తాడేపల్లి: పర్వతారోహకురాలు ఆశా మాలవ్య కృషిని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశంసించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని పర్వతారోహకురాలు ఆశా మాలవ్య కలిశారు. సైకిల్‌పై దేశాన్ని చుట్టివస్తున్న ప్రముఖ పర్వతారోహకురాలు ఆశా మాలవ్య తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆశా మాలవ్యను సీఎం శ్రీ వైయస్ జగన్ ప్రత్యేకంగా అభినందించారు. ఆమె లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షించారు. ఆమెకు సీఎం వైయస్ జగన్ రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు.
సైకిల్‌పై దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 25,000 కిలోమీటర్లు ప్రయాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నానని, ఇప్పటివరకు ఏపీ సహా 8 రాష్ట్రాల్లో 8 వేలకు పైగా కిలోమీటర్లు పూర్తయిందని సీఎంకి ఆశా మాలవ్య వివరించారు.
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్ జిల్లా నతారామ్ గ్రామానికి చెందిన ఆశా మాలవ్య మహిళా భద్రత, మహిళా సాధికారత అంశాలను విస్తృతంగా సమాజంలోకి తీసుకెళ్ళేందుకు దేశవ్యాప్తంగా ఒంటరిగా సైకిల్‌యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తాడేపల్లిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌ను కలిశారు.