విజయవాడ: ‘కోవిడ్‌తో నాన్న ఆస్పత్రిలో చేరిన నాటి నుంచి ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రతి రోజూ మా కుటుంబంతో ఫోన్‌లో మాట్లాడుతూ, మాకు భరోసా నిచ్చారు. దురదృష్టవశాత్తు నాన్న మరణం తరువాత కూడా మా కుటుంబానికి అండగా నిలిచి అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు’ అని దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కుమారుడు కల్యాణ్ చక్రవర్తి తెలిపారు. కుటుంబానికి అండాదండగా నిలిచిన సీఎం వైయస్ జగన్‌తోనే తమ ప్రయాణమని చెప్పారు. సీఎం వైయస్ జగన్‌తో భేటీ అనంతరం దుర్గాప్రసాద్ కుమారుడు కల్యాణ మీడియాతో మాట్లాడారు. ‘నాన్న మరణం తరువాత తిరుపతి ఎంపీ స్థానం ఖాళీ అయ్యింది. అందుకు ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఈ సమయంలో సీఎం వైయస్ జగన్.. మా తల్లిని, నన్ను పిలిపించి మాతో మాట్లాడారు. ఎలాంటి పదవులు వద్దూ.. మీతో కలిసి ప్రయాణించాలనుకుంటున్నాం అని సీఎంకు చెప్పాం. ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని సీఎం వైయస్ జగన్ చెప్పారు. దానికి కుటుంబం మొత్తం ఆయనకు రుణపడి ఉంటాం. ఉప ఎన్నికలో పార్టీ తరఫున ఎవరిని పోటీలో దించినా వారితో కలిసి పనిచేస్తాం. ముఖ్యమంత్రి ఖరారు చేసిన అభ్యర్థితో మా కుటుంబం మొత్తం ప్రచారంలో పాల్గొని అద్భుతమైన విజయాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తాం’ అని కల్యాణ్ చక్రవర్తి తెలిపారు.