైతుల భూములు లాక్కున్నాడు. రాజధాని పేరుతో ఒక్క పర్మినెంట్‌ బిల్డింగ్‌ కూడా కట్టకుండా తాత్కాలికం పేరిట దోచుకుతిని ఇవాళ పెడబొబ్బలు పెడుతున్నాడు. చంద్రబాబు ఆటలు ఇక సాగవు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదు. రోజు రోజుకు గొడవలు పెట్టి అమరావతి ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నాడు. కాలేజీ పిల్లలను, కొంత మంది అమాయక వ్యక్తులను తీసుకువస్తున్నారు. వాళ్లంతా ఒక్కటి గుర్తుంచుకోండి.. చంద్రబాబు ఎప్పుడూ నష్టపోడు.. ఆయన మాటలు విన్న వారు మాత్రమే నష్టపోతారు.
 
హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టాను. కర్నూలు, విజయవాడ, విశాఖ, తిరుపతి నేనే డెవలప్‌ చేశానని చెప్పే చంద్రబాబు అమరావతిలో ఇడ్లీ పాత్రలు చూపించి ప్రజలను మభ్యపెట్టి సర్వనాశనం చేశాడు. నా వయస్సు అయిపోయింది. నా కుమారుడు రాజకీయంగా పనికి రాడని కనీసం ఆస్తులైనా కాపాడుకొని మనవడికి ఇవ్వాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు తప్ప రాష్ట్ర ప్రజలపై ప్రేమతో కాదు. బాబు  నీతి లేని వ్యక్తి, ఒక పద్ధతి, విధానం లేకుండా పెరిగాడు. అబ్బాకొడుకులు ఇద్దరూ  పాట్నర్‌ పవన్‌ కల్యాణ్‌తో కలిసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఇలాంటి వ్యక్తుల మాటలు నమ్మాల్సిన పనిలేదు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఏడు నెలల పాలన బ్రహ్మాండంగా ఉంది. భవిష్యత్తు దిక్సూచిలా సీఎం వైయస్‌ జగన్‌ కనిపిస్తుంటే.. వీళ్లంతా అది ఓర్వలేక అల్లర్లు సృష్టిస్తున్నారు.

 

తాజా వీడియోలు

Back to Top